గోళ్లు పొడిబారి విరిగిపోకుండా..!

శారీరక సౌందర్యంలో గోళ్లు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే నెయిల్‌ ఆర్ట్‌, నెయిల్‌ జ్యుయలరీ.. అంటూ గోళ్లకు కూడా అదనపు సొబగులద్దుతుంటాం.  ఈ క్రమంలో గోళ్లను అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం....

Published : 22 Jul 2023 13:10 IST

శారీరక సౌందర్యంలో గోళ్లు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే నెయిల్‌ ఆర్ట్‌, నెయిల్‌ జ్యుయలరీ.. అంటూ గోళ్లకు కూడా అదనపు సొబగులద్దుతుంటాం.  ఈ క్రమంలో గోళ్లను అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎంతో అవసరం. దీనికోసం కొన్ని సహజసిద్ధమైన ఉత్పత్తులు ఉపయోగపడతాయంటున్నారు సౌందర్య నిపుణులు.

తేమను అందించాలి..

గోళ్లు పొడిబారినట్లు కనిపించడానికి తేమను కోల్పోవడం కూడా ఒక కారణం కావచ్చు. దీనివల్ల నిర్జీవంగా కనిపించడమే కాదు.. క్రమంగా పెళుసుబారడం, విరిగిపోవడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. కాబట్టి వాటికి తగినంత తేమను అందించడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో పెట్రోలియం జెల్లీ లేదంటే మాయిశ్చరైజర్‌ను గోరు మొదలు (క్యుటికల్) చుట్టూ పూసి, చేతులకు కాటన్‌ గ్లౌజుల్ని ధరించాలి. రాత్రంతా ఇలా ఉంచుకొని ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి. ఈవిధంగా తరచూ చేయడం వల్ల గోళ్లు తిరిగి తేమను సంతరించుకుంటాయి.

విరిగిపోతున్నాయా..?

గోళ్లు నిర్జీవమై, పొడిబారిపోయి విరిగిపోతున్నాయా? అయితే విటమిన్‌ ‘ఇ’ నూనెను తప్పనిసరిగా వాడాల్సిందే. కొన్ని చుక్కల విటమిన్‌ ‘ఇ’ నూనెను గోరుపై, గోరు మొదట (క్యుటికల్‌ వద్ద) వేసి కాసేపు అలాగే ఉంచాలి. ఇలా క్రమంగా చేయడం వల్ల గోళ్లకు రక్తప్రసరణ సరిగ్గా జరిగి.. కొద్ది రోజుల్లోనే గోళ్లు ఆరోగ్యంగా, అందంగా మారతాయి. అలాగే గోళ్లు పొడిబారిపోయి, విరిగిపోయే సమస్య సైతం తగ్గుముఖం పడుతుంది.

పొడిబారుతున్నాయా..?

పొడిబారిన గోళ్లకు తిరిగి జీవం పోయడానికి ఆలివ్ నూనె ఎంతగానో దోహదం చేస్తుంది. ఈక్రమంలో కొద్దిగా ఆలివ్‌ నూనె తీసుకొని కనీసం పదిహేను నిమిషాల పాటు గోళ్లను అందులో ముంచి ఉంచాలి. ఇలా నెల రోజుల పాటు వారానికోసారి, తర్వాత వారానికి రెండుసార్లు చొప్పున చేయడం ద్వారా పలు కారణాల వల్ల డ్యామేజ్‌ అయిన గోళ్లు తిరిగి జీవం పోసుకుంటాయి.

గోళ్లను ఆరోగ్యంగా, అందంగా ఉంచడంలో కొన్ని సహజసిద్ధమైన పదార్థాలతో పాటు మనం తీసుకునే ఆహారం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా బయోటిన్‌ అధికంగా ఉండే ఉడికించిన గుడ్లు, క్యాలీఫ్లవర్‌, అవకాడో వంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఫలితంగా గోళ్లు దృఢంగా, ఆరోగ్యంగా పెరుగుతాయి. అలాగే ఎ, సి విటమిన్లు, క్యాల్షియం అధికంగా లభించే ఆహార పదార్థాలను కూడా రోజూ తీసుకోవడం మంచిది. ఎందుకంటే మనం తీసుకునే ఆహారంలో ఇవి లోపిస్తే గోళ్లు పొడిబారిపోయి విరిగిపోయే అవకాశం ఉంటుంది.

ఆ అలవాటును మానుకోవాలి..

కొంతమందికి గోళ్లు కొరికే అలవాటుంటుంది. దీనివల్ల గోళ్లపై క్రిములు చేరి, వాటి పెరుగుదలను ఆటంకపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి గోళ్లను అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఈ అలవాటుకు తక్షణమే స్వస్తి పలకడం ఉత్తమం.

మసాజ్‌ చేయాలి..

గోళ్లను రోజుకోసారి మాయిశ్చరైజింగ్‌ లోషన్‌తో మసాజ్ చేయడం మర్చిపోవద్దు. ఫలితంగా రక్తప్రసరణ సరిగ్గా జరిగి అవి ఆరోగ్యంగా, దృఢంగా ఎదుగుతాయి. అంతేకాదు.. చేతులు కడుక్కున్న ప్రతిసారీ లోషన్‌ రాసుకోవడం మంచిది. తద్వారా గోళ్లకు తగినంత తేమ అందించినవారవుతారు.

పాలిష్‌ రిమూవర్‌ వద్దు..

నెయిల్‌ పాలిష్‌ వేసుకున్నప్పుడల్లా దాన్ని తొలగించడానికి పాలిష్‌ రిమూవర్‌ని ఉపయోగిస్తున్నారా? అయితే మీ గోళ్ల ఆరోగ్యాన్ని మీరే చేజేతులా పాడుచేస్తున్నారన్నమాట. ఎందుకంటే రిమూవర్‌లో ఉండే ఎసిటోన్‌ గోళ్లను పొడిబారేలా చేస్తుంది. కాబట్టి నెలకు రెండుసార్లకు మించి రిమూవర్‌ వాడకుండా జాగ్రత్తపడడం ఉత్తమం. అలాగే నెయిల్‌ పాలిష్‌ వేసుకునేటప్పుడు ఒకే కోట్‌ కాకుండా, డబుల్‌ కోటింగ్‌ వేయడం వల్ల గోళ్లు త్వరగా విరిగిపోకుండా జాగ్రత్తపడచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని