Published : 14/10/2022 21:07 IST

పైపెదవిపై నలుపు తగ్గాలంటే..!

చర్మం మృదువుగా, నాజూగ్గా ఉంటే ఎంతో అందంగా కనిపిస్తుంది. అయితే కొంతమంది పైపెదవి పైభాగంలో అవాంఛిత రోమాలతో బాధపడుతుంటారు. వీటిని తొలగించుకునే క్రమంలో కొందరు వ్యాక్సింగ్, త్రెడింగ్, బ్లీచింగ్.. వంటి సౌందర్య చికిత్సల్ని ఆశ్రయిస్తుంటారు. కానీ ఒక్కోసారి అవి అందరికీ పడక ఆ ప్రదేశంలో చర్మం నల్లగా మారడం, ఎర్రటి దద్దుర్లు ఏర్పడడం.. వంటి సమస్యలు ఎదురవుతాయి. మరి ఇలా పైపెదవి పైభాగంలో నల్లగా మారిన చర్మాన్ని సాధారణ స్థితిలోకి తీసుకురావడానికి కొన్ని సహజసిద్ధమైన పదార్థాలు ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందామా?

కాంతివంతం అవుతుంది..

కేశ సంరక్షణలో, శరీరంపై ఏర్పడిన గాయాల్ని మాన్పడంలోనే కాదు.. పైపెదవి పైభాగంలో నల్లగా మారిన చర్మాన్ని తిరిగి కాంతివంతంగా చేయడానికి కూడా కొబ్బరినూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందుకోసం రాత్రి నిద్రపోయే ముందు పైపెదవి పైభాగంలో కొంచెం కొబ్బరినూనెను మందపాటి పొరలా పూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ ప్రదేశంలో చర్మం కోల్పోయిన తేమను తిరిగి పొంది.. నలుపుదనం క్రమంగా తగ్గిపోతుంది. అంతేకాదు.. అక్కడి చర్మం కాంతివంతంగానూ మారుతుంది.

ఇది ప్రయత్నించండి..

పైపెదవి పైభాగంలో ఏర్పడిన నలుపుదనాన్ని తగ్గించడంలో బాదం పప్పు, తేనె.. వంటివి కూడా సహకరిస్తాయి. ఇందుకోసం ముందుగా నాలుగైదు బాదం పప్పులను కొన్ని గోరువెచ్చటి నీళ్లలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే వీటిని మెత్తగా నూరాలి. దీనికి చెంచా తేనె కలుపుకొని.. రెండూ బాగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పైపెదవి పైభాగంలో మందపాటి పొరలా అప్త్లె చేసుకోవాలి. ఇలా ఓ అరగంట పాటు ఉంచుకుని చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఫలితంగా పైపెదవి పైన ఏర్పడిన నలుపుదనం క్రమంగా తొలగిపోయి ఆ ప్రదేశం కాంతివంతమవుతుంది.

పోషణ అందించాలంటే..

పాల మీగడ కూడా పైపెదవి పైభాగంలో నలుపుదనాన్ని తగ్గించడంలో సహకరిస్తుంది. ఇందుకోసం కాస్త పాల మీగడను ఒక చిన్న గిన్నెలో తీసుకుని అందులో ఓ కాటన్ బాల్‌ని ముంచాలి. దీంతో పైపెదవిపై మీగడను అప్త్లె చేసుకుని అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత తడిగా ఉండే శుభ్రమైన గుడ్డతో తుడిస్తే సరిపోతుంది. ఇలా క్రమం తప్పకుండా తరచూ చేయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా పాల మీగడలోని ల్యాక్టికామ్లం ఆ భాగానికి పోషణనందించి సమస్యను తగ్గిస్తుంది.

ఈ మిశ్రమంతో..

పైపెదవి పైన ఉండే చర్మంలోని కణాలు డ్యామేజ్ కావడం వల్ల కూడా ఆ ప్రదేశం నలుపుగా మారడం, పిగ్మెంటేషన్.. వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. మరి వీటిని తగ్గించడానికి క్యారట్, పెరుగు బాగా ఉపకరిస్తాయి. ముఖ్యంగా క్యారట్‌లోని బీటాకెరోటిన్, పెరుగులోని ల్యాక్టికామ్లం.. వంటివి ఈ సమస్యని దూరం చేసేందుకు సహకరిస్తాయి. కాబట్టి కొద్దిగా క్యారట్ రసంలో చెంచా పెరుగు వేసి.. చిక్కటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పైపెదవిపై మందపాటి లేయర్‌లా పూసుకొని పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. రోజూ ఈ చిట్కా ప్రయత్నించడం వల్ల కొన్ని రోజులలోనే ఆశించిన ఫలితాల్ని పొందచ్చు.

మరిన్ని..

🟇 కీరాదోస రసంతోనూ పైపెదవి పైభాగంలో నల్లగా మారిన చర్మాన్ని కాంతివంతంగా మార్చవచ్చు. ఇందుకోసం కీరా రసంలో ముంచిన కాటన్ బాల్‌తో పైపెదవిపై రసాన్ని అప్త్లె చేసి కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే సరి.

🟇 బంగాళాదుంప రసంతోనూ పైపెదవి పైభాగంలో ఏర్పడిన నలుపును క్రమంగా తగ్గించుకోవచ్చు. ఇందుకోసం కొద్దికొద్దిగా బంగాళాదుంప రసాన్ని ఐదు నిమిషాల వ్యవధిలో కనీసం గంటపాటు అప్త్లె చేసుకుంటూ ఉండాలి. అనంతరం చల్లటి నీటితో కడిగేసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది.

🟇 చర్మానికి సహజసిద్ధమైన బ్లీచింగ్ ఏజెంట్‌లా పనిచేసే నిమ్మరసం కూడా ఈ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందుకోసం రోజూ రాత్రి ఓ ఇరవై నిమిషాల పాటు ఈ రసాన్ని పైపెదవి పైభాగంలో అప్త్లె చేసుకోవాలి. తర్వాత నీటిలో ముంచి, పిండిన కాటన్ బాల్‌తో ఆ ప్రదేశంలో కాసేపు మసాజ్ చేసుకుంటే.. కొద్ది రోజుల్లోనే చక్కటి ఫలితం లభిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని