Updated : 19/03/2022 13:16 IST

Youngest MLA : రైతు బిడ్డ ఎమ్మెల్యే అయింది!

(Photos: Facebook)

రాజకీయాల్లో రాణించాలంటే డబ్బు, పలుకుబడి ఉండాలనుకుంటారు. కానీ సాటి మనిషికి సహాయం చేయగలిగే మంచి మనసుంటే చాలు.. ప్రజల మనసుల్ని గెలుచుకోవచ్చని నిరూపించింది పంజాబ్‌కు చెందిన 27 ఏళ్ల నరీందర్‌ కౌర్‌ భరాజ్‌. ఇటీవలే జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్ధండుల్ని ఓడించి మరీ అసెంబ్లీలోకి అడుగుపెట్టిందామె. తద్వారా ఆ రాష్ట్ర అసెంబ్లీలోనే అతి పిన్న ఎమ్మెల్యేగా ఘనత సాధించింది. ఊరు పేరునే తన ఇంటి పేరుగా మార్చుకొన్న కౌర్‌.. తన గ్రామంలోని మహిళలు, పిల్లల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతానంటోంది.

ఇటీవలే జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలకు గానూ 92 సీట్లు గెలుచుకుంది ఆప్‌. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భగవంత్‌ మాన్‌తో సహా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. వీళ్లందరిలోకెల్లా 27 ఏళ్ల నరీందర్‌ కౌర్‌ భరాజ్‌ పిన్న వయస్కురాలు! కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ మంత్రి అయిన విజయ్‌ ఇందర్‌ సింగ్లాపై 36,430 ఓట్ల తేడాతో విజయం సాధించిందామె. తద్వారా సంగ్రూర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తాజాగా పదవి చేపట్టింది. ఇలా ఆమె గెలుపును ‘ఉద్ధండులపై సాధించిన విజయం’గా పేర్కొంటున్నారు అక్కడి ప్రజలు.

రైతు కుటుంబం నుంచి..!

సంగ్రూర్‌ నియోజకవర్గం భరాజ్‌ గ్రామంలో జన్మించింది నరీందర్‌ కౌర్‌ భరాజ్‌. ఆమె తండ్రి గుర్నామ్‌ సింగ్‌.. స్థానికంగా ఉన్న ఐదెకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ పంటలు పండిస్తారు. పటియాలాస్‌ పంజాబీ యూనివర్సిటీ నుంచి సోషియాలజీలో మాస్టర్స్‌ డిగ్రీ చేసిన కౌర్‌.. సంగ్రూర్‌ లా కాలేజీలో న్యాయ విద్యను అభ్యసించింది. తన గ్రామం భరాజ్‌ అంటే ఆమెకు అమితమైన ప్రేమ. అందుకే ఊరి పేరునే ఇంటి పేరుగా తన అసలు పేరుకు జతచేసుకుందీ యంగ్‌ పొలిటీషియన్‌. అయితే తాజా విజయంతో అందరూ తననో వీఐపీలా చూస్తున్నారని, కానీ ఇదివరకటి లాగే ఇప్పుడూ, ఇక ముందు కూడా తాను సాదాసీదాగా ఉండడానికే ఇష్టపడతానంటూ తన నిరాడంబరతను చాటుకుంది కౌర్‌.

నేను వీఐపీని కాదు!

‘గతంలో మా అమ్మతో కలిసి స్కూటీపై నామినేషన్‌ వేయడానికి వచ్చాను. ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి అమ్మతో కలిసి బయటికి వెళ్లాను. అయితే ఇప్పుడు ఒక రకమైన ట్రెండ్‌ మొదలైంది. అందరూ నన్నో వీఐపీలా భావించడం మొదలుపెట్టారు. కానీ నాకు ఇలాంటి హోదాలు నచ్చవు. నేను గతంలో ఎలా ఉన్నానో.. ఇప్పుడూ, ఇక ముందు కూడా సాధారణ వ్యక్తిలా ఉండడానికే ఇష్టపడతా. అయితే ప్రజలను నేను కోరుకునేది ఒక్కటే.. ఈ వీఐపీ సంస్కృతికి స్వస్తి పలికి.. ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది..’ అంటూ చెప్పుకొచ్చింది కౌర్‌.

పార్టీతో ఎనిమిదేళ్ల అనుబంధం!

చదువుకునే రోజుల్లోనే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుంది కౌర్‌. ఈ క్రమంలోనే 2014లో ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరింది. అప్పటికి ఆమెకు 19 ఏళ్లు. ఆ ఏడాదే లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో భగవంత్‌ మాన్‌కు పోలింగ్‌ ఏజెంట్‌గా పనిచేసింది కౌర్‌. ఇక 2018లో ఆప్‌ యూత్‌ వింగ్‌ (సంగ్రూర్‌ యూనిట్‌) అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టింది. ఇక ఈసారి ఏకంగా సంగ్రూర్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ప్రత్యర్థిపై భారీ మెజార్టీతో విజయం సాధించింది. తద్వారా 27 ఏళ్ల వయసులో అతి పిన్న ఎమ్మెల్యేగా ఆ రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టింది. మ్యానిఫెస్టోలో ఉన్న అన్ని హామీల్ని నెరవేర్చడమే ప్రస్తుతం తన ముందున్న తక్షణ కర్తవ్యం అంటోందీ యువ ఎమ్మెల్యే.

డబ్బు విలువ తెలిసిన దాన్ని!

‘నేను అసెంబ్లీలో అతి పిన్న వయసున్న ఎమ్మెల్యేనే కావచ్చు.. కానీ అందరిలాగే నాకూ సమాన బాధ్యతలుంటాయి. ఈ నియోజకవర్గ ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు వేయడం, మురుగు నీటి వ్యవస్థను బాగు చేయడమే కాదు.. అవినీతిని అంతమొందించడం, ఆరోగ్యం-విద్యా వ్యవస్థల్ని మెరుగుపరచడం! ఈ క్రమంలో దిల్లీ మోడల్‌నే పంజాబ్‌లోనూ అమలు చేయాలనుకుంటున్నాం. ప్రచార సమయంలో నేను ఓటర్లకు ఇచ్చిన హామీ కూడా ఇదే! ఇక మహిళలు-పిల్లల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తా. ఒక మధ్య తరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు డబ్బు విలువ తెలియనిది కాదు. ముఖ్యంగా మహిళలు తాము పని చేసినా, చేయకపోయినా వాళ్లకంటూ కొన్ని అవసరాలుంటాయి. పిల్లలకు పుస్తకాలు కొనివ్వడం కావచ్చు.. వాళ్లకు ప్రేమగా ఏదైనా బహుమతి ఇవ్వాలనిపించచ్చు.. ఇలాంటి సమయాల్లో వాళ్ల చేతిలో డబ్బుండాలి. అందుకే నెలకు రూ. 1000 వారి ఖాతాలో జమ చేయాలనుకుంటున్నా..’ అంటూ ఎమ్మెల్యేగా తాను చేయబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పుకొచ్చింది కౌర్‌.

ఆత్మవిశ్వాసమే తన ఆయుధంగా మలచుకున్న కౌర్‌.. తాను ఎమ్మెల్యే అయినా అన్ని హోదాలు పక్కన పెట్టి.. ప్రజల వద్దకు స్కూటీపైనే వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటానంటోంది. ఇలా ఇంత పిన్న వయసులోనే తలపండిన రాజకీయ నాయకురాలిగా మాట్లాడుతూ, నిరాడంబరతను చాటుకుంటోన్న ఈ యువ ఎమ్మెల్యేపై ప్రస్తుతం పంజాబ్‌ ప్రజలే కాదు.. దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘కీప్‌ ఇట్‌ అప్‌’ అంటూ ఆమె వెన్నుతడుతున్నారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని