మా వదినే నా గురించి మావారికి చెడుగా చెబుతోంది..!
నా పెళ్లై ఏడాదవుతోంది. తల్లిదండ్రులు లేకపోవడంతో అన్నావదినలే పెళ్లి చేశారు. నా భర్త, అత్తమామలు చాలా మంచివారు. ఈ విషయంలో మా వదినకు చాలా ఈర్ష్యగా ఉంది.
నా పెళ్లై ఏడాదవుతోంది. తల్లిదండ్రులు లేకపోవడంతో అన్నావదినలే పెళ్లి చేశారు. నా భర్త, అత్తమామలు చాలా మంచివారు. ఈ విషయంలో మా వదినకు చాలా ఈర్ష్యగా ఉంది. వాళ్లింటికి వెళ్లినప్పుడల్లా మాటలతో బాధ పెట్టాలని చూస్తుంటుంది. ఈ మధ్య నా భర్తతో నా గురించి చెడుగా చెప్పడం మొదలుపెట్టింది. కాలేజీ రోజుల్లో నాకు స్నేహితులు ఎక్కువని, అబ్బాయిలతో సినిమాలకు వెళ్లేదాన్నని.. ఇలా ఏవేవో చెప్పిందట. ఆమె గురించి మా ఆయనకు తెలుసు కాబట్టి నమ్మలేదు. అయితే ఇవే మాటలు మా అత్తమామలతో చెబితే గొడవలవుతాయి. ఆమెతో గొడవ పెట్టుకుంటే మా అన్నయ్య బాధపడతాడు. అన్నయ్య బాధపడకుండా ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి
జ. ఇలాంటి సమస్యలు చాలామంది ఇళ్లల్లో జరుగుతున్నాయి. ఒకరి కారణంగా కుటుంబమంతా సమస్యల్లో చిక్కుకోవడం మనం చూస్తూనే ఉంటాం. మీ విషయానికి వస్తే ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా సమస్యను పరిష్కరించుకోవడం కష్టం. ఈ సమస్యను మీ అన్నయ్య ద్వారా పరిష్కరించుకోవడం మంచిదేమో ఆలోచించండి. జరిగిన విషయమంతా ఒకసారి మీ అన్నయ్యతో చర్చించండి. మీ వదిన గారు మీ అత్తమామలతో అవే విషయాలు చెబితే ఎలాంటి సమస్యలు వస్తాయో వివరించండి. మీ అన్నయ్య ఇద్దరివైపు నుంచి ఆలోచించి సమస్యను పరిష్కరించే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ వదినతో నేరుగా మాట్లాడితే గొడవ మరింత పెద్దదిగా మారే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇరువైపుల సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు.
అలాగే మీ అన్నావదినలతో ఉన్న కాంటాక్ట్‌ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. అంటే అత్యవసర సందర్భాలు, కార్యక్రమాల్లో మాత్రమే కలవండి. దానివల్ల కొంతకాలానికి వారికి కూడా మీ పరిస్థితి అర్థమయ్యే అవకాశం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.