Updated : 14/01/2023 18:00 IST

దిక్కులేని అనాథవి అంటున్నారు..

నాకు మూడేళ్ల క్రితం పెళ్లైంది. అమ్మానాన్న చనిపోవడంతో అన్నయ్యలు పెళ్లి చేశారు. పెళ్లైన తర్వాత మా అన్నలు, వదినలు నా గురించి పట్టించుకోవడం మానేశారు. మా అత్తగారు ఈ విషయంలో నన్ను చాలా హీనంగా చూస్తున్నారు. తోటి కోడళ్ల ముందు అవమానకరంగా మాట్లాడుతున్నారు. నేను దిక్కులేని అనాథనని అంటున్నారు. ఆ మాటలు నన్ను చాలా బాధిస్తున్నాయి. నా భర్త ఇవేవీ పట్టించుకోరు. ‘అమ్మ అనేది నిజమే కదా’ అని అంటుంటారు. మా అత్తగారికి గట్టిగా సమాధానం చెప్పాలని ఉంది. కానీ, ఆమె ముందు భయంతో మాట్లాడలేకపోతున్నాను. ప్రతిరోజూ ఏడుస్తున్నాను. దయచేసి నాలో భయం, బాధ తగ్గి ధైర్యం వచ్చే మార్గం చెప్పగలరు. - ఓ సోదరి.

జ. మీరు చెప్పిన విషయాలను బట్టి మీరు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు అనిపిస్తోంది. మీ అత్తగారి విషయంలో మీ భర్త సహాయం తీసుకోవడం ఎంతో అవసరం. మీ అత్తగారు పదే పదే అవమానకరంగా మాట్లాడ్డం వల్ల మీరు ఎంత వేదనకు గురవుతున్నారో తెలియజేయండి. అయినా కూడా ఆయన నుంచి సానుకూల స్పందన రాకపోతే మీ వంతుగా పరిష్కారం గురించి ఆలోచించండి. ఈ క్రమంలో మీ అత్తగారు చేసే నెగెటివ్‌ కామెంట్స్‌ని పట్టించుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఆమె మాటలకు సాధ్యమైనంత మేరకు స్పందించకుండా మీ పని మీరు చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు- ‘నా మాటల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు’ అని ఆవిడ భావించే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఆమె నుంచి అలాంటి మాటలు తగ్గే అవకాశం ఉండచ్చు. ఇక మీ అన్నయ్యల విషయానికి వస్తే.. వాళ్లు మీ గురించి పట్టించుకోకపోయినా  సరే మీరే వారిని ఒకసారి మీ ఇంటికి పిలవండి. తద్వారా వారు కూడా మిమ్మల్ని పిలిచే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీ ఒత్తిడి తగ్గడమే కాకుండా మీ అత్తగారికి అనవసరంగా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఉంటుంది. అయితే దీనికి సమయం పడుతుంది. కానీ పరిష్కారం కాని సమస్యైతే కాదు. కాబట్టి, ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించండి. మీ చదువుకు సంబంధించిన వివరాలను ప్రస్తావించలేదు. ఒకవేళ మీరు చదువుకున్నట్లయితే అందుకు సంబంధించిన ఉద్యోగం చేయడానికి ప్రయత్నించండి. లేదంటే ఏవైనా నైపుణ్యాలు నేర్చుకుని మీ కాళ్ల మీద మీరు నిలబడడానికి ప్రయత్నించండి. అదే మీలో ధైర్యాన్ని నింపుతుంది. ఎవ్వరూ మిమ్మల్ని అవమానించకుండా, ఇష్టం వచ్చినట్లు మాట్లాడకుండా ఉండడానికి తోడ్పడుతుంది. ఏదైనా పనిలో నిమగ్నమైతే  ఈ ఆలోచనల నుంచి, బాధ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇంకా బాగా సెన్సిటివ్‌గా ఫీలవుతున్నట్లయితే ఓసారి మానసిక నిపుణులను కలవండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని