వీటిలో మీ ‘డైట్‌ ట్రెండ్‌’ ఏది?

‘ఏదో ఒకటి కడుపులో పడితే చాలు.. ఈ పూటకి ఆకలి తీరుతుంది..’ ఆహారం విషయంలో చాలామంది భావన ఇదే! కానీ కడుపు నిండడం కంటే.. శరీరానికి కావాల్సిన మోతాదులో పోషకాలు అందాయా? లేదా? అన్నదే ముఖ్యమంటున్నారు నిపుణులు. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యాన్ని....

Published : 07 Sep 2022 19:46 IST

‘ఏదో ఒకటి కడుపులో పడితే చాలు.. ఈ పూటకి ఆకలి తీరుతుంది..’ ఆహారం విషయంలో చాలామంది భావన ఇదే! కానీ కడుపు నిండడం కంటే.. శరీరానికి కావాల్సిన మోతాదులో పోషకాలు అందాయా? లేదా? అన్నదే ముఖ్యమంటున్నారు నిపుణులు. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇలాంటి పోషకాలు పుష్కలంగా లభించే డైట్‌ ట్రెండ్స్‌ బోలెడన్ని ఉన్నాయి. అటు ఆరోగ్యానికైనా, ఇటు బరువు తగ్గడానికైనా చాలామంది వివిధ రకాల డైట్‌ ట్రెండ్స్‌ని పాటిస్తుంటారు. మరి, ‘జాతీయ పోషకాహార వారం’ సందర్భంగా ఆయా ఆహార పద్ధతుల గురించి, వాటితో చేకూరే ప్రయోజనాల గురించి తెలుసుకుందామా?!

ఒక్కొక్కరి శరీరతత్వం ఒక్కోలా ఉంటుంది. వారి శరీరతత్వానికి అవసరమైన పోషకాలు అందితేనే వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతారు.. లేదంటే పోషకాహార లోపం తలెత్తి వివిధ రకాల అనారోగ్యాలకు గురవుతారు. వీటిని నివారించడానికే పలువురు వివిధ రకాల ఆహార పద్ధతులను పాటిస్తుంటారు.

కీటోజెనిక్‌ డైట్

శరీరంలో పేరుకుపోయిన కొవ్వుల్ని కరిగించుకొని బరువు తగ్గించుకోవడానికి ప్రస్తుతం చాలామంది అనుసరిస్తోన్న ట్రెండ్‌ ఇది. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లుగా కొవ్వును కొవ్వుతోనే కరిగించడం ఈ డైట్‌ ట్రెండ్‌ ప్రత్యేకత. మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును, మనం ఆహారం ద్వారా తీసుకునే మంచి కొవ్వుతో విచ్ఛిన్నం చేసి శరీరానికి శక్తిని అందిస్తుందీ ఆహార పద్ధతి. ఇందులో కార్బోహైడ్రేట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ ఆహార పద్ధతి వల్ల గుండె సమస్యలు, క్యాన్సర్‌, పీసీఓఎస్‌.. వంటి సమస్యలు తలెత్తే అవకాశం చాలా వరకు తగ్గుతుందంటున్నారు నిపుణులు.

ఏం తీసుకుంటారు? - అవకాడో, కొబ్బరి, గింజలు, చేపలు, మాంసం, నట్స్‌.. మొదలైనవి.

ఏం తీసుకోరు? - చక్కెరలు అధికంగా ఉండే పదార్థాలు, దుంపలు, ప్రాసెస్డ్‌ ఫుడ్‌, వెజిటబుల్‌ ఆయిల్స్, మయొనైజ్.. మొదలైనవి.


అట్కిన్స్‌ డైట్

కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో ఇన్సులిన్ స్థాయుల్లో మార్పులొస్తాయి. ఫలితంగా మనం తీసుకున్న ఆహారం నుంచి శరీరం గ్రహించి నిల్వ చేసుకున్న శక్తి కొవ్వుగా రూపాంతరం చెందుతుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.. ఇన్సులిన్‌ స్థాయులు అదుపు తప్పితే మధుమేహ సమస్య కూడా తలెత్తుతుంది. కాబట్టి ఈ సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలన్నదే ‘అట్కిన్స్ డైట్’ లో ప్రధానంగా కనిపించే అంశం.

ఏం తీసుకుంటారు? - మాంసం, చేపలు, ఆకుకూరలు, పాలు, పాల పదార్థాలు, నట్స్‌, గింజలతో పాటు వంటల్లోకి కొబ్బరి లేదంటే అవకాడో నూనె వాడుకోవాలి.

ఏం తీసుకోరు? - చక్కెర అధికంగా ఉండే పదార్థాలు, ధాన్యాలు, వెజిటబుల్‌ ఆయిల్స్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్‌, ప్యాకేజ్డ్‌ ఫుడ్‌.. మొదలైనవి.

అయితే కార్బోహైడ్రేట్లు తగ్గించి తీసుకోవడం వల్ల కూడా కొంతమందిలో నీరసం, జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురవుతాయంటున్నారు నిపుణులు. కాబట్టి ఈ డైట్‌ పాటించాలనుకున్న వారు ఓసారి నిపుణులను సంప్రదించి, వారి సలహా మేరకు మాత్రమే ఈ డైట్‌ ట్రెండ్‌ని పాటించడం ఉత్తమం.


పచ్చి ఆహారం (రా ఫుడ్‌ డైట్)

పేరుకు తగినట్లుగానే ఈ డైట్‌ ట్రెండ్‌ పాటించే వారు పదార్థాలన్నీ పచ్చిగానే తీసుకుంటారు. నిజానికి పచ్చివి తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడన్ని పోషకాలు అందుతాయంటున్నారు నిపుణులు. ఎందుకంటే మనం వండే క్రమంలో కాయగూరలు, ఆకుకూరల్లో ఉండే పోషకాలు నశించిపోతాయి. కాబట్టి అవన్నీ పూర్తిగా శరీరానికి అందాలంటే ఈ ఆహార పద్ధతే సరైందంటున్నారు పోషకాహార నిపుణులు. శరీరానికి శక్తిని అందించడానికి, బరువు తగ్గడానికి, జీర్ణశక్తిని పెంచుకోవడానికి.. ఇలా ఈ డైట్‌ ట్రెండ్‌తో చాలా రకాల ప్రయోజనాలే ఉన్నాయి. అలాగే అందాన్ని రెట్టింపు చేయడానికీ ఈ డైట్ చక్కగా ఉపయోగపడుతుంది.

ఏం తీసుకుంటారు? - పండ్లు, పచ్చి కాయగూరలు, నట్స్‌, గింజలు, స్ప్రౌట్స్‌.. వంటి మొక్కల ఆధారిత ఆహారం, అది కూడా పచ్చిగానే తీసుకోవాల్సి ఉంటుంది.

ఏం తీసుకోరు? - రిఫైన్డ్‌ నూనెలు, వండిన పదార్థాలు, టీ, కాఫీ, వేయించిన నట్స్‌.. ఇలా వేడి చేసినవేవీ ఈ ఆహార పద్ధతిలో భాగంగా తీసుకోరు.


జోన్‌ డైట్

శరీరానికి అన్ని పోషకాలు అందినప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అలాంటి సమతులాహారమే జోన్‌ డైట్‌. ఇందులో భాగంగా కార్బోహైడ్రేట్లు 40 శాతం, ప్రొటీన్లు 30 శాతం, మంచి కొవ్వులు 30 శాతం ఉంటాయి. అందులోనూ కార్బోహైడ్రేట్లంటే తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఉన్న ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆహారం నెమ్మదిగా జీర్ణమై త్వరగా ఆకలేయకుండా చేస్తుంది. తద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే శరీరంలోని ఇన్సులిన్‌ స్థాయుల్ని అదుపులో ఉంచడంలోనూ ఈ డైట్‌ బాగా పనిచేస్తుంది.

ఏం తీసుకుంటారు? - ప్రొటీన్‌ కోసం.. మాంసం, చేపలు, గుడ్డులోని తెల్లసొన, టోఫు, సోయా ఉత్పత్తులు, తక్కువ కొవ్వులుండే పాలు, పెరుగు, వెన్న.. మొదలైనవి.

కొవ్వుల కోసం.. అవకాడో, నట్స్‌, పీనట్‌ బటర్‌తో పాటు వంటల్లో నువ్వుల నూనె, వేరుశెనగ నూనె, ఆలివ్‌ నూనె.. వంటివి వాడతారు.

యాపిల్, కమలాపండు, టొమాటో, పుట్టగొడుగులు, ఓట్‌మీల్‌, బార్లీ.. వంటి తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఉండే కార్బోహైడ్రేట్లను ఆహారంలో చేర్చుకుంటారు.

ఏం తీసుకోరు? - కాఫీ, టీ, బ్రెడ్‌, శీతల పానీయాలు, బంగాళాదుంపలు, అరటిపండ్లు, ప్రాసెస్డ్‌ ఫుడ్‌.. మొదలైనవి.


వెజిటేరియన్‌ డైట్

ఈ ఆహార పద్ధతిని పాటించే వారు మాంసం ముట్టరన్న విషయం తెలిసిందే. ఈ డైట్‌ ట్రెండ్‌తో బరువు అదుపులో ఉంటుందని, అనారోగ్యాలు వచ్చే అవకాశం చాలా తక్కువని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. గుండె ఆరోగ్యానికి, రక్తంలో చక్కెర స్థాయుల్ని అదుపులో ఉంచుకోవడానికి ఈ ఆహార పద్ధతి చక్కగా ఉపయోగపడుతుంది.

ఏం తీసుకుంటారు? - పండ్లు, కాయగూరలు, ధాన్యాలు, నట్స్‌, గింజలు.. వంటివి తీసుకోవాలి. అలాగే వీళ్లు మాంసం ముట్టరు కాబట్టి ప్రొటీన్ల కోసం పాలు, పాల పదార్థాలు, పప్పులు, గుడ్లు మొదలైన వాటిపై ఆధారపడతారు.

ఏం తీసుకోరు? - మాంసాహారం, కొంతమంది గుడ్లు కూడా తీసుకోరు.


వీగన్‌ డైట్

శాకాహారులన్నా పాలు, గుడ్లు.. వంటి జంతు సంబంధిత ఆహార పదార్థాలు తీసుకుంటారేమో కానీ.. వీగన్లు అవి కూడా తీసుకోరు. రా ఫుడ్‌ డైట్‌ మాదిరిగానే ఈ ఆహార పద్ధతిలో కూడా మొక్కల ఆధారిత పదార్థాలే తీసుకోవాల్సి ఉంటుంది. వీగన్‌ డైట్‌ బరువును అదుపులో ఉంచడంతో పాటు.. మధుమేహం, క్యాన్సర్‌.. వంటి జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తుందంటున్నారు నిపుణులు.

ఏం తీసుకుంటారు? - నట్స్‌, గింజలు, స్ప్రౌట్స్‌, పండ్లు, కాయగూరలు, తృణధాన్యాలు, ప్రొటీన్‌ కోసం టోఫు, పప్పులు.. మొదలైనవి

ఏం తీసుకోరు? - మాంసాహారం, పాలు, పాల పదార్థాలు, కోడిగుడ్లు, తేనె.. ఇలా జంతువుల నుంచి వచ్చే పదార్థాలన్నీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్