ఇవి ఉంటే.. మేకప్ రిమూవర్ ఎందుకు?

రోజంతా మేకప్‌లోనే ఉన్నా.. రాత్రి నిద్రపోయే ముందు మాత్రం మేకప్‌ను తొలగించుకోవడం తప్పనిసరి. లేదంటే లేనిపోని చర్మ సమస్యలు చుట్టుముడతాయి. ఈ క్రమంలో- రసాయన పూరిత మేకప్‌ రిమూవర్స్‌ బదులుగా....

Published : 08 Jul 2023 19:31 IST

రోజంతా మేకప్‌లోనే ఉన్నా.. రాత్రి నిద్రపోయే ముందు మాత్రం మేకప్‌ను తొలగించుకోవడం తప్పనిసరి. లేదంటే లేనిపోని చర్మ సమస్యలు చుట్టుముడతాయి. ఈ క్రమంలో- రసాయన పూరిత మేకప్‌ రిమూవర్స్‌ బదులుగా ఇంట్లోనే లభించే సహజమైన పదార్థాలతో చర్మానికి ఎలాంటి హానీ కలగకుండా మేకప్‌ను తొలగించుకోవచ్చంటున్నారు నిపుణులు. మరి అవేంటో చూద్దామా..!

కొబ్బరినూనెతో..

మేకప్‌ తొందరగా చెరిగిపోకుండా, ఎక్కువసేపు తాజాగా నిలిచి ఉండాలన్న ఉద్దేశంతో కొంతమంది వాటర్‌ప్రూఫ్‌ మేకప్‌ను వేసుకుంటారు. అయితే ఇది వేసుకోవడానికి బాగానే ఉన్నా దీన్ని తొలగించడం మాత్రం అంత సులభం కాదని చెప్పచ్చు. ఈక్రమంలో కొన్నిసార్లు ఎక్కువ మొత్తంలో మేకప్‌ రిమూవర్స్‌ వాడాల్సి వస్తుంది. దీనివల్ల చర్మం పొడిబారి, నిర్జీవంగా తయారుకావచ్చు లేదా ఇతర చర్మ సమస్యలు తలెత్తవచ్చు. ఇలాంటప్పుడు సహజమైన కొబ్బరినూనెను వాడడం మంచిది. ఇది వాటర్‌ప్రూఫ్‌ మేకప్‌ను ఎంతో సులువుగా తొలగించడమే కాకుండా చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌లాగా పనిచేసి మృదువుగా మారుస్తుంది. దీనికోసం.. ఒక టీస్పూన్‌ కొబ్బరినూనెను చేతుల్లోకి తీసుకొని ముఖానికి, మెడకు బాగా పట్టించి 2-3 నిమిషాల తర్వాత కాటన్‌ ప్యాడ్లతో తుడిచేసుకుంటే సరి. లిప్‌స్టిక్‌ను సైతం కొబ్బరినూనెతో ఇలాగే తొలగించుకోవచ్చు.

పాలతో..

పచ్చి పాలను ఎన్నో సౌందర్య చికిత్సలలో వాడుతుంటారు. అయితే, పాలతో మేకప్‌ను సైతం తొలగించచ్చంటున్నారు నిపుణులు. ఒక గిన్నెలో పాలు తీసుకొని, అందులో కాటన్‌ బాల్‌ను ముంచి, ఆ కాటన్‌ బాల్‌తో ముఖాన్ని శుభ్రంగా తుడిచేసుకుంటే సరి. ముఖంపై ఉన్న మేకప్‌ తొలగిపోయి తాజాగా మారుతుంది. ఒకవేళ ఎక్కువగా మేకప్‌ వేసుకున్నట్లయితే పాలలో ఒక టేబుల్‌స్పూన్‌ బాదం నూనెను వేసి కలుపుకొని, ఆపై ఆ మిశ్రమాన్ని ఉపయోగించాలి. పాలు ముఖానికి తేమనందించి, కోమలంగా, ప్రకాశవంతంగా మారుస్తాయి.

తేనెతో..

తేనెలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి మంచి మాయిశ్చరైజర్‌లాగా పని చేస్తాయి. అంతేకాదు.. న్యాచురల్‌ మేకప్‌ రిమూవర్‌గానూ తేనెను ఉపయోగించవచ్చు. దీనికోసం.. ఒక కాటన్‌ బాల్‌ లేదా తడిపిన కాటన్‌ క్లాత్‌పై కాస్త తేనె వేసి, దానితో ముఖంపై మసాజ్‌ చేసినట్లుగా మృదువుగా 5 నిమిషాల పాటు రుద్దుకోవాలి. ఆపై గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. లేదా.. ఒక మెత్తటి కాటన్‌ క్లాత్‌పై కాస్త తేనె, బేకింగ్‌ సోడా వేసి ముఖంపై రుద్దుకోవాలి. అంతే! ముఖంపైనున్న మేకప్‌ పూర్తిగా తొలగిపోతుంది. ఒకవేళ మీది పొడి చర్మమైతే ఈ మిశ్రమంలో కొన్ని పాలు కలుపుకొంటే సరిపోతుంది.

ఆవిరితో తొలగించండి..

‘ఆవిరి’ ప్రక్రియను సౌందర్య సంరక్షణలో భాగంగా ఉపయోగించడం మనకు తెలిసిందే. అయితే ఇదే ఆవిరిని మేకప్‌ తొలగించుకోవడానికి కూడా ఉపయోగించవచ్చని చెబుతున్నారు నిపుణులు. స్టీమింగ్ వేసుకున్న మేకప్‌ను నిమిషాల్లో తొలగించి ముఖాన్ని తాజాగా మారుస్తుంది. దీనికోసం, ఒక వెడల్పాటి గిన్నెలో వేడి నీళ్లను తీసుకొని అయిదు-పది నిమిషాల పాటు ఆవిరి పట్టాలి. ఆపై మేకప్‌ రిమూవర్‌ స్పాంజి లేదా కాటన్‌ క్లాత్‌తో ముఖాన్ని తుడిచేసుకోవాలి. తద్వారా మేకప్‌ మొత్తం చెమటతో పాటు తొలగిపోతుంది. ఆవిరి పట్టడం వల్ల చర్మ రంధ్రాలు తెరచుకొని వాటిలోని దుమ్ము, ధూళి, మురికి సైతం తొలగిపోయి చర్మం తాజాగా మారుతుంది.

కలబందతో కడిగేయండి..

నిత్యం మేకప్‌ వేసుకునే వారికి ఇంట్లోనే సులువుగా, ఖర్చు లేకుండా మేకప్‌ను తొలగించుకునే పద్ధతులలో ఇదొకటి. దీనికోసం, ఒక గిన్నెలో టేబుల్‌స్పూన్‌ కలబంద గుజ్జు, కొద్దిగా తేనె, 4-5 చుక్కల బాదంనూనె వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై పూసుకొని చేతి వేళ్లతో రెండు నిమిషాల పాటు మసాజ్‌ చేసుకోవాలి. ఆపై చల్లని నీళ్లతో కడిగేస్తే సరి. తద్వారా మేకప్‌ తొలగిపోవడంతో పాటు ముఖం కాంతివంతంగా తయారవుతుంది. కలబంద, తేనెలో ఉండే సహజ గుణాలు చర్మాన్ని మృదువుగా చేసి ఆరోగ్యంగా మారుస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని