Published : 11/10/2021 17:25 IST

రొమ్ము క్యాన్సర్.. కొన్ని అపోహలు - వాస్తవాలు!

రొమ్ముక్యాన్సర్.. ప్రస్తుతం మహిళలని భయపెడుతున్న వ్యాధుల్లో ముఖ్యమైనది. మన దేశంలో ఏటా దీని బారిన పడేవారు లక్షల్లో ఉంటున్నారంటే ఈ వ్యాధి తీవ్రత ఎంతో అర్థం చేసుకోవచ్చు. సరైన అవగాహన ఉంటే ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి.. దాన్ని ఎదుర్కొనే వీలుంటుంది. అయితే చాలామంది మహిళలకు రొమ్ముక్యాన్సర్ గురించి ఎన్నో అపోహలున్నాయి. అక్టోబర్ నెలను 'రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం'గా జరుపుకుంటోన్న నేపథ్యంలో ఇలాంటి కొన్ని అపోహలేంటో తెలుసుకొని, వాటిని తొలగించుకునే ప్రయత్నం చేద్దాం..

అపోహ : రొమ్ముల్లో కనిపించే గడ్డలన్నీ క్యాన్సర్ గడ్డలే.

వాస్తవం : ఇది నిజం కాదు. రొమ్ముల్లో కనిపించే గడ్డల్లో పదింట తొమ్మిది క్యాన్సర్ కారక గడ్డలు కావు. అయినా సరే గడ్డ ఏర్పడినట్లు భావించిన తక్షణం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.

అపోహ : రొమ్ము క్యాన్సర్ సాధారణంగా వయసు మీరిన వారికే వస్తుంది.

వాస్తవం : ఇది పూర్తిగా నిజం కాదు. 80 శాతం రొమ్ము క్యాన్సర్ కేసులు 50 ఏళ్ల పైబడిన స్త్రీలలోనే కనిపిస్తున్నా.. ఇటీవల కాలంలో 40 ఏళ్లు దాటిన వారిలోనూ ఈ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తోంది.

అపోహ : రొమ్ము క్యాన్సర్ పురుషులకు రాదు.

వాస్తవం : పురుషుల్లో కూడా రొమ్ము క్యాన్సర్ రావచ్చన్న విషయం చాలామందికి తెలియదు. పురుషుల్లో స్త్రీలకున్నట్లు రొమ్ములుండవు. కాబట్టి ఇది పురుషుల్లో రాదని భావించడం నిజం కాదు. రొమ్ము కణజాలం పురుషుల్లో కూడా ఉంటుంది. కాబట్టి కొంతమంది పురుషుల్లో కూడా ఈ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది.

అపోహ : రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష ప్రతి మహిళకూ అవసరం లేదు.

వాస్తవం : రొమ్ము క్యాన్సర్ రావడానికి సరైన కారణాలేంటో ఇప్పటివరకు తెలియదు. కానీ మన నిత్యజీవితంలో వివిధ అంశాలే ఈ వ్యాధికి కారణమవుతున్నాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా వ్యాధిని గుర్తించడం మంచిది. దీనికి మన ముందున్న ఏకైక మార్గమే 'రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష'. వ్యాధి లక్షణాలను వీలైనంత త్వరగా గుర్తించి.. సాధ్యమైనంత త్వరగా నివారించుకోవాలంటే ఈ పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి.

అపోహ : రొమ్ము క్యాన్సర్ వంశపారంపర్యంగా మాత్రమే వస్తుంది. కుటుంబంలో రొమ్ము క్యాన్సర్ చరిత్ర లేకపోతే మిగిలిన వారికి రాదు.

వాస్తవం : ఇది నిజం కాదు. ఎందుకంటే రొమ్ము క్యాన్సర్ బారిన పడిన వారి కుటుంబాల్లో చాలామంది ఆరోగ్యంగానే ఉంటున్నారు. వంశపారంపర్యంగా రొమ్ము క్యాన్సర్ రావడానికి 10 శాతం వరకే అవకాశాలున్నాయని నిపుణుల అభిప్రాయం.

అపోహ : బిడ్డకు పాలిస్తే రొమ్ము క్యాన్సర్ రాదు.

వాస్తవం : ఇది కొంతవరకే నిజం. బిడ్డకు పాలివ్వడం వల్ల క్యాన్సర్ రాకూడదని లేదు. అయితే రాకుండా ఉండటానికి కొంతవరకు అవకాశాలున్నాయి.

అపోహ : రొమ్ములు పెద్దగా ఉండే స్త్రీలలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.

వాస్తవం : రొమ్ముల పరిమాణానికి దీనికీ సంబంధం లేదన్నది నిపుణుల అభిప్రాయం.

అపోహ : గర్భ నిరోధక మాత్రలతో రొమ్ము క్యాన్సర్ వస్తుంది.

వాస్తవం : ఇది పూర్తిగా నిజం కాదు. ఇప్పుడు లభిస్తున్న మాత్రల్లో కొద్ది మొత్తంలోనే ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు ఉంటాయి. ఈ మోతాదుతో క్యాన్సర్ వచ్చే అవకాశం లేకపోవచ్చని నిపుణులు అంటున్నారు.

అపోహ : రొమ్ము క్యాన్సర్‌ని తొలిదశలో గుర్తించడం కష్టం.

వాస్తవం : ఇది నిజం కాదు. చేత్తో తడిమినప్పుడు గడ్డల్లా తగలడానికి కొన్నేళ్ల ముందే క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. మామోగ్రఫీ (రొమ్ము ఎక్స్‌రే) పరీక్ష ద్వారా వీటిని గుర్తించడం సాధ్యమవుతుంది. ముందే గడ్డలు గుర్తించడం వల్ల చికిత్స చాలా సులువవుతుందంటున్నారు నిపుణులు.

అపోహ : మామోగ్రఫీ పరీక్ష చాలా బాధాకరంగా ఉంటుంది.

వాస్తవం : ఇది కూడా నిజం కాదు. ఈ పరీక్ష కూడా సాధారణ ఎక్స్‌రే మాదిరే ఉంటుంది. కొంత అసౌకర్యంగా ఉన్నప్పటికీ, ఎలాంటి నొప్పీ ఉండదు. డిజిటల్ మామోగ్రఫీతో కలిగే అసౌకర్యం చాలా తక్కువగా ఉండటం గమనార్హం.

అపోహ : రొమ్ము క్యాన్సర్‌కు దారితీసే నిర్దిష్ట కారణాలేంటో వైద్య పరిశోధకులకు తెలుసు.

వాస్తవం : రొమ్ము క్యాన్సర్‌కి నిర్దిష్ట కారణాలేంటో ఇప్పటివరకూ పరిశోధకులు కూడా గుర్తించలేకపోయారు. అయితే స్త్రీ కావడం, వయసు మీరడం.. ఈ రెండూ ప్రధాన అంశాలుగా భావించవచ్చు.

అలాగే రొమ్ము క్యాన్సర్‌కి దారితీసే మరికొన్ని అంశాలు

* ఇది వరకు ఒక రొమ్ములో క్యాన్సర్ రావడం.

* కుటుంబంలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉండడం (ప్రత్యేకించి దగ్గర రక్త సంబంధీకులకు ఉండడం.)

* రుతుక్రమం చాలా చిన్న వయసులోనే ప్రారంభం కావడం (12 సంవత్సరాలలోపే ప్రారంభమైతే)

* రుతుక్రమం ఆగిపోయే దశ ఆలస్యం కావడం (55 సంవత్సరాల తర్వాత)

* పిల్లలు కలగకపోవడం, మొదటి బిడ్డ 30 ఏళ్లు దాటిన తర్వాత కలగడం.

* హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (హెచ్ఆర్‌టీ) చాలా ఎక్కువకాలం వాడడం.

* లావుగా ఉండడం (బరువు బాగా పెరగడం, ముఖ్యంగా రుతుక్రమం ఆగిపోయిన తర్వాత)

అపోహ : పైన చెప్పిన వాటిలో ఒక్క కారణం ఉన్నా.. రొమ్ము క్యాన్సర్ రావచ్చు.

వాస్తవం : పైన చెప్పిన వాటిలో కొన్ని అంశాలు వర్తించినప్పటికీ సదరు మహిళకు క్యాన్సర్ తప్పనిసరిగా వచ్చితీరుతుందని చెప్పలేం.

అపోహ : రొమ్ములకు తగిలే గాయాలు కూడా క్యాన్సర్‌కు కారణం కావచ్చు.

వాస్తవం : రొమ్ములకు తగిలే గాయాల వల్ల క్యాన్సర్ రాదు.

అపోహ : రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభదశలో గుర్తించలేం.

వాస్తవం : రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభదశలోనే గుర్తించవచ్చు. ప్రారంభదశలో గుర్తిస్తే, చికిత్స చేయడం, పూర్తిగా నయం చేయడం సాధ్యమవుతుంది.

అపోహ : రొమ్ములో గడ్డ కనబడితే తప్ప, రొమ్ము క్యాన్సర్‌ను కనిపెట్టలేం.

వాస్తవం : రొమ్ములో గడ్డ ఏర్పడడానికి కొన్ని సంవత్సరాల ముందే మామోగ్రఫీ (రొమ్ము ఎక్స్‌రే)తో కనుక్కోవచ్చు.

అపోహ : మామోగ్రఫీ పద్ధతి ద్వారా రొమ్ము క్యాన్సర్‌ని నూటికి నూరుపాళ్లూ కచ్చితంగా కనిపెట్టవచ్చు.

వాస్తవం : మామోగ్రఫీ రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభదశలోనే కనిపెట్టడానికి ఉన్న సమర్థమైన పద్ధతి. కానీ.. ఇది మిగిలిన స్క్రీనింగ్ పరీక్షల్లాగా నూటికి నూరుపాళ్లూ కచ్చితమైన విధానం కాదు. మామోగ్రఫీ కచ్చితత్వం 85శాతం మాత్రమే. దీనికి కారణాలేంటంటే..

* కొన్ని క్యాన్సర్లు మామోగ్రామ్‌లో చూడడం చాలా కష్టసాధ్యం.

* శరీరంలో దాగిన కొన్ని క్యాన్సర్ కారక కణుతులు మామోగ్రామ్‌లో కనబడవు.

ఒక్కోసారి, మామోగ్రామ్ పరిశీలించి నిర్ధరించే వ్యక్తి క్యాన్సర్‌ను కచ్చితంగా అంచనా వేయలేకపోవచ్చు. (తన వృత్తిరంగంలో ఎంత పరిణతి చెందిన వ్యక్తి అయినా ఒక్కోసారి ఈ విధంగా పొరబడవచ్చు.)


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని