ఆ అబ్బాయి వల్ల కాలేజీ మాన్పించారు.. ఏం చేయాలి?

నేను డిగ్రీ చదువుతున్నాను. కాలేజీకి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు ఒక అబ్బాయి ఏడిపించేవాడు. దాంతో నాన్న నన్ను కాలేజీ మాన్పించారు. అతను మా గ్రామంలో అందరితో మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని చెబుతున్నాడు.

Published : 20 Sep 2023 12:26 IST

నేను డిగ్రీ చదువుతున్నాను. కాలేజీకి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు ఒక అబ్బాయి ఏడిపించేవాడు. దాంతో నాన్న నన్ను కాలేజీ మాన్పించారు. అతను మా గ్రామంలో అందరితో మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని చెబుతున్నాడు. నాకు అతనంటే ఏమాత్రం ఇష్టం లేదు. ఇంతవరకు తనతో మాట్లాడిందీ లేదు. కానీ, నేను ఎంతగా ప్రయత్నించినా అమ్మానాన్న నా మాట వినడం లేదు. నన్ను కాలేజీకి పంపించనంటున్నారు. తల్లిదండ్రులు ఇలా ఎందుకు ఆలోచిస్తారో అర్థం కావడం లేదు. నాతో చదువు మాన్పించడంతో వారి మీద విపరీతమైన కోపం వస్తోంది. వాళ్లలో మార్పు తీసుకురావడానికి నా ప్రాణం తీసుకోవాలనిపిస్తోంది. మా అమ్మానాన్నలు నన్ను  అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. తల్లిదండ్రుల్లో మార్పు కోసం ప్రాణం తీసుకునేంత కఠిన నిర్ణయాలు వద్దు. మీరు సులభమైన మార్గాల ద్వారా కూడా వారిలో మార్పు తీసుకురావచ్చు. మీరు కాలేజీకి వెళ్లినప్పుడు అబ్బాయి ఏడిపించడం, గ్రామంలో మీ గురించి చెడుగా చెప్పడం వల్ల మీ తల్లిదండ్రులు బయపడి మిమ్మల్ని బయటకు పంపించడం మాన్పించారు. ఇలాంటి పరిస్థితి ఏ అమ్మాయికీ రాకూడదు. ఇతర కారణాల వల్ల చదువును మధ్యలో వదిలేయద్దు. దానివల్ల భవిష్యత్తులో నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులతో చర్చించినా సానుకూల ఫలితం రాలేదని అంటున్నారు. కాబట్టి, మీ కుటుంబానికి సన్నిహితంగా ఉండే పెద్ద వారితో చెప్పించే ప్రయత్నం చేయండి. దానివల్ల వారిలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

ప్రస్తుత రోజుల్లో ప్రేమ పేరుతో తప్పుదోవ పట్టే యువత పెరిగిపోతోంది. బహుశా మీ తల్లిదండ్రులు ఆ సంఘటనలు దృష్టిలో పెట్టుకొని భయపడుతుండచ్చు. అందువల్ల మిమ్మల్ని కాలేజీకి వెళ్లొద్దని చెప్పి ఉండచ్చు. ఇలాంటి సమయంలో వారికి మీపై నమ్మకం కలగాలి. కాబట్టి, వారికి నమ్మకం కలిగించే ప్రయత్నం చేయండి. ఒక్కసారి వారికి మీపై నమ్మకం కలిగితే తప్పకుండా తిరిగి కాలేజీకి పంపిస్తారు. అంతేకానీ కఠిన నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని పాడు చేసుకోవద్దు. దీనివల్ల మీ తల్లిదండ్రులు మరింత బాధపడే అవకాశం ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని