వర్షాకాలంలో గోళ్ల ఆరోగ్యం కోసం..!

అసలే ఆడవాళ్లకు ఇంటి పనులు చేసే క్రమంలో చేతులు ఎక్కువసేపు నీటిలో నానుతుంటాయి. దీనికి తోడు ఈ వర్షాకాలంలో వాతావరణమంతా తేమగా ఉండడంతో ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. ఫలితంగా గోళ్లు బలహీనమైపోయి విరిగిపోవడం, సహజత్వాన్ని కోల్పోవడం.. వంటివి తలెత్తుతాయి. మరి, అలా జరగకుండా ఉండాలంటే గోళ్ల సంరక్షణ విషయంలో కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు సౌందర్య నిపుణులు.

Published : 25 Jul 2021 17:32 IST

అసలే ఆడవాళ్లకు ఇంటి పనులు చేసే క్రమంలో చేతులు ఎక్కువసేపు నీటిలో నానుతుంటాయి. దీనికి తోడు ఈ వర్షాకాలంలో వాతావరణమంతా తేమగా ఉండడంతో ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. ఫలితంగా గోళ్లు బలహీనమైపోయి విరిగిపోవడం, సహజత్వాన్ని కోల్పోవడం.. వంటివి తలెత్తుతాయి. మరి, అలా జరగకుండా ఉండాలంటే గోళ్ల సంరక్షణ విషయంలో కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు సౌందర్య నిపుణులు.

* మన శరీరంలోని అతి సున్నితమైన భాగాల్లో గోళ్లు ఒకటి. ఇవి పదే పదే నీటిలో నానడం వల్ల తేమను కోల్పోయి బలహీనమైపోతాయి. ఈ క్రమంలో వాటికి తిరిగి తేమనందించడం చాలా ముఖ్యం. ఇందుకోసం అల్ఫా హైడ్రాక్సీ ఆధారిత హ్యాండ్‌ క్రీమ్‌/లోషన్‌ వంటి వాటితో గోళ్లను కాసేపు మర్దన చేస్తే ఫలితం ఉంటుంది.

* ఇంటి పనులు చేసే క్రమంలో చేతులకు గ్లౌజులు వాడడం మంచిది. ఎందుకంటే గిన్నెలు తోమడానికి మనం ఉపయోగించే సబ్బుల్లో అసిటోన్‌ అనే రసాయనం ఉంటుంది. ఇది గోళ్లను బలహీనపరుస్తుంది.

* అలాగే నెయిల్‌ పాలిష్ రిమూవర్లలో ఉండే అసిటోన్‌ కూడా గోళ్ల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. కాబట్టి ఈ రసాయనం లేని, ‘న్యాచురల్‌’ లేదా ‘ఆర్గానిక్‌’ అని రాసున్న రిమూవర్లైతే మంచివంటున్నారు నిపుణులు.

* గోళ్లను షేప్‌ చేసుకునే క్రమంలో పదే పదే నెయిల్‌ ఫైల్‌ని ఉపయోగించడం వల్ల గోళ్లు బలహీనమవుతాయి. అందుకే దీన్ని అరుదుగా ఉపయోగిస్తూనే.. నెమ్మదిగా గోళ్లను షేప్‌ చేసుకోవడం మంచిది.

* బయట మార్కెట్లో దొరికే బేస్‌కోట్‌ నెయిల్‌ పాలిష్‌ గోళ్లకు రక్షణ కవచంలా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. తద్వారా నీళ్లలో తడిసినా గోళ్లు బలహీనపడకుండా ఇది రక్షిస్తుంది.. అలాగే గోళ్లకు సహజసిద్ధమైన మెరుపును అందిస్తుంది.

* స్నానానికి ముందు గోళ్లను పెట్రోలియం జెల్లీతో కాసేపు మర్దన చేసుకొని.. ఆపై సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. వరుసగా రెండు వారాలు ఈ చిట్కా పాటిస్తే గోళ్లు బలంగా మారతాయి.

* వర్షాకాలంలో గోళ్లు పెంచుకోవడం కంటే చిన్నగా కత్తిరించుకోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే వాటిలోకి మురికి చేరి.. ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.. ఒకవేళ పెంచుకోవాలనుకుంటే ఎప్పటికప్పుడు వాటిని శుభ్రంగా ఉంచుకోవడమూ ముఖ్యమే!

* వీటితో పాటు గోళ్ల ఆరోగ్యంలో ప్రముఖ పాత్ర వహించే బయోటిన్‌ సప్లిమెంట్స్‌ని డాక్టర్‌ సలహా మేరకు వాడచ్చు.

ఇంట్లోనే మ్యానిక్యూర్‌-పెడిక్యూర్!

ముఖ సంరక్షణకు ప్యాక్‌లు, జుట్టు ఆరోగ్యానికి హెయిర్‌మాస్కులు వేసుకోవడం ఎంత ముఖ్యమో.. వారానికోసారి గోళ్లకూ మ్యానిక్యూర్‌-పెడిక్యూర్‌ అవసరం అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఒక బౌల్‌లో నీళ్లు తీసుకొని.. అందులో రెండు టేబుల్‌స్పూన్ల హిమాలయన్‌ సాల్ట్‌, నాలుగు చుక్కల చొప్పున నిమ్మరసం, లావెండర్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌.. వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో చేతులు-కాళ్లను అరగంట పాటు ముంచి ఉంచి ఆపై శుభ్రమైన నీటితో కడుక్కోవాలి. తద్వారా గోళ్లకు పోషణ అందుతుంది.. అవి పొడిబారిపోకుండా ఉంటాయి.

మరి, ఈ వర్షాకాలంలో గోళ్ల ఆరోగ్యానికి మీరు ఎలాంటి చిట్కాలు పాటిస్తున్నారు? మాతో పంచుకోండి.. మీరిచ్చే సలహాలు ఎంతోమందికి చిట్కాల్లా ఉపయోగపడచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్