నోటి అల్సర్లకు విరుగుడు ఇవి!

విటమిన్‌ లోపం, నెలసరి సమయంలో హార్మోన్లలో వచ్చే మార్పులు, ఒత్తిడి, నిద్రలేమి, వివిధ రకాల వైరల్‌-బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు.. ఇవన్నీ చాలామందిలో నోటి అల్సర్లకు కారణమవుతుంటాయి. మరికొంతమందిలో ఒంట్లో వేడి చేయడం వల్ల కూడా ఈ సమస్య...

Published : 19 May 2022 17:29 IST

విటమిన్‌ లోపం, నెలసరి సమయంలో హార్మోన్లలో వచ్చే మార్పులు, ఒత్తిడి, నిద్రలేమి, వివిధ రకాల వైరల్‌-బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు.. ఇవన్నీ చాలామందిలో నోటి అల్సర్లకు కారణమవుతుంటాయి. మరికొంతమందిలో ఒంట్లో వేడి చేయడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. ఇలా కారణమేదైనా నోటి అల్సర్ల వల్ల విపరీతమైన నొప్పితో పాటు కనీసం ద్రవాహారం కూడా తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటాం. అయితే ఈ సమస్యకు మన వంటింట్లోనే పరిష్కారముందంటున్నారు నిపుణులు. మరి, ఆ మార్గాలేంటో తెలుసుకుందాం రండి..!

తులసి ఆకులు..

ముంగిట్లో పెరిగే తులసి మొక్కతో ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయి. వివిధ రకాల అలర్జీలను తగ్గించడంలో ఈ ఆకులు ప్రభావవంతంగా పనిచేస్తాయి. తులసిలోని ఔషధగుణాలపై చేసిన పరిశోధనల్లో ఇందులో నోటి అల్సర్లను తగ్గించే లక్షణం కూడా ఉందని నిరూపితమైంది. రోజుకు నాలుగైదు సార్లు కొన్ని తులసి ఆకులను నమలడం వల్ల సులభంగా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆకులను నమిలేటప్పుడు వాటికి కొన్ని నీళ్లు కూడా జతచేస్తే, ఆ ద్రావణం నోరంతా వ్యాపించి, సమస్యను త్వరగా తగ్గిస్తుంది.

తేనె..

ఆహారపదార్థాలకు అదనపు రుచిని తేవడం, చర్మంపై గాయాలను మాన్పడమే కాకుండా నోటి అల్సర్లను తగ్గించడంలోనూ తేనె సమర్థంగా పనిచేస్తుంది. అల్సర్ల సమస్య ఎక్కువగా ఉన్నచోట తేనెను రాస్తే చక్కటి ఫలితం ఉంటుంది. ఇందులోని యాంటీమైక్రోబియల్ గుణాల కారణంగా అల్సర్లను కలిగించే బ్యాక్టీరియా త్వరగా నశిస్తుంది. తేనెలోని సహజగుణాలు నోటి లోపల తేమ ఉండేలా చేసి, అల్సర్ల వల్ల పొడిబారిన చర్మానికి ఉపశమనాన్ని కలిగిస్తాయి. తేనెను ఉపయోగించి, అల్సర్ల నుంచి మరింత త్వరిత ఉపశమనం పొందాలంటే, దానికి చిటికెడు పసుపు కలిపితే సరిపోతుంది.

కొబ్బరి..

ప్రకృతిసిద్ధంగా ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో కొబ్బరిది కీలకస్థానం. నోటి అల్సర్లతో బాధపడేవారు సమస్య ఉన్న చోట కాస్త కొబ్బరి నూనెను రాస్తే ఉపశమనాన్ని పొందచ్చు. అలాగే ఎండుకొబ్బరి ముక్కలను నమిలినా, అల్సర్ల నుంచి త్వరగా ఉపశమనం పొందచ్చు. ఇక లేత కొబ్బరిబోండం నీళ్లు ఎక్కువసార్లు తీసుకోవడం వల్ల శరీరంలోని వేడి తగ్గి, అల్సర్ల సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది.

గసగసాలు..

శరీరంలోని వేడిని తగ్గించడంలో గసగసాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. నోట్లో అల్సర్లు ఇబ్బంది పెట్టడానికి కారణం అధిక వేడే. అందుకే ఈ సమస్యను తగ్గించుకోవడానికి గసగసాలు చక్కటి ప్రత్యామ్నాయం. ఒక టేబుల్ స్పూన్ పొడిచేసిన గసగసాలకు, అంతే పరిమాణంలో పంచదారను జతచేసి, సమస్య తగ్గే వరకు రోజూ రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే ఫలితం ఉంటుంది.

ఇవి కూడా!

* నోటి అల్సర్ల నుంచి తక్షణ ఉపశమనానికి సమస్య ఉన్న చోట ఐస్ ముక్కలతో మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

* అల్సర్ బాధిస్తున్నప్పుడు తరచూ లవంగాలు నమిలితే, ఆ ఘాటుకు సమస్య సులభంగా పరిష్కారమవుతుంది. దీనికి బదులు లవంగం నూనెను కూడా సమస్య ఉన్న చోట అప్లై చేయచ్చు.

* గోరువెచ్చని నీటితో నోటిని వీలైనన్ని ఎక్కువసార్లు పుక్కిలించాలి. ఇలా చేస్తే అల్సర్ల కారణంగా ఎదురయ్యే మంట, నొప్పి నుంచి తక్షణ ఉపశమనం పొందచ్చు.

* మజ్జిగను ఎక్కువగా తీసుకుంటే నోటి అల్సర్ల సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు.

* సమస్య ఉన్నచోట నెయ్యిని రాసినా మంచి ఫలితాన్ని పొందచ్చు.

* ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని శుభ్రం చేసుకోవాలి. లేదంటే నోట్లో మిగిలిపోయిన ఆహారపదార్థాల నుంచి వెలువడే ఆమ్లాలు నోటి అల్సర్ల సమస్యకు కారణమవుతాయి.

* ప్రతి మూడు నెలలకోసారి టూత్‌బ్రష్‌ను మార్చడం వల్ల నోటి అల్సర్ల సమస్య రాకుండా జాగ్రత్తపడచ్చు.

* సాధారణంగా శరీరంలో ‘విటమిన్ బి12’ శాతం తగ్గిపోతే నోటి అల్సర్లు వస్తాయి. కాబట్టి వైద్యుల సలహా మేరకు విటమిన్ బి12  సప్లిమెంట్స్‌ వేసుకోవడం, ఈ విటమిన్‌ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది.

* ‘విటమిన్ సి’ పుష్కలంగా లభించే కమలాపండు రసాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇలాంటి అల్సర్లకు చెక్ పెట్టచ్చు.

* నోటి అల్సర్ల సమస్యతో బాధపడుతున్నప్పుడు టీ, కాఫీలకు ఎంత దూరంగా ఉంటే అంత మేలు.

* శరీరంలో ఎసిడిటీని ఎక్కువ చేసే మాంసాహారానికి కొద్దిరోజులు దూరంగా ఉంటే ఈ సమస్య త్వరగా నయమవుతుంది.

* పచ్చి ఉల్లిపాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల నోటి అల్సర్ల సమస్య త్వరగా తగ్గుముఖం పడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్