టంకాపానీ... అందరికీ తెలియాలనీ!

ఒకప్పుడు వారంతా గృహిణులు. రోజూ కూలీకి వెళితేనే ఆ సంసారాలు గడిచేవి. ఇప్పుడు వారే...  ఒక బ్రాండ్‌కు సృష్టికర్తలయ్యారు. ఒడిశా రాష్ట్ర సంప్రదాయ పానీయం ‘టంకాపానీ’ తయారీతో జాతీయస్థాయిలో గుర్తింపు పొందుతున్నారు.

Published : 25 Jun 2024 04:56 IST

ఒకప్పుడు వారంతా గృహిణులు. రోజూ కూలీకి వెళితేనే ఆ సంసారాలు గడిచేవి. ఇప్పుడు వారే...  ఒక బ్రాండ్‌కు సృష్టికర్తలయ్యారు. ఒడిశా రాష్ట్ర సంప్రదాయ పానీయం ‘టంకాపానీ’ తయారీతో జాతీయస్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. తమలాంటి మహిళలకూ ఉపాధిని కల్పిస్తున్న ‘ఆల్‌ విమెన్‌ శాంతి ప్రొడ్యుసర్‌ గ్రూపు’ సాధించిన విజయం ఇది.. 

డిశాలో తరతరాలుగా ప్రతి ఇంట్లో ‘టంకాపానీ’ సొంతంగా తయారుచేసుకొని తీసుకోవడం సంప్రదాయం. పులిసిన అన్నం, పెరుగు, అల్లం తదితర పదార్థాలతో చేసే దీన్ని ‘పఖాలా’ అని కూడా  పిలుస్తారు. ఆరోగ్య సంరక్షణలో భాగంగా దీన్ని విరివిగా తీసుకుంటారు. ఇందులోని పోషకాల శాతాన్ని గుర్తించాలని లాక్‌డౌన్‌ సమయంలో భువనేశ్వర్‌ ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌  దీనిపై పరిశోధన చేపట్టగా, యాంటీఆక్సిడెంట్లూ, పోషకాలు మెండుగా ఉన్నాయని తేలింది. దీంతో ఈ సంప్రదాయ పానీయంపై అందరిలో మరింత అవగాహన పెంచాలనుకుంది రాష్ట్రప్రభుత్వం. జాతీయస్థాయిలో ఈ సంప్రదాయ పానీయానికి గుర్తింపు తేవాలనుకుంది. ఈ పథకంలో భాగంగా గ్రామీణ మహిళలకు ఉపాధినీ కల్పించాలనుకుంది. అలా ఒడిశా గ్రామీణాభివృద్ధి మార్కెటింగ్‌  సొసైటీ ఆధ్వర్యంలో ఈ పానీయం తయారీలో పూర్తిగా మెలకువలు నేర్పడానికి కుహుందా గ్రామంలో 55మంది ఉండే ‘ఆల్‌ విమెన్‌ శాంతి ప్రొడ్యుసర్‌ గ్రూపు (ఎస్పీజీ)’ను ఎంపిక చేసింది.   

50 లక్షల లీటర్లు...

ఎస్పీజీ గ్రూపు ఈ పానీయం తయారీలో శిక్షణ పూర్తిచేసిన తర్వాత ప్రభుత్వం 2023లో ప్లాంట్‌ నిర్మించి అందించింది. తయారీ తర్వాత అందులో కొవ్వు, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, చక్కెర, విటమిన్‌ బీ2, బీ12సహా యాంటీఆక్సిడెంట్ల శాతాన్నీ మరోసారి పరిశీలించిన తర్వాతే మార్కెట్‌లోకి టంకాపానీ విడుదలైంది. మూడు నెలలపాటు నిల్వ ఉండే దీనికి తొలినాళ్లలోనే మార్కెట్‌లో మంచి పేరొచ్చింది. మొదట్లో అయిదారువేల లీటర్ల పానీయం మాత్రమే తయారయ్యేది. క్రమేపీ డిమాండ్‌ పెరిగి, ప్రస్తుతం రోజుకి 30 నుంచి 40వేల లీటర్ల పానీయాన్ని తయారుచేస్తున్నారు. దీంతో  మరికొందరికి ఈ తయారీలో శిక్షణనందించారు. ఒడిశాలోని కటక్, జగత్‌సింగ్‌పుర్‌ తదితర జిల్లాల్లో 80మందికిపైగా డిస్ట్రిబ్యూటర్లు ఈ ఉత్పత్తిని రవాణా చేస్తున్నారు. ‘త్వరలో ఒడిశాలో ఘనంగా నిర్వహించనున్న రథయాత్రను పురస్కరించుకుని 50 లక్షల లీటర్ల పానీయాన్ని తయారుచేయనున్నాం. ఈ యాత్రకు దేశవిదేశాల నుంచి తరలి వచ్చే భక్తులందరికీ టంకాపానీ పరిచయం చేయాలనేది మా ఆశయం. అప్పుడే ప్రపంచానికి మా సంప్రదాయ పానీయం గురించి తెలుస్తుంది. ఈ రథయాత్రను పురస్కరించుకుని 30 స్టాళ్ల ద్వారా విక్రయాలు జరపాలనుకుంటున్నాం. ఒకప్పుడు రోజూ కూలిపనులకు వెళ్తేనే మా సంసారాలు గడిచేవి. ఈ తయారీ ప్రారంభించినప్పటి నుంచి నెలకు తలా రూ.12వేలు ఆదాయాన్ని అందుకుంటున్నా’మని బృందం కార్యదర్శి స్మృతిమాయీ బెహూరియా చెబుతుండగా, వచ్చే ఏడాదికి ఈ పానీయం తయారీతో మరెందరో మహిళలు ఉపాధిని పొందనున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్