గోళ్లు విరిగిపోతున్నాయా?

చక్కగా పొడవాటి గోళ్లు పెంచుకుని వాటికి నెయిల్‌పాలిష్, నెయిల్ ఆర్ట్ వేసి చూడండి.. ఎన్ని హొయలు పోతాయవి..! అందుకే గోళ్లకు రకరకాల రంగులు, నెయిల్ ఆర్ట్స్ వేసి అదరగొట్టేయాలని ప్రతిఒక్కరూ అనుకుంటూ ఉంటారు. అయితే సౌందర్య సంరక్షణలో మిగతా భాగాల మీద చూపించినంత శ్రద్ధ గోళ్లపై అంతగా చూపించరు. అందుకే గోళ్లు కాస్త పొడవు పెరిగినా వెంటనే విరిగిపోతుంటాయి. ఈ సమస్య నుంచి బయటపడటానికి ఏం చేయాలంటే;

Published : 23 Oct 2021 18:56 IST

కమల: హాయ్ సుమా..! ఏంటీ పొద్దున్నే మంచి బిజీగా ఉన్నావ్..

సుమ: అదేం లేదు కమల.. కాస్త భిన్నంగా ఉంటుందని వెరైటీ నెయిల్ ఆర్ట్ వేసుకుంటున్నాను. నువ్వు చూసి చెప్పు.. ఎలా ఉంది??

కమల: చాలా బాగుంది.. నాకు కూడా వేసుకోవాలని ఉంది.. కానీ నా గోళ్లు పొడవుగా పెరగవు. కాస్త పెరగగానే విరిగిపోతున్నాయి. అందుకే ఇక చిరాకు వచ్చి పెంచడం మానేశా..!

సుమ: ఓస్.. ఇంతేనా..! గోళ్లు విరిగిపోవడం ఏమీ అంత పెద్ద సమస్య కాదు.. ఇంట్లో లభించే వస్తువులతోనే సులువైన చిట్కాల ద్వారా దీనికి పరిష్కారం లభిస్తుంది తెలుసా??

కమల: అవునా..! అవేంటో చెప్పవూ.. ప్లీజ్..

కేవలం కమలకే కాదు.. గోళ్లు విరిగిపోవడం అనే సమస్య చాలామంది మహిళలకు ఎదురయ్యేదే. మరి దీనికి పరిష్కారం ఏమిటో మీరే చూడండి...

చక్కగా పొడవాటి గోళ్లు పెంచుకుని వాటికి నెయిల్‌పాలిష్, నెయిల్ ఆర్ట్ వేసి చూడండి.. ఎన్ని హొయలు పోతాయవి..! అందుకే గోళ్లకు రకరకాల రంగులు, నెయిల్ ఆర్ట్స్ వేసి అదరగొట్టేయాలని ప్రతిఒక్కరూ అనుకుంటూ ఉంటారు. అయితే సౌందర్య సంరక్షణలో మిగతా భాగాల మీద చూపించినంత శ్రద్ధ గోళ్లపై అంతగా చూపించరు. అందుకే గోళ్లు కాస్త పొడవు పెరిగినా వెంటనే విరిగిపోతుంటాయి. ఈ సమస్య నుంచి బయటపడటానికి ఏం చేయాలంటే;

తేమను అందించండి

గోళ్లలో తేమని నిలిపి ఉంచే గుణం ఉండదు కాబట్టి అవి పొడిబారి పెళుసుగా మారే అవకాశం ఉంటుంది. అందుకే కాస్త పొడుగు పెరగ్గానే వెంటనే విరిగిపోతుంటాయి. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే గోళ్లకు అవసరమైన తేమని అందించడం చక్కటి ప్రత్యామ్నాయం. ఒక చెంచా ఆలివ్ ఆయిల్‌కు కొద్దిగా నిమ్మరసం జతచేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రిపూట నిద్రపోయే ముందు గోళ్లకు బాగా పట్టించి, మర్దన చేసుకుని, గ్లౌవ్స్ వేసుకోవాలి. తెల్లవారే సరికి గోళ్లు లేతగా మారడాన్ని గమనించవచ్చు. అలాగే ఒక గిన్నెలో ఆలివ్ ఆయిల్ తీసుకుని గోళ్లను రోజూ 15 నిమిషాల పాటు నాననివ్వండి. ఇలా క్రమంగా చేయడం వల్ల పెళుసుదనం తగ్గి మృదువుగా మారతాయి. పోషణ కూడా అంది పొడుగ్గా పెరుగుతాయి.

రోజూ రాత్రిపూట..

పగలంతా ఏదో ఒక పనితో బిజీగానే ఉంటాం కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు గోళ్లను సంరక్షించుకోవడానికి అవసరమయ్యే జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే విటమిన్ 'ఇ', కొలాజెన్ అధికంగా ఉండే మాయిశ్చరైజర్‌ను ఎంపిక చేసుకుని రోజూ 15 నుంచి 20 నిమిషాల పాటు వేళ్లు, గోళ్లకు మర్దన చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగై చక్కటి గోళ్లే కాదు.. మృదువైన, కోమలమైన చేతులు కూడా మన సొంతమవుతాయి. అలాగే ఇంట్లో ఆవనూనె ఉంటే కొద్దిగా గిన్నెలోకి తీసుకోండి. మీ గోళ్లు అందులో 15 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేయడం వల్ల గోళ్ల ఆరోగ్యం మెరుగవడమే కాకుండా అందమైన గోళ్లు కూడా మన సొంతమవుతాయి.

పాలతో ఇలా..

పాలతో గోళ్లని అందంగానే కాదు ఆరోగ్యవంతంగా కూడా మార్చుకోవచ్చు. ఎలాగంటే గోరు వెచ్చని పాలలో పది నిమిషాలపాటు గోళ్లని ఉంచితే.. గోళ్లు మృదువుగా మారి అందంగా కనిపిస్తాయి. ఒక్కోసారి తగినంత క్యాల్షియం అందక కూడా గోళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ సమస్య తగ్గాలంటే.. పాలని ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

మురికి కూడా..

అందంగా గోళ్లు పెంచుకోవాలనుకుంటే అవి శుభ్రంగా ఉండేలా కూడా జాగ్రత్తపడాల్సి ఉంటుంది. లేదంటే గోళ్లపై ఉండే మురికి వల్ల బ్యాక్టీరియా చేరి గోళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం లేకపోలేదు. అందుకే ఓ కప్పు గోరు వెచ్చని నీళ్లలో కొద్దిగా నిమ్మరసం కలిపి గోళ్లను కాసేపు అందులో ఉంచితే గోళ్లకు పట్టిన మురికి పోతుంది. దాంతో తెల్లగా, అందంగా కనపడతాయి.

కారణాలేంటీ???

అసలు గోళ్లు విరగడానికి పోషకాహార లోపం ఒక కారణమైతే.. మన అలవాట్లు కూడా మరో కారణం. రోజూ బట్టలు ఉతికినప్పుడు లేదా గిన్నెలు శుభ్రం చేసేటప్పుడు గాఢత నిండిన సబ్బులు, డిటర్జెంట్లు గోళ్లకి తగులుతూ ఉండటం వల్ల అందులోని రసాయనాల ప్రభావం గోళ్ల మీద పడుతుంది. అలా అని రోజూ వారీ పనుల్ని ఆపలేం కాబట్టి.. కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకొంటే సరిపోతుంది.

* ఇంటి పనులు చేసేప్పుడు గ్లౌజులు ధరిస్తే గోళ్ల మీద ప్రత్యక్షంగా ఎలాంటి ప్రభావం అంతగా ఉండదు. అలాగే డిటర్జెంట్స్ ఉపయోగించి పనిచేసిన వెంటనే అది గోళ్లలో ఎక్కడా ఇరుక్కోకుండా వెంటనే నీటితో శుభ్రం చేసుకోవాలి.

* ఇంట్లో బిగుసుకుపోయిన డబ్బా మూతలు తీయడానికి కూడా కొందరు గోళ్లని ఉపయోగిస్తూ ఉంటారు. ఒకవేళ అవి మరీ బిరుసుగా కనుక ఉంటే గోళ్లు విరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఏ పని చేసినా గోళ్ల మీద ఎక్కువ ఒత్తిడి కలగకుండా జాగ్రత్తపడాలి.

వీటితో పాటు గోళ్లను ఎలా పడితే అలా వదిలేయకుండా చక్కగా షేప్ చేసుకుంటూ ఉండాలి. వీలైతే 15 రోజులకోసారి ఇంట్లోనే పెడిక్యూర్, మ్యానిక్యూర్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యకరమైన, పొడవైన గోళ్లు మన సొంతమవుతాయి. అలాగే గోళ్ల ఆరోగ్యంలో బయోటిన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి అది పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు అంటే.. ఉడకబెట్టిన కోడిగుడ్లు, తృణధాన్యాలు, క్యాలీఫ్లవర్.. మొదలైనవాటిని రోజూ తీసుకునే ఆహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది.

వీటికి దూరంగా...

* నెయిల్‌పాలిష్ రిమూవర్ల వాడకాన్ని ఎంత వీలైతే అంతగా తగ్గించేయాలి. నెలకి ఒకటి లేదా రెండుసార్లు ఉపయోగించడానికి పరిమితం కావాలి. ఎందుకంటే అందులో ఉండే రసాయనాలు అధిక గాఢత కలిగి ఉంటాయి. ఇవి గోళ్ల ఆరోగ్యాన్ని సులభంగా దెబ్బతీస్తాయి. నెయిల్‌పాలిష్ రిమూవర్లో ఉండే ఎసిటోన్ గోళ్లకు మంచిది కాదు. కాబట్టి ఎసిటోన్ రహిత రిమూవర్లను ఎంచుకోవాలి.

చూశారు కదండీ.. పొడవైన, ఆరోగ్యమైన గోళ్లను సొంతం చేసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?? ఇంట్లోనే అందుబాటులో ఉండే వస్తువులు, పదార్థాలు ఉపయోగించి ఎలాంటి సంరక్షణ చేసుకోవాలి??.. మొదలైన విషయాలు.. ఈ సారి మీరు కూడా ఇవన్నీ గుర్తుంచుకుని మీ గోళ్లను చక్కగా పెంచేసుకోండి. వాటికి స్త్టెలిష్ లుక్ ఇచ్చి ఫ్యాషనబుల్‌గా మారిపోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్