WWE: తను రింగ్‌లో దిగిందంటే రికార్డులు బద్దలవ్వాల్సిందే!
కుస్తీ పోటీలకు WWE (వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్) పెట్టింది పేరు. ఈ టెలివిజన్ రియాలిటీ షోకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. ఇందులో పాల్గొనే రెజ్లర్లకు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు...
(Photos: Twitter)
కుస్తీ పోటీలకు WWE (వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్) పెట్టింది పేరు. ఈ టెలివిజన్ రియాలిటీ షోకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. ఇందులో పాల్గొనే రెజ్లర్లకు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు లభిస్తుంటుంది. అయితే ఈ పోటీల్లో పురుషుల హవానే ఎక్కువగా కొనసాగుతుంటుంది. మహిళలు ఇందులో అరుదుగా రాణిస్తుంటారు. కానీ, కెనడాకు చెందిన నటాలియా మాత్రం ఈ రంగంలో 15 ఏళ్లకు పైగా రాణిస్తూ సూపర్‌స్టార్‌గా పేరు సంపాదించుకుంది. ఈ క్రమంలో ఆరు గిన్నిస్ రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.
రెజ్లర్ల కుటుంబం...
నటాలియా 1982లో కెనడాలోని రెజ్లింగ్ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి జిమ్ అమెరికన్ రెజ్లర్. అంతేకాదు ఆమె తాత స్టు హర్ట్ కూడా ప్రముఖ రెజ్లర్. ఇతని పేరు మీద కెనడాలో రెజ్లింగ్ ఈవెంట్లు జరుగుతుంటాయి. వీరి స్ఫూర్తితోనే నటాలియా చిన్నప్పటి నుంచే రెజ్లింగ్‌పై మక్కువ పెంచుకుంది. ఇందుకోసం ప్రొఫెషనల్ రెజ్లింగ్‌తో పాటు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంది. ఆ కుటుంబంలో రెజ్లింగ్‌లో శిక్షణ తీసుకున్న మొదటి మహిళ నటాలియానే కావడం విశేషం.
మొదటి ఛాంపియన్‌షిప్‌లోనే..
నటాలియా తన రెజ్లింగ్ కెరీర్‌ను 2003లో ప్రారంభించింది. స్థానికంగా జరిగిన ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడం ద్వారా రెజ్లింగ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఇంగ్లాండ్, జపాన్‌లలో జరిగిన పలు ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొంది. ఈ క్రమంలో 2005లో మొదటిసారి జరిగిన ‘స్టాంపీడ్ ఉమెన్స్ పసిఫిక్ ఛాంపియన్షిప్’లో పాల్గొని విజేతగా నిలిచింది. మరుసటి ఏడాది జరిగిన ‘సూపర్ గర్ల్స్ ఛాంపియన్‌షిప్’లో విజయం సాధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.
అలుపెరగని ప్రయాణం...
నటాలియా రెజ్లర్‌గా గుర్తింపు తెచ్చుకోవడంతో 2007లో WWE (వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్) తో ఒప్పందం చేసుకుంది. అప్పటి నుంచి దాదాపుగా 15 ఏళ్లుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో అనేక పోటీల్లో పాల్గొంది. 2008లో విక్టోరియాతో కలిసి మొదటిసారి స్మాక్‌డౌన్ పోటీల్లో పాల్గొంది. ఈ క్రమంలో 2010లో ‘దివస్ ఛాంపియన్‌షిప్’, 2017లో ‘స్మాక్‌డౌన్ ఛాంపియన్‌షిప్’లను సొంతం చేసుకుంది. తద్వారా ఈ రెండు ఛాంపియన్‌షిప్‌లు గెలుచుకున్న మొదటి మహిళగా ఘనత సాధించింది.
గిన్నిస్ రికార్డులు ఇలా..!
నటాలియా రెజ్లింగ్‌లో ఎన్నో మరపురాని విజయాలను సొంతం చేసుకుంది. ఆమె ప్రతిభకు గుర్తింపుగా ఆరు గిన్నిస్ రికార్డుల్లో చోటు దక్కింది. ఇటీవలే జరిగిన ఓ కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె గిన్నిస్ రికార్డుల గురించి తెలుసుకుందామా...
⚛ WWEలో భాగంగా నటాలియా 1514 మ్యాచ్‌ల్లో పాల్గొంది. ఇందులో 663 విజయాలను సొంతం చేసుకుంది. ఈక్రమంలో ఎక్కువ మ్యాచ్‌ల్లో పాల్గొనడంతో పాటు అధిక విజయాలను నమోదు చేసిన మహిళగా రెండు గిన్నిస్ రికార్డులను దక్కించుకుంది.
⚛ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో భాగంగా స్మాక్‌డౌన్, రా (RAW) మ్యాచ్‌లు జరుగుతుంటాయి. ఈ క్రమంలో నటాలియా 200 స్మాక్‌డౌన్ మ్యాచ్‌లు, 174 రా మ్యాచ్‌ల్లో పాల్గొంది. వీటిలో కూడా అత్యధిక మ్యాచ్‌ల్లో పాల్గొన్న మహిళగా మరో రెండు గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకుంది.
⚛ WWEలో లైవ్ మ్యాచ్‌లు కూడా జరుగుతుంటాయి. వీటిని ‘రెజిల్ మేనియా’, ‘ప్రీమియం లైవ్ ఈవెంట్స్ (PLE)’ గా పిలుస్తుంటారు. నటాలియా 8 రెజిల్ మేనియా, 75 ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌లో పాల్గొంది. అలా మరో రెండు గిన్నిస్ రికార్డులను కొల్లగొట్టింది. దీంతో మొత్తంగా ఆరు గిన్నిస్ రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.
రెజ్లర్‌నే పెళ్లాడి..!
⚛ నటాలియా తన చిన్ననాటి స్నేహితుడు టైసన్ కిడ్‌ని 2013లో పెళ్లి చేసుకుంది. ఇతను కూడా రెజ్లరే కావడం విశేషం.
⚛ నటాలియా రింగ్ బయట కూడా మంచి పేరు సంపాదించుకుంది. ఆమె WWEకి సంబంధించిన 8 వీడియో గేమ్స్‌లో పాల్గొంది.
⚛ నటాలియా పలు సిరీస్‌ల్లోనూ నటించి మెప్పించింది. ప్రముఖ సిరీస్ ‘టోటల్ దివాస్’లోని అన్ని భాగాల్లోనూ నటించింది.
⚛ నటాలియా యుక్త వయసులో ఉన్నప్పుడు సేల్స్‌ఉమన్‌గానూ పని చేసింది.
⚛ నటాలియాకు పిల్లులంటే చాలా ఇష్టం. తన పెంపుడు పిల్లుల కోసం ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా నిర్వహిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.