Published : 16/12/2021 18:39 IST

పాదాలపై ట్యాన్ పోవాలంటే..

సాధారణంగా ముఖం, మెడ, చేతులు, జుట్టు… వీటి సౌందర్యాన్ని పరిరక్షించుకోవడం కోసమే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారంతా. బహుశా ఇవి పైకి కనబడే శరీరభాగాలు కావడమే ఇందుకు కారణం కావచ్చేమో..! మరి పాదాలూ ఈ కోవలోకే వస్తాయి. అయితే వాటి సంరక్షణ విషయంలో పెద్దగా జాగ్రత్త తీసుకోం. మహా అయితే కాలికి పగుళ్లు రాకుండా ఉండేందుకు చిన్న చిన్న చిట్కాలు పాటించడంతో పాటు అందమైన చెప్పులను ధరించడానికి ఆసక్తి చూపిస్తుంటామేమో గానీ పాదాలపై పేరుకొన్న ట్యాన్‌ని మాత్రం పట్టించుకోకుండా అలాగే వదిలేస్తూ ఉంటాం. దీంతో అవి నల్లగా కనిపిస్తుంటాయి. అలా కాకుండా పాదాలు కూడా చక్కటి మేనిఛాయతో మెరవాలంటే.. కొన్ని సహజసిద్ధమైన ప్యాక్‌లను ఉపయోగిస్తే సరిపోతుంది. మరి అవేంటో తెలుసుకుందామా..

పెరుగు..

పెరుగు ఆరోగ్యాన్ని కాపాడటానికే కాదు.. అందాన్ని సంరక్షించడానికీ ఉపయోగపడుతుంది. అయితే దీన్ని ఎక్కువగా శిరోజ సంరక్షణలోనూ, ఫేస్‌ప్యాక్స్‌లోనూ ఉపయోగిస్తారు. కానీ దీనిలో ట్యాన్‌ను తొలగించే గుణాలు కూడా ఉన్నాయి. కొద్దిగా పెరుగుని తీసుకొని దాన్ని పాదాలకు రాసుకోవాలి. 20 నిమిషాల నుంచి అరగంట పాటు ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. ఈ చిట్కాను రోజు విడిచి రోజు పాటించడం ద్వారా చక్కటి ఫలితం కనిపిస్తుంది. అంతేకాదు కాళ్లపై ఏర్పడిన పగుళ్లు సైతం తగ్గిపోతాయి. పాదాల చర్మానికి చక్కటి పోషణ కూడా అందుతుంది.

నిమ్మరసం

పాదాలపై ఏర్పడిన ట్యాన్‌ను నిమ్మరసం బాగా వదలగొడుతుంది. దీనిలోని ఆమ్లతత్వం మెలనిన్ శాతాన్ని తగ్గిస్తుంది. ఈ ఫలితం పొందడానికి కొద్దిగా నిమ్మరసం తీసుకొని దానిలో సరిపడా పంచదారను కలిపి మిశ్రమంగా తయారుచేయాలి. ఇది స్క్రబ్‌లా పనిచేస్తుంది. దీంతో పాదాలను కాసేపు మర్దన చేసుకొంటే సరిపోతుంది. ట్యాన్‌తో పాటు మృతకణాలు సైతం ఈ ప్యాక్ ద్వారా తొలగిపోతాయి. చర్మం కాంతివంతంగానూ తయారవుతుంది. ఈ ప్యాక్‌ని తరచుగా ఉపయోగిస్తూ ఉంటే.. పాదాలపై ట్యాన్ పేరుకోకుండా కూడా జాగ్రత్తపడచ్చు. నిమ్మరసం, పంచదార మిశ్రమమే కాకుండా కొద్దిగా నిమ్మరసాన్ని పాదాలకు రాసి అరగంట సమయం ఆరనిచ్చిన తర్వాత కడిగేసినా ఫలితం ఉంటుంది. అలాగే నిమ్మరసంలో కొద్దిగా తేనెను కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకు రాసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రం చేసుకొంటే పాదాలు అందంగా కనిపిస్తాయి.

టొమాటో..

టొమాటోలో సహజసిద్ధమైన బ్లీచ్ గుణాలున్నాయి. ఇవి ట్యాన్ కారణంగా నల్లగా మారిన చర్మానికి పూర్వపు రంగుని తిరిగి అందిస్తాయి. ఈ ఫలితాన్ని పొందడానికి టొమాటో రసాన్ని పాదాలకు రాసి ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడిగేస్తే సరిపోతుంది. టొమాటోను ఉపయోగించి మరో చిట్కాను సైతం పాటించవచ్చు. టొమాటో ముక్కను తీసుకొని దానితో పాదాలపై కాసేపు రుద్దుకొని.. ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమంగా చేయడం వల్ల త్వరలోనే ట్యాన్ వదిలిపోతుంది. అలాగే టొమాటో రసంలో కొద్దిగా చక్కెరను కలిపి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. దీంతో కాసేపు మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత అరగంట సమయం ఆరనిచ్చి చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే.. పాదాలు అందంగా తయారవుతాయి.

యాపిల్ సిడర్ వెనిగర్..

మనం ధరించే చెప్పుల ఆకారం కొన్ని సార్లు మన పాదాలపై ఉండిపోతుంది. ఆ ప్రాంతంతో పోలిస్తే మిగిలిన భాగం నల్లగా కనిపిస్తుంది. ఈ సమస్య చాలా మందిలో కనిపించేదే. మరి దీనికి పరిష్కారం ఏంటో తెలుసా? యాపిల్ సిడర్ వెనిగర్. ఇది పాదాలపై ఏర్పడిన ట్యాన్‌ను తొలగించడంలో సాయం చేస్తుంది. యాపిల్ సిడర్ వెనిగర్‌లో దూదిని ముంచి ట్యాన్ ఏర్పడిన చోట అద్దాలి. ఇరవై నిమిషాల తర్వాత కడిగేస్తే సరిపోతుంది. ఈ చిట్కాను స్నానం చేయడానికి ముందు పాటిస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

బంగాళాదుంపతో..

బంగాళాదుంపలో సైతం ట్యాన్‌ను తొలగించే గుణాలుంటాయి. దీనికోసం ఆలూ తొక్క తొలగించి శుభ్రం చేసుకోవాలి. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి బ్లెండర్‌లో వేసి మెత్తగా తయారుచేయాలి. ఈ గుజ్జును వస్త్రంలో మూట మాదిరిగా కట్టి రసాన్ని వేరు చేయాలి. దీన్ని పాదాలకు రాసుకొని పూర్తిగా ఆరిన తర్వాత కడిగేస్తే సరిపోతుంది. బంగాళాదుంపల్ని గుండ్రంగా స్త్లెసుల మాదిరిగా కత్తిరించి దాంతో రుద్దుకున్నా ఇదే ఫలితం కనిపిస్తుంది.

క్యాబేజీతో..

చిన్న గిన్నెడు సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలను తీసుకోవాలి. దీనికి టేబుల్‌స్పూన్ చొప్పున తేనె, శెనగపిండి, చిటికెడు పసుపు కలిపి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. ఇది ఫుట్‌ప్యాక్‌లాగా పనిచేస్తుంది. దీన్ని పాదాలకు అప్త్లె చేసుకొని బాగా ఆరిన తర్వాత కడిగేస్తే ట్యాన్‌పోయి పాదాలు అందంగా కనిపిస్తాయి.

చూశారుగా పాదాలపై ఏర్పడిన ట్యాన్‌ని పోగొట్టాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో..! మరింకెందుకాలస్యం.. మీరు కూడా వీటిని పాటించి మీ పాదాలను అందంగా మెరిపించేయండి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని