Published : 24/12/2022 12:30 IST

అవాంఛిత రోమాలు.. ఆందోళన వద్దు..

అవాంఛిత రోమాలు.. ఎంతోమంది ఈ సమస్యతో బాధపడుతుంటారు. యుక్త వయసులో కొంతమందికి చనుమొనల వద్ద కూడా ఇలా రోమాలు కనిపిస్తుంటాయి.  హార్మోన్ల అసమతుల్యత, పీసీఓఎస్ వంటివి ఇందుకు కారణం కావచ్చంటున్నారు నిపుణులు. అలాగని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓసారి సంబంధిత నిపుణులను సంప్రదిస్తే కారణం తెలుసుకుని తగిన చికిత్సలు సూచిస్తారు. అలాగే ఇంట్లోనే పాటించే కొన్ని చిట్కాలు సైతం దీనికి కొంతవరకు పరిష్కారం చూపిస్తాయి.

గుడ్డుతో ఇలా చేయండి!

ఒక గుడ్డులోని తెల్లసొన, టేబుల్‌స్పూన్‌ చక్కెర, అర-టీస్పూన్ కార్న్‌ఫ్లోర్‌.. ఈ మూడింటినీ ఒక బౌల్‌లోకి తీసుకొని బాగా గిలక్కొట్టాలి. తద్వారా ఇది మృదువైన పేస్ట్‌లా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని సమస్య ఉన్న చోట రోమాలు పెరిగే దిశలో అప్లై చేయాలి. కాసేపటి తర్వాత ఇది గట్టిపడుతుంది. అప్పుడు దీన్ని వ్యతిరేక దిశలో లాగేస్తే అవాంఛిత రోమాలు తొలగే అవకాశం ఉంటుంది.

ఈ స్క్రబ్‌తో..

ఒక చిన్న గిన్నెలో టేబుల్‌స్పూన్‌ పసుపు తీసుకోవాలి. దీనికి టీస్పూన్‌ పాలు జత చేస్తూ పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట రోమాలు పెరిగే దిశలో అప్లై చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆరిపోయాక వేళ్లను తడి చేసుకొని వ్యతిరేక దిశలో గుండ్రంగా రుద్దాలి. ఆపై చల్లటి నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది. ఇలా వారానికి రెండుమూడు సార్లు చేస్తే క్రమంగా అవాంఛిత రోమాల పెరుగుదల మందగిస్తుంది.

బొప్పాయి-పసుపుతో..

బాగా పండిన ఒక బొప్పాయి పండును గిన్నెలోకి తీసుకొని మ్యాష్‌ చేయాలి. ఇందులో టీస్పూన్‌ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట అప్లై చేసి మృదువుగా రుద్దాలి. ఆపై చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇదే పద్ధతిని వారానికి రెండుమూడు సార్లు చేయడం వల్ల.. ఆ ప్రదేశంలో అవాంఛిత రోమాల సమస్య క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది.

ఇవన్నీ సహజసిద్ధమైన పదార్థాలే కాబట్టి సాధారణంగా దుష్ప్రభావాలు ఉండవు. అయితే ఇంట్లో ఈ చిట్కాలను పాటించడంతో పాటు సంబంధిత నిపుణులను సంప్రదించడం కూడా మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని