ఇంట్లో సువాసనలు వెదజల్లాలంటే..

ఇంట్లోకి గాలి సరిగ్గా ప్రసరించకపోవడం, ఇల్లు శుభ్రంగా లేకపోవడం.. వంటి పలు కారణాల వల్ల అప్పుడప్పుడూ ఇంట్లోంచి చెడువాసన రావడం సహజం. అందులోనూ వర్షాకాలంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో చెడు వాసనలను తొలగించడానికి చాలామంది....

Updated : 12 Aug 2022 15:05 IST

ఇంట్లోకి గాలి సరిగ్గా ప్రసరించకపోవడం, ఇల్లు శుభ్రంగా లేకపోవడం.. వంటి పలు కారణాల వల్ల అప్పుడప్పుడూ ఇంట్లోంచి చెడువాసన రావడం సహజం. అందులోనూ వర్షాకాలంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో చెడు వాసనలను తొలగించడానికి చాలామంది మార్కెట్లో దొరికే రూమ్ ఫ్రెష్‌నర్స్ వాడుతుంటారు. అయితే వివిధ రసాయనాలతో తయారైన వీటి కంటే ఇంట్లో లభించే పదార్థాలతోనే ఇంటిని సువాసనభరితం చేసుకోవడం ఎంతో ఆరోగ్యకరం. ఈ క్రమంలో ఇంటిని పరిమళభరితంగా తీర్చిదిద్దేందుకు దోహదపడే అలాంటి కొన్ని సహజసిద్ధమైన పదార్థాలేంటో తెలుసుకుందాం రండి.

చెడు వాసనకు చెక్!

ఒక చిన్న పాత్రలో కొన్ని నీళ్లు పోసి దాన్ని స్టవ్ మీద చిన్న మంటపై మరిగించాలి. అందులో కొన్ని దాల్చిన చెక్క ముక్కలు లేదా పొడి వేయాలి. దీంతో ఇంట్లోని చెడు వాసన తొలగిపోయి.. మంచి వాసన వస్తుంది. దాల్చిన చెక్కకు బదులుగా కాఫీ గింజలు లేదా నిమ్మ, ఆరెంజ్, యాపిల్ తొక్కల్ని లవంగాలతో కలిపి వేసి మరిగించొచ్చు.

క్యాండిల్స్ వెలిగించండి..

ప్రస్తుతం వివిధ రకాల డిజైన్లు, మోడళ్లలో ఉన్న సెంటెడ్ క్యాండిల్స్ మార్కెట్లో విరివిగా లభ్యమవుతున్నాయి. వాటిని వెలిగించి చెడు వాసనలను పారదోలండి.

కర్పూరంతో..

ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసి అందులో కర్పూరం వేసి ఓ మూలకు ఉంచండి. ఇల్లంతా మంచి వాసనతో నిండిపోతుంది. దీనివల్ల మరో ఉపయోగం కూడా ఉందండోయ్.. అదేంటంటే.. ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయి.

తాజా పూలతో..

మంచి వాసన వెదజల్లే తాజా పువ్వుల్ని ఏ రోజుకారోజే ఫ్లవర్‌వాజ్‌ల్లో అమర్చండి. మరింత సువాసన రావాలంటే ఆ ఫ్లవర్‌వాజ్‌లో ఉండే నీటిలో కాస్త పెర్‌ఫ్యూమ్ చల్లండి.. అంతే ఇల్లంతా ఆహ్లాదభరితమైన వాసనతో నిండిపోతుంది.

వెనిగర్‌తోనూ..

కిచెన్‌లో నాన్‌వెజ్ వండినప్పుడు వచ్చే నీచు వాసన వెంటనే పోదు.. ఇదేవిధంగా కిచెన్‌లో నుంచి ఇంకా ఏమైనా చెడు వాసన వస్తున్నట్లయితే.. ఒక చిన్న గిన్నెలో వైట్ వెనిగర్‌ని తీసుకుని దాన్ని కిచెన్ ప్లాట్‌ఫాంపై ఉంచండి.. అది చెడు వాసనలన్నింటినీ తొలగిస్తుంది.

కిటికీలు తెరవండి..

కొంతమంది ఎప్పుడు చూసినా కిటికీలు, తలుపులు మూసే ఉంచుతారు. దీనివల్ల బయటి గాలి లోపలికి రాదు.. లోపలి గాలి బయటికి పోదు. దీంతో ఇంట్లోని గాలి తాజాదనాన్ని సంతరించుకోదు. అందుకే చెడు వాసన వస్తుంటుంది. కాబట్టి ఇంట్లో కొన్ని కిటికీలైనా సరే తెరిచి ఉంచాలి. ఇలా చేయడం వల్ల కేవలం ఇంట్లోని వాసనే కాదు.. బాత్‌రూమ్స్‌లో ఉండే వాసన కూడా బయటికి పోతుంది.

నూనెలతోనూ..

సబ్బులు, క్యాండిల్స్ తయారీలో వాడే కల్తీ లేని ఎసెన్షియల్ ఆయిల్స్‌ని కూడా ఇంటిని సువాసనభరితం చేయడానికి వాడొచ్చు. వీటి ప్రభావం చాలా సేపటి వరకు ఉంటుంది.

ఆకులతో..

రోజ్‌మేరీ వంటి కొన్ని సువాసనాభరిత ఆకులు కూడా మార్కెట్లో లభిస్తాయి. వీటిని తెచ్చుకుని ఇంట్లో ఎక్కడో ఒక చోట ఉంచండి. ఇల్లంతా మంచి వాసనతో నిండిపోతుంది. ఫలితంగా మనసుకు ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్