Published : 26/11/2021 19:45 IST

అక్కడ అవాంఛిత రోమాలా? అయితే ఇలా చేయండి!

నీలిమ ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. తాను అన్ని విషయాల్లో ధైర్యంగా, ముక్కుసూటిగా వ్యవహరించే అమ్మాయి. కానీ ఒక్క విషయం మాత్రం తనను వేదనకు గురిచేస్తోంది. అదే అవాంఛిత రోమాల సమస్య. ముఖ్యంగా చనుమొనల (నిపుల్స్) దగ్గర వచ్చే అవాంఛిత రోమాలను ఎన్ని సార్లు షేవ్‌ చేసుకున్నా మళ్లీ మళ్లీ తనకు అదే సమస్య ఎదురవుతోంది. పోనీ దీనికి శాశ్వత పరిష్కారం కోసం డాక్టర్‌ దగ్గరికి వెళ్దామా అనుకుంటే.. ఈ విషయం డాక్టర్‌కు ఎలా చెప్పాలన్న మొహమాటంతో వెనకడుగు వేస్తోంది.

శైలిమ ఈమధ్యే పెద్ద మనిషైంది. తనకు కూడా నిపుల్స్ వద్ద అవాంఛిత రోమాలు రావడంతో తల్లితో కూడా చెప్పుకోవడానికి వెనకాడుతోంది. పోనీ ఫ్రెండ్స్‌ని అడుగుదామంటే ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచే విపరీతమైన సిగ్గు, బిడియం!

ఈ సమస్య వీరిద్దరిదే కాదు.. చాలామంది అమ్మాయిలు ఈ విషయం గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంటారు. అయితే ఈ విషయంలో అంత బిడియపడాల్సిందేమీ లేదని.. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత, పీసీఓఎస్‌ వంటివి ఇలాంటి కొన్ని శరీర భాగాల్లో అవాంఛిత రోమాలకు కారణమవుతాయని అంటున్నారు నిపుణులు. మరి, దీనికి పరిష్కారం కావాలంటే ఇంటి చిట్కాలే మేలంటున్నారు. అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

ఈ న్యాచురల్‌ వ్యాక్స్‌తో..!

చేతులు, కాళ్లు.. వంటి సున్నితమైన భాగాల్లో ఉండే అవాంఛిత రోమాల్ని తొలగించుకోవడానికి మనం ఎలాగైతే వ్యాక్స్‌ వాడతామో.. నిపుల్‌ హెయిర్‌ని తొలగించుకోవడానికి కూడా వ్యాక్స్‌ని ఉపయోగించచ్చు. ఇందుకోసం మనకు కావాల్సిందల్లా..

* నిమ్మరసం - టేబుల్‌స్పూన్

* చక్కెర లేదా బ్రౌన్‌ షుగర్‌ – టేబుల్‌స్పూన్

* తేనె - టేబుల్‌స్పూన్

* వ్యాక్సింగ్‌ స్ట్రిప్

వ్యాక్సింగ్‌ స్ట్రిప్‌ మినహా మిగిలిన పదార్థాలన్నింటినీ ఒక బౌల్‌లోకి తీసుకొని బాగా కలపాలి. దీన్ని స్టౌ మీద పెట్టి పదార్థాలన్నీ బాగా కరిగి, కలిసిపోయి వ్యాక్స్‌లా చిక్కగా మారేంత వరకూ కలుపుతూ మరిగించాలి. ఇప్పుడు స్టౌ ఆఫ్‌ చేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఆపై నిపుల్‌ హెయిర్‌ పెరిగే దిశలో దీన్ని అప్లై చేసి.. దానిపై వ్యాక్సింగ్‌ స్ట్రిప్‌ పెట్టి కాస్త ఒత్తాలి. ఇప్పుడు ఆ స్ట్రిప్‌ని వ్యతిరేక దిశలో లాగేస్తే సరి. ఈ న్యాచురల్‌ వ్యాక్స్‌ నిపుల్‌ హెయిర్‌ని తొలగించడంతో పాటు.. ఇందులో మనం ఉపయోగించిన తేనె చర్మానికి తేమనందించడంలో సహకరిస్తుంది. అలాగే నిమ్మరసంలోని బ్లీచింగ్‌ గుణాలు ఆ ప్రదేశంలోని చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మారుస్తాయి.

పసుపుతో రోమాలు మాయం!

పసుపు అవాంఛిత రోమాల్ని తొలగించడంలో చక్కగా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక బౌల్‌లో టేబుల్‌స్పూన్‌ పసుపు, టేబుల్‌స్పూన్‌ శెనగపిండి తీసుకొని దీనికి కొద్దికొద్దిగా నువ్వుల నూనె జతచేస్తూ చిక్కటి పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నిపుల్స్‌ దగ్గర అవాంఛిత రోమాలున్న ప్రదేశంలో అప్లై చేసి.. కొన్ని నిమిషాల పాటు గుండ్రంగా మసాజ్‌ చేయాలి. ఆ తర్వాత కడిగేసుకోవాలి. ఇదే చిట్కాను వారానికి ఒకటి లేదా రెండుసార్లు పాటిస్తే కొన్ని వారాల్లోనే ఫలితం కనిపిస్తుంది.

వారానికి రెండుసార్లు ఇలా!

టేబుల్‌స్పూన్ తేనెలో అరటీస్పూన్‌ నిమ్మరసం జతచేయాలి. బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని నిపుల్‌ హెయిర్‌ ఉన్న ప్రదేశంలో అప్లై చేసుకోవాలి. అరగంట పాటు అలాగే వదిలేయాలి. ఇప్పుడు వేడి నీళ్లలో ముంచిన క్లాత్‌తో తుడిచేసి.. ఆఖర్లో చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల కొన్ని వారాల్లోనే అవాంఛిత రోమాల పెరుగుదలకు అడ్డుకట్ట వేయచ్చు. అలాగే ఈ మిశ్రమం ఆ ప్రదేశంలోని చర్మాన్ని మృదువుగా మార్చుతుంది కూడా!

గుడ్డుతో ఇలా చేయండి!

ఒక గుడ్డులోని తెల్లసొన, టేబుల్‌స్పూన్‌ చక్కెర, అర-టీస్పూన్‌ కార్న్‌ఫ్లోర్‌.. ఈ మూడింటినీ ఒక బౌల్‌లోకి తీసుకొని బాగా గిలక్కొట్టాలి. తద్వారా ఇది మృదువైన పేస్ట్‌లా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని సమస్య ఉన్న చోట రోమాలు పెరిగే దిశలో అప్లై చేయాలి. కాసేపటి తర్వాత ఇది గట్టిపడుతుంది. అప్పుడు దీన్ని వ్యతిరేక దిశలో లాగేస్తే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.

ఈ స్క్రబ్‌తో రోమాలకు చెక్!

ఒక చిన్న గిన్నెలో టేబుల్‌స్పూన్‌ పసుపు తీసుకోవాలి. దీనికి టీస్పూన్‌ పాలు జతచేస్తూ పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట రోమాలు పెరిగే దిశలో అప్లై చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆరిపోయాక వేళ్లను తడిచేసుకొని వ్యతిరేక దిశలో గుండ్రంగా రుద్దాలి. ఆపై చల్లటి నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది. ఇలా వారానికి రెండుమూడు సార్లు చేస్తే కొన్ని వారాల్లోనే అవాంఛిత రోమాల పెరుగుదల ఆగిపోతుంది.

బొప్పాయి-పసుపుతో..

బాగా పండిన ఒక బొప్పాయి పండును గిన్నెలోకి తీసుకొని మ్యాష్‌ చేయాలి. ఇందులో టీస్పూన్‌ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట అప్లై చేసి మృదువుగా రుద్దాలి. ఆపై చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇదే పద్ధతిని వారానికి రెండుమూడు సార్లు చేయడం వల్ల.. ఆ ప్రదేశంలో అవాంఛిత రోమాల సమస్య క్రమంగా తగ్గుముఖం పట్టడం గమనించచ్చు.

గమనిక: నిపుల్‌ హెయిర్‌ని తొలగించుకోవడానికి ఉపయోగించే ఈ పదార్థాలన్నీ సహజసిద్ధమైనవే కాబట్టి ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. అయితే ఇన్ని చేసినా సమస్య తగ్గకపోతే మాత్రం ఒకసారి డెర్మటాలజిస్ట్‌ని సంప్రదిస్తే సరైన సలహా ఇస్తారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని