Hirsutism : అక్కడ అవాంఛిత రోమాలెందుకొస్తాయ్‌?!

మధురిమకు పైపెదవి, గడ్డం, బుగ్గలపై రోమాలు కాస్త ఒత్తుగా ఉంటాయి. దీంతో తీవ్ర అసౌకర్యానికి లోనయ్యే ఆమె వాటిని తొలగించుకోవడానికి పదే పదే వ్యాక్సింగ్‌ పద్ధతిని ప్రయత్నిస్తుంటుంది.ఛాతీ, భుజాలు, వీపుపై అవాంఛిత రోమాలతో బాధపడుతోంది కావేరి. వీటిని పదే పదే తొలగించుకున్నా అప్పుడప్పుడూ డీప్‌ నెక్‌ బ్లౌజ్‌ వేసుకోవడానికి వెనకాడుతుంటుంది.

Published : 27 Feb 2022 14:47 IST

మధురిమకు పైపెదవి, గడ్డం, బుగ్గలపై రోమాలు కాస్త ఒత్తుగా ఉంటాయి. దీంతో తీవ్ర అసౌకర్యానికి లోనయ్యే ఆమె వాటిని తొలగించుకోవడానికి పదే పదే వ్యాక్సింగ్‌ పద్ధతిని ప్రయత్నిస్తుంటుంది.

ఛాతీ, భుజాలు, వీపుపై అవాంఛిత రోమాలతో బాధపడుతోంది కావేరి. వీటిని పదే పదే తొలగించుకున్నా అప్పుడప్పుడూ డీప్‌ నెక్‌ బ్లౌజ్‌ వేసుకోవడానికి వెనకాడుతుంటుంది.

ముఖం, ఛాతీ, పొట్ట, వీపు.. వంటి భాగాల్లో పురుషుల మాదిరిగా కొంతమంది మహిళల్లోనూ అవాంఛిత రోమాలు పెరుగుతుంటాయి. ఈ సమస్యను Hirsutism అంటారు. ఐదు నుంచి పది శాతం మంది మహిళల్లో ఈ సమస్య ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల స్త్రీలలో ఆత్మన్యూనత పెరిగి ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. అసలు ఇంతకీ హిర్సుటిజం ఎందుకొస్తుంది? దీన్ని అదుపు చేసుకునే మార్గాలున్నాయా? రండి.. తెలుసుకుందాం..!

హార్మోన్ల అసమతుల్యతే అసలు కారణం..!

సాధారణంగా శరీరం, ముఖంపై కనీ కనిపించనట్లుగా అవాంఛిత రోమాలుండడం సహజం. అయితే ఇవి అసాధారణ రీతిలో, ఒత్తుగా పెరిగినప్పుడే సమస్య మొదలవుతుంది. ఈ పరిస్థితినే హిర్సుటిజం అంటారు. శరీరంలో పురుష హార్మోన్లైన ఆండ్రోజన్ల స్థాయులు పెరిగినప్పుడు ఈ సమస్య తలెత్తుతుందంటున్నారు నిపుణులు. తద్వారా పురుషుల మాదిరిగా కొన్ని శరీర భాగాల్లో రోమాలు ఒత్తుగా పెరుగుతుంటాయి. ఇదే కాదు.. హిర్సుటిజం సమస్యకు ఇతర కారణాలు కూడా దోహదం చేస్తాయి. అవేంటంటే..!

* శరీరంలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా పీసీఓఎస్‌ సమస్య తలెత్తుతుంది. ఇది హిర్సుటిజంకు దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు. ప్రతి నాలుగు హిర్సుటిజం కేసుల్లో ముగ్గురు పీసీఓఎస్‌ బాధితులేనని అమెరికన్‌ ఫ్యామిలీ ఫిజీషియన్‌ జర్నల్‌ చెబుతోంది.

* ఆర్థ్రైటిస్‌, శ్వాస సంబంధిత సమస్యలు, చర్మ అలర్జీలు.. వంటి సమస్యల్ని తగ్గించుకోవడానికి వాడే దీర్ఘకాలిక మందుల కారణంగా శరీరంలో కార్టిసాల్‌ హార్మోన్ల స్థాయులు పెరుగుతాయి. ఈ పరిస్థితిని Cushing's Syndrome అంటారు. దీనివల్ల కూడా ఆయా శరీర భాగాల్లో అవాంఛిత రోమాలు అధికంగా పెరుగుతుంటాయి.

* హైపో థైరాయిడిజం, హైపర్‌ థైరాయిడిజం.. వంటి థైరాయిడ్‌ సమస్యలు కూడా హిర్సుటిజంకు దారితీస్తాయంటున్నారు నిపుణులు. కాబట్టి శరీరంపై అసాధారణ స్థాయిలో అవాంఛిత రోమాలు పెరుగుతున్నట్లయితే ఓసారి థైరాయిడ్‌ పరీక్ష చేయించుకొని నిర్ధరించుకోవడం కూడా తప్పనిసరి అంటున్నారు.

* అడ్రినల్‌ గ్రంథి లేదా అండాశయాల్లో ఏర్పడే కణతులు కూడా అరుదుగా హిర్సుటిజంకు కారణమయ్యే అవకాశాలున్నాయట! ఇవి శరీరంలో ఆండ్రోజన్‌ స్థాయుల్ని పెంచి.. అవాంఛిత రోమాలు ఎక్కువగా పెరిగేందుకు దోహదం చేస్తాయి.

* వీటితో పాటు స్థూలకాయం, వంశపారంపర్యంగా కూడా ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువంటున్నారు నిపుణులు.

నిర్ధరణ ఎలా?!

అయితే శరీరంపై పెరిగే అవాంఛిత రోమాలకు అసలు కారణమేంటో తెలుసుకోవాలంటే కొన్ని నిర్ధరణ పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మీరు వాడుతోన్న దీర్ఘకాలిక మందుల వివరాలు డాక్టర్‌కి తెలియజేయాల్సి ఉంటుంది. దీంతో పాటు రక్త పరీక్షలు, అడ్రినల్‌ గ్రంథి-అండాశయాల్లో కణతులేవైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్‌ స్కాన్‌, MRI స్కాన్‌.. వంటి పరీక్షలు అవసరమవుతాయి.

అదుపు చేసుకోవచ్చిలా..!

హిర్సుటిజం సమస్యకు చికిత్స తీసుకునే క్రమంలో డాక్టర్‌ సూచించిన మందులు, క్రీమ్‌లతో పాటు కొన్ని ఇంటి చిట్కాలు కూడా పాటిస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

* అవాంఛిత రోమాల్ని తొలగించుకోవడానికి చాలామంది షేవింగ్‌, వ్యాక్సింగ్‌.. వంటివి పాటిస్తుంటారు. అయితే ఈ రోమాల సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు షేవింగ్‌/వ్యాక్సింగ్‌ విషయాల్లో మరింత అలర్ట్‌గా ఉండాలి. ఈ క్రమంలో నిర్ణీత వ్యవధుల్లో ఎప్పటికప్పుడు రోమాల్ని తొలగించుకోవాల్సి ఉంటుంది.

* లేజర్‌ హెయిర్‌ రిమూవల్‌ చికిత్స కూడా తీసుకోవచ్చు. అయితే ఈ విషయంలో నిపుణుల సలహా ప్రకారమే ముందుకెళ్లడం మంచిది.

* పీసీఓఎస్‌, స్థూలకాయం ఉన్న మహిళలు ముందుగా తమ బరువును అదుపులోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నిపుణులు సూచించిన ఆహార నియమాలతో పాటు పలు వ్యాయామాలు చేయడం కూడా ముఖ్యం.

* ఒత్తిడి వల్ల కూడా శరీరంలో హార్మోన్ల స్థాయులు అదుపు తప్పుతాయి. కాబట్టి మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానంతో పాటు మనసుకు నచ్చిన పనులు చేయడం అలవాటు చేసుకోవాలి.

* పుదీనా టీ శరీరంలో యాంటీ-ఆండ్రోజన్‌ ప్రక్రియను ప్రేరేపిస్తుంది. తద్వారా పురుష హార్మోన్ల స్థాయులు పెరగకుండా జాగ్రత్తపడచ్చు. అంతిమంగా ఇది అవాంఛిత రోమాల పెరుగుదలను అడ్డుకుంటుంది. కాబట్టి రోజుకు కప్పు చొప్పున ఈ టీ తాగడం మంచిది.

* జింక్‌ అధికంగా లభించే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల హిర్సుటిజం సమస్యను అదుపులో పెట్టుకోవచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అయితే దీన్ని ఎంత మోతాదులో తీసుకోవాలన్న విషయం ముందుగా నిపుణుల్ని అడిగి తెలుసుకోవడం ముఖ్యం. గుడ్లు, చికెన్‌, నట్స్‌, బీన్స్‌.. వంటి పదార్థాల్లో జింక్‌ ఎక్కువగా లభిస్తుంది.

* పీసీఓఎస్‌ లక్షణాలను అదుపు చేసి.. తద్వారా అవాంఛిత రోమాల్ని పెరగకుండా కంట్రోల్‌ చేసే లక్షణాలు ఫోలికామ్లంలో ఉన్నాయి. అందుకే నిపుణుల సలహా మేరకు ఫోలికామ్లం మాత్రలు వేసుకోవడం లేదంటే ఆకుకూరలు, బ్రకలీ, బీన్స్‌.. వంటివి ఎక్కువగా తీసుకోవడం మంచిది.

ఈ ప్యాక్స్‌తో..!

అసాధారణంగా పెరిగే అవాంఛిత రోమాల్ని తొలగించుకోవడానికి ఇంట్లో తయారుచేసుకునే కొన్ని రకాల ప్యాక్స్‌ కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి.

* బాగా పండిన బొప్పాయి ముక్కల్లో కొద్దిగా పసుపు వేసి పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని సమస్య ఉన్న చోట అప్లై చేసుకొని.. అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల ఫలితం కనిపిస్తుంది.

* గుడ్డులోని తెల్లసొనలో టేబుల్‌స్పూన్‌ కార్న్‌స్టార్చ్‌, కొద్దిగా చక్కెర వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలున్న ప్రదేశంలో అప్లై చేసి పూర్తిగా ఆరిపోనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి.

ఇలా ఈ చిట్కాలన్నీ పాటిస్తూ.. నిర్ణీత వ్యవధుల్లో డాక్టర్‌ను సంప్రదిస్తూ.. తగిన సలహాలు పాటిస్తే హిర్సుటిజం సమస్యను అదుపు చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్