Published : 15/11/2021 18:13 IST

భోజనం తర్వాత పండు.. మంచిదా? కాదా?

శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంలో పండ్ల పాత్ర కీలకం. అందుకే ఆయా సీజన్లలో లభించే పండ్లను తప్పకుండా తినమని సూచిస్తారు నిపుణులు. అయితే కొందరేమో వాటిని పరగడుపున తినడం మంచిదనుకుంటే.. మరికొందరు భోజనం తర్వాత తీసుకోమంటారు.. ఇంకొందరు పండ్ల రసాలు తాగడం ఆరోగ్యదాయకం అంటుంటారు. అయితే వీటిలో కొన్ని అపోహలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇంతకీ ఏంటా అపోహలు? వాటి వెనకున్న అసలు వాస్తవాలేంటో తెలుసుకుందాం రండి..

అపోహ : భోంచేశాకే పండు తినాలి!

వాస్తవం : భోజనం తర్వాత ఏదో ఒక పండు తినడం మంచిదన్నది చాలామంది భావన. అయితే కొంతమంది మాత్రం ఈ అలవాటు వల్ల గ్యాస్ట్రిక్‌, అజీర్తి.. వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయని స్వీయ అనుభవంతో చెబుతుంటారు. నిజానికి పండ్లలోని అధిక ఫైబర్‌ జీర్ణక్రియను మందగించేలా చేస్తుంది. తద్వారా ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. అంతేకానీ.. భోజనానికి ముందు, తర్వాత పండు తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయన్నది మాత్రం పూర్తిగా అపోహే అంటున్నారు నిపుణులు.

ఇక మరికొందరు.. పండ్లను పరగడుపున తీసుకోవడం వల్ల వాటిలోని పోషకాలన్నీ శరీరానికి అంది.. అధిక ప్రయోజనాలు చేకూరతాయనుకుంటారు. అందుకే ఉదయాన్నే అల్పాహారం సమయంలో ఏదో ఒక పండు తీసుకొని సరిపెట్టుకుంటారు. అయితే ఇది కూడా పూర్తిగా నిజం కాదంటున్నారు పోషకాహార నిపుణులు. కాబట్టి పండ్లు ఎప్పుడు తీసుకున్నా తక్కువ, ఎక్కువ ప్రయోజనాలని కాకుండా.. ఒకే రకమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని చెబుతున్నారు.

పండ్ల ముక్కల కంటే రసాలే మంచివి!

శరీరంలో నీటి స్థాయుల్ని పెంచుకోవడానికి పండ్ల రసాల్ని ప్రత్యామ్నాయ మార్గంగా ఎంచుకుంటుంటారు చాలామంది. ఈ క్రమంలోనే పండ్ల రసాలు శరీరానికి మంచివని అభిప్రాయ పడుతుంటారు. అయితే ఇది పూర్తిగా అపోహే అంటున్నారు నిపుణులు. పండ్లను రసాల రూపంలో కంటే ముక్కల రూపంలో తీసుకోవడమే మంచిదంటున్నారు. ఎందుకంటే జ్యూస్‌ చేసే క్రమంలో పండ్లలోని ఫైబర్‌ శాతం తగ్గిపోతుంది. అందుకే సాధ్యమైనంత వరకు ముక్కల రూపంలోనే వీటిని తీసుకుంటే.. పండ్లలోని పోషకాలన్నీ శరీరానికి అందుతాయి.

పండ్లు తింటే బరువు పెరగరు!

పండ్లు తినడం వల్ల బరువు తగ్గుతారే తప్ప పెరగరు అన్నది చాలామంది భావన. నిజానికి ఇది పూర్తిగా అపోహే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే పండ్లు మోతాదుకు మించి తినడం వల్ల కాలేయంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. పండ్లలో ఫ్రక్టోస్‌ రూపంలో సహజసిద్ధమైన చక్కెరలుంటాయి. ఇవి ఎక్కువైతే కాలేయం వాపుకి గురవుతుంది. ఒకానొక సమయంలో జీవక్రియల పనితీరు మందగించి కొవ్వులు, విషతుల్యాలు బయటికి పంపడంలో కాలేయం విఫలమవుతుంది. ఫలితంగా అవి ఇతర శరీర భాగాల్లో పేరుకుపోయి బరువు పెరగడానికి దారితీస్తుది. కాబట్టి ‘మితంగా తింటే అమృతం.. అమితంగా తింటే విషం’! అన్నట్లు పండ్లను మోతాదుకు మించి తీసుకోకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు.

మధుమేహులూ భోజనంతో పాటే పండు తీసుకోవచ్చు!

ఇది పూర్తిగా అపోహే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే కొంతమంది మధుమేహుల్లో జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి. కాబట్టి భోజనంతో పాటే పండు తీసుకోవడం వల్ల ఆ సమస్యలు మరింత ఎక్కువవుతాయి. కాబట్టి భోజనానికి, పండ్లకు ముడిపెట్టకపోవడమే మంచిది. అలాగే చక్కెర వ్యాధితో బాధపడే వారు పరగడుపున పండు తీసుకోకపోవడమే ఉత్తమం. ఎందుకంటే పరగడుపున పండు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు ఒక్కసారిగా పెరిగిపోతాయి. కాబట్టి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోవడం మంచిది.

పండ్లు తీసుకునే విషయంలో ఇవి కాకుండా ఇంకా ఇతర సందేహాలేవైనా ఉంటే నిపుణులతో చర్చించి నివృత్తి చేసుకోవడం మంచిది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని