Published : 15/12/2022 21:17 IST

ఇంటికి ‘అరోమా థెరపీ’!

ఇంట్లో గాలి సరిగ్గా ప్రసరించకపోవడం, కిచెన్‌లో పదార్థాల వ్యర్థాలు, దుస్తులు పరిశుభ్రంగా లేకపోవడం, పెంపుడు జంతువుల శుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహించడం.. ఇలా ఇంట్లో దుర్వాసనలకు కారణాలు చాలానే ఉంటాయి. అయితే వీటి నుంచి తాత్కాలిక ఉపశమనం కోసం చాలామంది పరిమళాలు వెదజల్లే ఎయిర్‌ డిఫ్యూజర్లు, రూమ్‌ ఫ్రెష్‌నర్లు ఉపయోగిస్తుంటారు. వీటివల్ల సువాసనల మాటేమో గానీ.. వీటి నుంచి వెలువడే రసాయనాలు, ఘాటైన వాసనల వల్ల శ్వాస సంబంధిత సమస్యలే ఎక్కువగా తలెత్తుతున్నాయని చెబుతున్నారు నిపుణులు. అందుకే ఇంట్లో సహజసిద్ధమైన పరిమళాలు వెదజల్లేలా పలు చిట్కాలు పాటించడం ఉత్తమం అంటున్నారు. మరి, అదెలాగో మనమూ తెలుసుకుందాం రండి..

ఆయిల్‌ బర్నర్స్

ఇంట్లోని దుర్వాసనలు దూరం చేసి పరిమళాలు నింపడానికి చాలామంది అత్యవసర నూనెల్ని ఉపయోగించడం మనకు తెలిసిందే! అయితే వీటి గాఢత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆవిరి రూపంలో ఉపయోగించడమే మంచిదంటున్నారు నిపుణులు. ఇందుకోసం వివిధ డిజైన్లలో రూపొందించిన ఆయిల్‌ బర్నర్స్‌ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి. వీటికి కింది భాగంలో ఉండే చిన్న రంధ్రంలో క్యాండిల్‌/దీపం అమర్చుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక పైభాగంలో ఒక బౌల్ లాంటిది అమరి ఉంటుంది. అందులో నీళ్లు నింపి.. కొన్ని చుక్కల ఏదైనా అత్యవసర నూనె వేయాలి. ఇప్పుడు కింది నుంచి దీపం వెలుగుతున్న కొద్దీ ఆ వేడికి నూనె మిశ్రమం వేడెక్కి క్రమంగా ఆవిరవుతుంటుంది.. తద్వారా పరిమళాలు వెదజల్లుతుంది. ఇలా బౌల్‌లో మిశ్రమం అడుగంటిన కొద్దీ తిరిగి నింపుతుండాలి. ఇలాంటి ఆయిల్‌ బర్నర్స్‌లో కరెంట్‌తో పని చేసేవి కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటిని ప్రతి గదిలోనూ అమర్చుకొని ఇంటిని పరిమళభరితం చేసుకోవచ్చు.

అత్యవసర నూనెలతో ఇలా!

ఆయిల్‌ బర్నర్స్‌తోనే కాకుండా.. ఇతర పద్ధతుల్లోనూ అత్యవసర నూనెలతో ఇంట్లో పరిమళాలు నింపచ్చు. ఇందుకోసం.. బాటిల్‌లో నీరు నింపి కొన్ని చుక్కల ఏదైనా అత్యవసర నూనెను వేయాలి. ఆపై షేక్‌ చేసి.. దాన్ని స్ప్రే బాటిల్‌లో నింపుకోవాలి. ఇంట్లో దుర్వాసనలు వెదజల్లే చోట లేదంటే ఇల్లంతా కూడా ఈ మిశ్రమాన్ని స్ప్రే చేసుకోవచ్చు. ఇక తేమ కారణంగా అల్మరాల్లో నుంచి దుర్వాసన వస్తుంటే.. కాటన్‌ బాల్స్‌పై కొన్ని చుక్కల అత్యవసర నూనె వేసి లేదంటే స్ప్రే బాటిల్‌తో స్ప్రే చేసి.. వాటిని అల్మరా/కప్‌బోర్డ్‌ మూలల్లో ఉంచితే ఫలితం ఉంటుంది.

అగర్‌బత్తీలకు బదులు..!

ఇంట్లో దుర్వాసనలు వస్తుంటే.. చాలామంది ముందుగా చేసే పని.. అగర్‌బత్తీలు వెలిగించడం. నిజానికి వీటి నుంచి సువాసనలు వెదజల్లినా.. వాటి తయారీలో వాడిన కొన్ని రసాయన పదార్థాలు వాతావరణంలోకి చేరి.. కళ్లలో మంట, చర్మంపై దురద.. వంటివి వస్తుంటాయి. కాబట్టి వీటికి ప్రత్యామ్నాయంగా, సహజసిద్ధంగా తయారైన డిఫ్యూజర్‌ స్టిక్స్‌ ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి. వెదురు, చార్‌కోల్‌, తాటిచెట్టు బెరడు.. వంటి సహజసిద్ధమైన పదార్థాలు ఉపయోగించి.. మూలికలు, పువ్వుల నుంచి తీసిన నూనెను జతచేసి వీటిని తయారుచేస్తారు. అగర్‌బత్తీ స్టిక్స్‌ని పోలి ఉండే వీటిని వెలిగించడం వల్ల గదిలో పరిమళాలు వెదజల్లుతాయి.. అలాగే ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యా ఉండదు.

సెంటెడ్‌ క్యాండిల్స్

ఇంట్లో దుర్వాసనలు దూరం చేయడంతో పాటు ఒత్తిడిని తరిమికొట్టి మానసిక ప్రశాంతతను అందించడంలో సెంటెడ్‌ క్యాండిల్స్ ముందుంటాయి. అందుకే చాలామంది వీటిని వెలిగించుకొని సేదదీరుతుంటారు. అయితే వీటిలోనూ సహజసిద్ధమైన పదార్థాలతో తయారుచేసిన క్యాండిల్స్‌ మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటిలోనూ విభిన్న డిజైన్లలో రూపొందించినవి ఎంచుకుంటే.. ఇటు ఇంట్లో పరిమళాలు నింపచ్చు.. అటు ఇంటిని ఆకర్షణీయంగానూ మార్చచ్చు.

వీటన్నింటితో పాటు పరిమళాలు వెదజల్లే పూల మొక్కలు, ఇండోర్‌ ప్లాంట్స్‌ని కూడా ఇంట్లో అక్కడక్కడా ఏర్పాటుచేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని