ఆర్టిఫిషియల్ నగలతో అలర్జీనా..?
ఆడవాళ్లకు, నగలకు అవినాభావ సంబంధం ఉందనడంలో సందేహం లేదు. అయితే వీటిని ఎంత ఇష్టంగా ధరించినా.. వీటి తయారీలో వాడే కొన్ని లోహాలు కొంతమంది చర్మతత్వాలకు సరిపడవు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ నగల విషయంలో...
ఆడవాళ్లకు, నగలకు అవినాభావ సంబంధం ఉందనడంలో సందేహం లేదు. అయితే వీటిని ఎంత ఇష్టంగా ధరించినా.. వీటి తయారీలో వాడే కొన్ని లోహాలు కొంతమంది చర్మతత్వాలకు సరిపడవు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ నగల విషయంలో ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతుంటుంది. ఫలితంగా చర్మంపై ఎర్రటి దద్దుర్లు, దురద, మంట.. వంటి సమస్యలొస్తాయి. మరి, వీటి నుంచి విముక్తి పొందడమెలాగో తెలుసుకుందాం రండి..
ఆర్టిఫిషియల్ నగల తయారీలో నికెల్ అనే లోహాన్ని వాడుతుంటారు. చాలామందిలో అలర్జీ రావడానికి ఇదే ముఖ్య కారణమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా సున్నితమైన చర్మతత్వం ఉన్న వారిలో దీని కారణంగా దురద, దద్దుర్లు, ఎరుపెక్కడం.. వంటి సమస్యలొస్తాయంటున్నారు. అలాంటి వారికి ఈ చిట్కాలు మేలు చేస్తాయంటున్నారు.
⚛ నగల అలర్జీ ఉన్న వారు వాటిని ధరించే ముందు మాయిశ్చరైజర్, పౌడర్, క్యాలమైన్ లోషన్స్.. వంటివి రాసుకోవాలి. ఇవి చర్మానికి కవచంలా పనిచేసి లోహపు ప్రభావం చర్మంపై పడకుండా చేస్తాయి.
⚛ అవుట్‌ఫిట్ ఏదైనా.. కొంతమంది మెడ దగ్గరగా ఉండే చోకర్, నెక్‌పీస్.. వంటి బిగుతుగా ఉండే జ్యుయలరీని ఎంచుకుంటారు. దీనివల్ల గాలి ఆడక కూడా అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వీలైనంతవరకు వదులుగా ఉండే నెక్‌పీస్‌లు, లాంగ్ చెయిన్స్.. వంటివి ఎంచుకోవాలి.
⚛ ధరించే ముందు పారదర్శక నెయిల్ పాలిష్ (ట్రాన్స్‌పరెంట్ నెయిల్ పాలిష్)ను నగలపై ఓ కోటింగ్ వేసి.. ఆపై వేసుకోవడం మంచిది. ఇది నగల్లోని లోహాల ప్రభావం చర్మంపై పడకుండా కాపాడుతుంది.
⚛ ఆర్టిఫిషియల్ నగలే కదా అని వీటి విషయంలో చాలామంది అంత శ్రద్ధ తీసుకోరు. తడిసినా, చెమట పట్టినా.. అలాగే వాటిని బాక్సుల్లో భద్రపరుస్తుంటారు. ఆ తడిదనం వల్ల నగల నాణ్యత దెబ్బతింటుంది. ఇది కూడా చర్మ అలర్జీలకు ఓ కారణమే! కాబట్టి నగల్ని భద్రపరిచే ముందు పూర్తిగా ఆరనివ్వడం మేలు. అలాగే తేమ అధికంగా ఉండే ప్రదేశాలకు వీటిని దూరంగా ఉంచాలి.
⚛ నగల వల్ల చర్మంపై దురదగా అనిపిస్తే.. ఆ ప్రదేశంలో కలబంద గుజ్జును అప్లై చేసుకోవాలి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు సమస్య నుంచి త్వరిత ఉపశమనం కలిగిస్తాయి.
⚛ గోల్డ్, సిల్వర్ కోటింగ్‌తో తయారుచేసిన వాచ్‌లను ధరించడం వల్ల కొంతమందిలో రాషెస్ రావడం చూస్తుంటాం. ఇలాంటి వాళ్లు లెదర్, క్లాత్.. వంటి మెటీరియల్‌తో తయారుచేసిన వాచ్ బెల్టుల్ని ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు.
⚛ ఆర్టిఫిషియల్ జ్యుయలరీతో అలర్జీ సమస్య వస్తుందనుకునే వారు ఆ నగలకు లోపలి వైపు ప్లాటినం కోటింగ్ వేయించుకుంటే ఫలితం ఉంటుంది.
⚛ చాక్లెట్స్, నట్స్.. వంటి పదార్థాల్లో నికెల్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీని కారణంగా తరచూ అలర్జీ బారిన పడే వారు ఆయా పదార్థాల్ని దూరం పెట్టడం మంచిది.
ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఆర్టిఫిషియల్ నగలతో అలర్జీ సమస్య పదే పదే వస్తున్నా, ఉపశమనం కలగకపోయినా.. చర్మ వ్యాధి నిపుణుల్ని సంప్రదించి సలహాలు తీసుకోవడం ఉత్తమం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.