Updated : 29/07/2022 20:51 IST

ఈ చిట్కాలతో జీర్ణ సమస్యలు దూరం!

‘రాళ్లు తిని అరిగించుకోవాల్సిన వయసులో ఈ అరుగుదల సమస్యలేంటో..?’ అంటూ పెద్దవాళ్లు వాపోతుంటారు.. కానీ వృత్తి ఉద్యోగాల రీత్యా సమయం లేక బయటి నుంచి ఆహారం ఆర్డర్‌ చేసుకోక తప్పట్లేదు చాలామందికి! ఇదే కొన్ని సందర్భాల్లో జీర్ణ సంబంధిత సమస్యలకు కారణమవుతుందంటున్నారు నిపుణులు. నూనె పదార్థాలు, ప్రాసెస్డ్‌ ఫుడ్‌, ఎక్కువగా కొవ్వులున్న ఆహారం.. వంటివన్నీ త్వరగా జీర్ణం కాకపోవడం వల్ల గ్యాస్ట్రిక్‌ సమస్యలొస్తుంటాయి. అయితే ఇలాంటి జీర్ణ సంబంధిత సమస్యల్ని తగ్గించుకోవాలంటే కొన్ని వంటింటి చిట్కాలు ఉపకరిస్తాయి.

అజీర్తికి జీలకర్ర దివ్యౌషధం..!

కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు లేదా ఎసిడిటీ బాధిస్తున్నప్పుడు కాస్త జీలకర్రను నమలడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

టేబుల్‌స్పూను జీలకర్రను శుభ్రంగా కడిగి, 150మి.లీ. నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగి, జీలకర్రను తినాలి. క్రమం తప్పకుండా నెల రోజులపాటు ఇలా చేయడం వల్ల అజీర్తి, మలబద్ధకం పూర్తిగా నయమవుతాయి.

రెండు టీస్పూన్ల జీలకర్రను పావులీటరు నీటిలో వేసి బాగా మరిగించాలి. నీరు సగానికి వచ్చాక స్టౌ ఆపేయాలి. ఆపై చల్లారాక జీలకర్ర కషాయాన్ని వడగట్టి, పరగడుపున తాగాలి. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుముఖం పడుతుంది. అంతేకాకుండా ఊబకాయం నుంచి కూడా విముక్తి పొందచ్చు.

జీలకర్రకు బదులుగా వామును ఉపయోగించినా మంచి ఫలితం ఉంటుంది. అయితే వామును తక్కువ మోతాదులో వాడాలని గుర్తుంచుకోండి. ఒక స్పూను జీలకర్రకు బదులుగా పావు స్పూన్‌ వామును మాత్రమే వాడాలి.

పుదీనా, తులసి ఎంతో మేలు చేస్తాయి.!

పుదీనా ఆకులు, తులసి ఆకులు శుభ్రంగా కడిగి.. పావు లీటరు నీటిలో వేసి మరిగించాలి. నీరు సగానికి ఇగిరి పోయిన తర్వాత స్టౌ మీద నుంచి దించాలి. ఆ నీరు గోరు వెచ్చగా అయిన తర్వాత వడకట్టకుండా ఆకులతో సహా తీసుకోవాలి.
క్రమం తప్పకుండా దీన్ని తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గడమే కాదు.. శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. రోగ నిరోధకశక్తి మెరుగుపడుతుంది. కాంతివంతమైన చర్మమూ సొంతమవుతుంది.

ఇంగువ..

ఉదయాన్నే పరగడుపున పావు స్పూన్‌ ఇంగువని గ్లాసు నీటిలో కలుపుకొని తాగితే మలబద్ధకం నయమవుతుంది.

అల్లం రసం..

అజీర్తికి, పైత్యానికి అల్లం రసం వాడటం మన పూర్వ కాలం నుంచే ఆచరణలో ఉంది. ఈ క్రమంలో అల్లం ముక్కను తురిమి అర గ్లాసు నీటిలో వేయాలి. నీరు సగానికి వచ్చే వరకూ మరిగించాలి. కాస్త చల్లారిన తర్వాత వడగట్టి ఈ కషాయాన్ని తాగితే అజీర్తి తగ్గుతుంది.

పై చిట్కాలను పాటించినా ఉపశమనం కలగకపోయినా, సమస్య ఎక్కువైనా.. వెంటనే వైద్యుల్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని