కట్‌ చేస్తే గానీ తెలియదు.. అది కేక్‌ అని!

అరె.. ఈ గుత్తొంకాయ భలే తాజాగా ఉందే.. కూర వండేద్దాం అనుకుంటున్నారా? అయితే మీరు పొరపడినట్లే!మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురుంటారంటారు.. ఆ మరో వ్యక్తి తనేనేమో.. అనుకొని పప్పులో కాలేసేరు!అబ్బ.. ఈ హ్యాండ్‌బ్యాగ్‌ ఎంత ఆకర్షణీయంగా ఉందో.. ఎక్కడ కొన్నారా అనుకుంటున్నారా?ఒక్కోసారి మన కళ్లు మనల్నే మోసం చేస్తాయంటారు. ఒహాయోకు చెందిన కేక్‌ బేకర్‌ నటాలీ సైడ్‌సెర్ఫ్‌ తయారుచేసే కేక్స్‌.....

Updated : 05 Nov 2023 11:14 IST

(Photos: Instagram)

అరె.. ఈ గుత్తొంకాయ భలే తాజాగా ఉందే.. కూర వండేద్దాం అనుకుంటున్నారా? అయితే మీరు పొరపడినట్లే!

మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురుంటారంటారు.. ఆ మరో వ్యక్తి తనేనేమో.. అనుకొని పప్పులో కాలేసేరు!

అబ్బ.. ఈ హ్యాండ్‌బ్యాగ్‌ ఎంత ఆకర్షణీయంగా ఉందో.. ఎక్కడ కొన్నారా అనుకుంటున్నారా?

ఒక్కోసారి మన కళ్లు మనల్నే మోసం చేస్తాయంటారు. ఒహాయోకు చెందిన కేక్‌ బేకర్‌ నటాలీ సైడ్‌సెర్ఫ్‌ తయారుచేసే కేక్స్‌ చూస్తే ఇది నిజమనిపించకమానదు. ‘కాదేదీ కళకనర్హం’ అన్నట్లు.. ఈ సృష్టిలో దేన్నైనా కేక్‌గా మలచచ్చని నిరూపిస్తోందామె. వాస్తవికతకు అత్యంత దగ్గరగా ఉండేలా ఆమె తయారుచేసే కేక్స్‌ని కట్‌ చేస్తే గానీ తెలియదు.. అది వస్తువు కాదు.. కేక్‌ అని! ఇలా ఆమె కేక్‌ బేకింగ్‌ నైపుణ్యాలు ఎప్పటికప్పుడు నెటిజన్లని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే తనను పోలిన ఓ కేక్‌ను రూపొందించిన ఆమె.. ఆ ఫొటోను ఇటీవలే ఇన్‌స్టాలో పంచుకోగా అది విపరీతంగా వైరలైంది. ఈ నేపథ్యంలో ఈ కేక్‌ క్వీన్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..!

కేక్స్‌ అంటే ఎవరికిష్టముండదు చెప్పండి.. అయితే మనమంతా వీటి రుచిని ఆస్వాదిస్తూ ఎంజాయ్‌ చేస్తే.. నటాలీ మాత్రం సరికొత్త కేక్స్ తయారుచేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఒహాయోలో పుట్టి పెరిగిన ఆమె.. కేక్‌ బేకింగ్‌పై మక్కువతో ‘ఒహాయో స్టేట్‌ యూనివర్సిటీ’ నుంచి ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ పూర్తిచేసింది.

ఫ్రెండ్‌ సలహాతో..!

చదువు పూర్తి కాగానే కేక్స్‌ తయారుచేయడంపై దృష్టి పెట్టింది నటాలీ. ఈ క్రమంలో విభిన్న ఆకృతుల్లో ఆకర్షణీయమైన కేక్స్‌ రూపొందించేదామె. ఇలా తనలోని ప్రత్యేక కేక్‌ బేకింగ్‌ నైపుణ్యాల్ని గుర్తించిన ఆమె ఫ్రెండ్‌ ఒకరు.. ‘నువ్వు స్కల్పర్చ్‌డ్‌ కేక్స్‌ ఎందుకు రూపొందించకూడదు?’ అని సలహా ఇచ్చారు. దీంతో తన దృష్టిని ఈ తరహా కేక్స్ పైకి మళ్లించిందామె. దీనికి మంచి స్పందన రావడంతో ఇందులో నైపుణ్యాలు మెరుగుపరచుకోవాలని నిర్ణయించుకుంది. అదే సమయంలో తన భర్తతో కలిసి ఆస్టిన్‌కు వెళ్లిపోయిన ఆమె.. అక్కడి ఓ బేకరీలో పనిచేయడం ప్రారంభించింది. ఆ వేదికగానే స్కల్పర్చ్‌డ్‌ కేక్స్‌కు సంబంధించిన మెలకువలు నేర్చుకోవడం మొదలుపెట్టిందామె.

ఆ ఫొటోతో వైరల్!

అటు కేక్‌ బేకింగ్‌ నైపుణ్యాలు నేర్చుకుంటూనే.. ఇటు తన సృజనాత్మకతతో సరికొత్త కేక్స్‌ రూపొందించేది నటాలీ. అయితే ఓ కేక్‌ బేకింగ్ పోటీలో పాల్గొని తాను తయారుచేసిన ఓ సెలబ్రిటీ కేక్‌ తనకు ఎనలేని గుర్తింపు తీసుకొచ్చిందని చెబుతోందీ కేక్‌ క్వీన్‌. ‘2008 నుంచే నా కేక్‌ బేకింగ్‌ ప్రయాణం మొదలైంది. స్కల్పర్చ్‌డ్‌ కేక్స్‌కు సంబంధించిన మెలకువలు నేర్చుకుంటున్న క్రమంలోనే 2012లో ఓ కేక్‌ పోటీలో పాల్గొనే అవకాశం వచ్చింది. అందులో భాగంగా ఆమెరికాకు చెందిన ప్రముఖ సంగీత కళాకారుడు విల్లే నెల్సన్‌ను పోలిన కేక్‌ తయారుచేశాను. దీనికి సంబంధించిన ఫొటోను నా సోదరుడు రెడిట్‌లో పోస్ట్‌ చేశాడు. దానికి వీక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. దానికొచ్చిన ఓట్లు ఆ ఫొటోను మొదటిపేజీలో మొదటి స్థానంలో నిలిపాయి. దీంతో నాలో ఆత్మవిశ్వాసం రెట్టించింది. ఈ క్రమంలోనే వాస్తవికతకు దగ్గరగా ఉండేలా మరిన్ని ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాను..’ అంటూ చెప్పుకొచ్చింది నటాలీ.

అది వస్తువు కాదు.. కేక్!

ఇలా అప్పట్నుంచి విభిన్న స్కల్పర్చ్‌డ్‌ కేక్స్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయిన నటాలీ.. తాను రూపొందించిన కేక్స్‌తో ‘సైడ్‌సెర్ఫ్ కేక్‌ స్టూడియో’ పేరుతో సొంత బేకరీని తెరిచింది. మరోవైపు సోషల్‌ మీడియా పేజీల వేదికగా ఆయా ఫొటోల్ని, తయారీకి సంబంధించిన కొన్ని వీడియోల్ని ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేస్తుంటుందామె. పండ్లు, కాయగూరలు, జంతువులు, వస్తువులు, విభిన్న ఆహార పదార్థాలు, బార్బీ డాల్‌, హాలోవీన్‌ థీమ్‌తో రూపొందించినవి, ఫ్యాషనబుల్‌ యాక్సెసరీస్‌, మనిషిని పోలినట్లుగా ఉండేవి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సృష్టిలో ఆమె కేక్‌గా మలచని వస్తువు లేదంటే అతిశయోక్తి కాదు. పైగా అది ఎంత వాస్తవికతతో ఉంటుందంటే.. దాన్ని కట్‌ చేసే దాకా అది కేక్‌ అన్న విషయం మనం గుర్తుపట్టలేనంతగా!

‘సాధారణ స్కల్పర్చ్స్‌ అయితే నేరుగా కేక్‌ తయారుచేసేస్తా. అదే కాస్త క్లిష్టమైన నమూనాలైతే ముందు స్కెచ్‌ వేసుకొని.. ఆపై కేక్‌ తయారుచేస్తా. కేక్‌ వాస్తవికతకు దగ్గరగా రావడానికి దాని ఉపరితలంపై మోడలింగ్‌ చాక్లెట్‌ని లేయర్‌గా ఉపయోగిస్తా.. ఇక రంగుల కోసం ఫుడ్‌ కలర్‌ని వాడతా..’ అంటూ తన కేక్‌ బేకింగ్‌ సీక్రెట్స్‌ని పంచుకుంది నటాలీ.

కేక్‌ డిటెక్టివ్!

విభిన్న వస్తువుల రూపంలోనే కాదు.. సెలబ్రిటీలకు ఆయా సందర్భానికి తగినట్లుగా కేక్స్‌ రూపొందించడం, వినియోగదారుల అభిరుచి మేరకు కస్టమైజ్‌డ్‌ కేక్స్‌ రూపొందించడంలోనూ నటాలీ దిట్ట. ఇలా సృజనాత్మక బేకింగ్‌ నైపుణ్యాలతో తాను తయారుచేసిన విభిన్న కేక్స్‌కు సంబంధించిన ఫొటోలు ఆమె సోషల్‌ మీడియాలో పంచుకోగా.. అవి ఎప్పటికప్పుడు వైరలవుతుంటాయి. అదే విధంగా ఇటీవలే తన ముఖకవళికలతో కూడిన సెల్ఫీ కేక్‌ ఒకటి తయారుచేసి.. ఆ ఫొటోను, వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది నటాలీ. దాంతో ఆమె కేక్‌ బేకింగ్‌ నైపుణ్యాల గురించి మరింత మందికి తెలిసింది. ఆ ఫొటో కాస్తా వైరల్‌గా మారడంతో.. తనలో ఉన్న ప్రత్యేక నైపుణ్యాలు చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ‘కేక్‌ డిటెక్టివ్‌’ అంటూ ఆమెకు ఓ బిరుదిచ్చేశారు. ‘ఫొటోలో చూసి సంతృప్తి పడకుండా.. మీరు తయారుచేసిన కేక్‌ను రుచి చూడాలనుందం’టూ ఆమె నైపుణ్యాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు మరికొందరు నెటిజన్లు. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టా పేజీకి 16 లక్షల మందికి పైగా ఫాలోవర్లున్నారు. ఇలా నటాలీ కేక్‌ వ్యాపారం సూపర్‌ సక్సెస్‌ కావడంతో ఆమె భర్త డేవ్ కూడా తన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి 2016 నుంచి తన భార్య వ్యాపారంలో పాలుపంచుకుంటున్నారు.






Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్