Published : 18/02/2023 19:06 IST

నెయిల్ఆర్ట్ ఎక్కువ రోజులు ఉండాలంటే..!

పండగలు, శుభకార్యాలు, ప్రత్యేక సందర్భాలప్పుడు కూడా మామూలుగానే ముస్తాబైతే ఏం బాగుంటుంది? అందుకే కదా.. అలాంటప్పుడు చాలా స్పెషల్‌గా కనిపించాలని అదిరిపోయే డ్రస్సు, మ్యాచింగ్ యాక్సెసరీస్, స్పెషల్ నెయిల్ ఆర్ట్.. మొదలైనవి ఎంచుకునేది అంటారా? అయితే వీటిలో మీరు ఎంతో స్పెషల్‌గా వేసుకునే నెయిల్ ఆర్ట్ ఎన్ని రోజులు అలాగే ఉంటుంది? ఎప్పుడైనా గమనించారా? ఇంతకీ ఎంతో ఇష్టపడి వేసుకున్న నెయిల్ ఆర్ట్ ఎక్కువ రోజులు అలాగే ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

పొడవాటి గోళ్లు అలా పెంచేసి, డ్రస్‌కు నప్పే నెయిల్‌పాలిష్ వేసుకుని వదిలేస్తే అవి ఎన్ని వయ్యారాలు పోతుంటాయో కదూ.. అందుకే కదా.. కేవలం నెయిల్‌పాలిష్ వేసుకోవడంతో ఆగకుండా నెయిల్ ఆర్ట్స్ ద్వారా రకరకాల కళాకృతులను కూడా గోళ్ల మీదే తీర్చిదిద్దేస్తూ ఉంటాం. అయితే మనం ఎంతో అపురూపంగా వేసుకునే నెయిల్ ఆర్ట్ ఎక్కువ రోజుల పాటు అలాగే నిలిచి ఉండాలంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే.

ఇష్టం కదా అని గోళ్లు ఎంత పెరిగితే అంత పొడుగూ పెంచేసుకోకూడదు. మీరు రోజువారీ చేసే పనులను దృష్టిలో పెట్టుకుని ఎంతమేరకు అవసరమైతే అంతే పెంచుకోవడం ఉత్తమం. లేదంటే రోజువారీ పనులు చేసుకునేటప్పుడు, కీబోర్డు మీద టైప్ చేసేటప్పుడు, బరువులు ఎత్తేటప్పుడు.. ఇలా వివిధ సందర్భాల్లో పొడవాటి గోళ్లు తొందరగా విరిగిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి మీ పనులకు ఆటంకం కలగనంతవరకు పెంచుకుంటే సరిపోతుంది.

పైగా నెయిల్ ఆర్ట్ వేసుకున్న పొడవాటి గోళ్లు విరిగిపోతే ఆర్ట్ కూడా సగం పోయి అందాన్ని కోల్పోతుంది.

కావలసినంత వరకే గోళ్ల పొడవును ఉంచుతూ ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి.

మనం వేసుకునే నెయిల్ పాలిష్ గోళ్లకు సరిగా అతుక్కోవాలంటే ముందుగా ఇంతకు ముందు వేసిన రంగు, దాని అవశేషాలు పూర్తిగా పోయేలా నెయిల్‌పాలిష్ రిమూవర్‌తో శుభ్రం చేసుకోవాలి.

నెయిల్ ఆర్ట్ వేసుకునే ముందు గోళ్లను యాపిల్ సైడర్ వెనిగర్‌లో కొన్ని నిమిషాల పాటు ముంచి ఉంచాలి. దీనివల్ల మనం వేసుకునే ఆర్ట్ గోళ్లకు బాగా పడుతుంది కాబట్టి ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది.

ఈ పద్ధతి వీలుకాకుంటే సోప్ కలిపిన గోరువెచ్చని నీళ్లలో గోళ్లను కాసేపు ముంచి ఉంచాలి. తర్వాత బయటకు తీసి ఒక పొడి క్లాత్‌తో శుభ్రం చేసుకోవాలి. లేదంటే నిమ్మరసంలో 8 నుంచి 10 నిమిషాల పాటు ముంచి, తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గోళ్లు గట్టిపడటమే కాదు.. గోళ్లు పసుపు రంగులోకి మారడం అనే సమస్యని దరి చేరనీయదు.

నెయిల్ ఆర్ట్ వేసుకోవడానికి ముందుగా గోళ్లను సిద్ధం చేసుకోవాలి. అంటే రిమూవర్‌తో ఒకసారి శుభ్రపరిచి, వాటిని షేప్ చేసి అవసరమైతే ఫైలింగ్ చేసి స్మూత్‌గా ఉండేలా చూసుకోవాలి.

తర్వాత బేస్‌కోట్ వేసుకోవాలి. ఆ తర్వాత నాణ్యమైన నెయిల్‌పాలిష్ ఎంచుకుని నచ్చిన నెయిల్ ఆర్ట్‌ని వేసుకోవాలి. చివరిగా టాప్‌కోట్ కూడా వేసుకోవాలి. ఇక్కడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ క్రమంలో ముందుగా ఒక కోటింగ్ పలుచగా వేసి, అది కాస్త ఆరిన తర్వాత దాని మీద రెండో కోటింగ్ వేసుకోవాలి. ఆ తర్వాతే నెయిల్ ఆర్ట్ వేసుకోవాలి. అయితే ఆర్ట్ వేసుకునేటప్పుడు ఉపయోగించే స్టోన్స్, బీడ్స్.. వంటివి అతికించడానికి నెయిల్ గ్లూనే వాడాలి.

అలాగే మనం ఎంచుకునే నెయిల్‌పాలిష్ కూడా కొట్టొచ్చినట్లు కనిపించాలనే తాపత్రయంతో ఎక్కువ కోటింగ్స్ వేస్తే గోళ్లకు అతుక్కోదు సరికదా అది మందంగా మారి మొత్తం ఆర్ట్ అందాన్ని చెడగొడుతుంది.

ఇక చివరిగా నెయిల్ ఆర్ట్ వేసుకోవడం పూర్త్తెన తర్వాత కాసేపు ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీళ్లలో గోళ్లను ముంచి ఉంచితే నెయిల్‌పాలిష్ తొందరగా గట్టిపడుతుంది. అలాగే ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని