Published : 06/01/2023 20:11 IST

చుండ్రుకు చెక్ పెట్టాలంటే..!

చుండ్రు.. ప్రత్యేకించి శీతాకాలంలో ఎక్కువగా వేధించే సమస్య ఇది. దీన్నుంచి ఉపశమనం పొందడానికి వివిధ రకాల షాంపూలు మొదలైనవి వాడడం తెలిసిందే. ఈక్రమంలో ఇంట్లోనే లభించే కొన్ని పదార్థాలకు హెన్నా పొడి కలిపి తయారు చేసుకునే ప్యాక్స్‌తో కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.

కోడిగుడ్డు ప్యాక్..

గుడ్డులోని తెల్లసొన జుట్టుకు పోషణనందించడంలో ఎంతగానో సహకరిస్తుంది. అంతేకాదు.. ఇది చుండ్రును తొలగించడానికీ ఉపయోగపడుతుంది. మూడు టేబుల్‌స్పూన్ల హెన్నా పొడి, టేబుల్‌స్పూన్ ఆలివ్ నూనె, రెండు టేబుల్‌స్పూన్ల బాగా బీట్ చేసిన గుడ్డు తెల్లసొన.. ఈ మూడింటినీ ఒక బౌల్‌లో తీసుకొని కొద్దికొద్దిగా నీళ్లు కలుపుతూ మృదువైన పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్త్లె చేసి 45 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆపై గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే క్రమంగా చుండ్రు సమస్య నుంచి విముక్తి కలుగుతుంది.

మిరియాలతో..

కుదుళ్లలోని ఫంగల్ ఇన్ఫెక్షన్లకు మిరియాలు చక్కటి పరిష్కారం చూపుతాయి. అంతేకాదు.. చుండ్రును తగ్గించడంలోనూ ఇది బాగా పనిచేస్తుంది. ఇందుకోసం నాలుగు టేబుల్‌స్పూన్ల హెన్నా పొడిలో కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా కొత్తిమీర పేస్ట్, తగినన్ని నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి పూర్తిగా ఆరనివ్వాలి. ఆపై గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఈ చిట్కా తరచూ పాటించడం వల్ల త్వరలోనే చుండ్రు సమస్య తొలగిపోతుంది.

ఈ నూనెతో..

చుండ్రు సమస్యను తగ్గించడానికి ఆవనూనె కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందుకోసం పావు లీటర్ ఆవనూనెను ఒక గిన్నెలో తీసుకొని వేడి చేయాలి. దాన్నుంచి పొగ వెలువడుతున్నప్పుడు స్టౌ కట్టేసి అందులో కొన్ని గోరింటాకులు, టీస్పూన్ మెంతుల్ని వేయాలి. ఇప్పుడు ఈ నూనెను పూర్తిగా చల్లారనిచ్చి వడకట్టుకొని గాలి చొరబడని సీసాలో భద్రపరచుకోవాలి. ఇలా తయారుచేసుకున్న నూనెను తలస్నానానికి ముందు కుదుళ్లు, జుట్టుకు పట్టించాలి. ఆపై గంట తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. ఇలా తరచూ చేస్తుంటే చుండ్రు సమస్య నుంచి త్వరలోనే ఉపశమనం లభిస్తుంది.


జుట్టు ఆరోగ్యానికీ..

జుట్టు ఆరోగ్యానికి దోహదం చేసే హెన్నా వాడకం ఈనాటిది కాదు.. పూర్వకాలం నుంచే దీన్ని పలు కేశ సంబంధిత సమస్యల్ని తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. చుండ్రును తగ్గించడంలో కీలక పాత్ర పోషించే ఈ పదార్థం కేశాలకు సహజసిద్ధమైన రంగును అందించడంతో పాటు జుట్టును కండిషనింగ్ కూడా చేస్తుంది. అంతేకాదు.. ఇందులోని సహజసిద్ధమైన గుణాలు జుట్టుకు పోషణనందించి కేశాలు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. ఈ పొడిలోని యాంటీఫంగల్, యాంటీమైక్రోబియల్ గుణాలు కుదుళ్లలోని ఇన్ఫెక్షన్లను తొలగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే ఇది పొడిబారిన జుట్టుకు తేమనందించడానికి, చివర్లు చిట్లే సమస్యను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది.

హెన్నా వల్ల చుండ్రు తొలగిపోవడమే కాదు.. దానివల్ల జుట్టుకు చేకూరే ఇతర ప్రయోజనాలనూ తెలుసుకున్నారు కదా! అలాగని దీంతో తయారుచేసిన ప్యాక్‌లను మరీ ఎక్కువగా ఉపయోగించడం కూడా జుట్టు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అలాగే పొడి జుట్టు ఉన్న వారు ఈ ప్యాక్‌లు తొలగించుకున్న వెంటనే కండిషనర్ రాసుకోవడం మర్చిపోవద్దు. తద్వారా కేశాలు మరింత పొడిబారకుండా జాగ్రత్తపడచ్చు.

అలాగే కొన్ని పదార్ధాలు సహజ సిద్ధంగా లభించేవే అయినా- కొంతమందికి  వివిధ కారణాల వల్ల శరీరానికి సరిపడకపోవచ్చు. ఇలాంటి సమస్య ఉన్నవారు మాత్రం - ఈ చిట్కాలను పాటించే విషయంలో వ్యక్తిగత సౌందర్య నిపుణులను సంప్రదించి వీటిని వాడడం మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని