పాదాల దురదలకు చెక్ పెట్టేయండిలా!

ఇంట్లోనే లభించే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించి అరికాళ్లలోను, పాదాల వేళ్ల దగ్గర దురద రావడం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందచ్చు. మరి, ఆ పదార్థాలేంటి, వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం రండి..

Published : 24 Jul 2023 21:13 IST

బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, ఈ వానాకాలంలో పాదాలు నీళ్లలో ఎక్కువసేపు నానడం వల్ల, డయాబెటిస్ వంటి అనారోగ్య సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు అరికాళ్లలోను, పాదాల వేళ్ల దగ్గర దురద రావడం సహజం. ఇది మరీ విపరీతం అయితే.. చర్మం ఎర్రగా మారడం, దద్దుర్లు రావడం, వాపు, చర్మం పొలుసుల మాదిరి వూడిపోవడం, రక్తం కారడం.. మొదలైన సమస్యలకూ దారి తీయచ్చు. అయితే ఇంట్లోనే లభించే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించి ఈ సమస్య నుంచి ఉపశమనం పొందచ్చు. మరి, ఆ పదార్థాలేంటి, వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం రండి..

ఉప్పు నీరు..

ఒక టబ్‌లో పాదాలు ముంచి ఉంచడానికి సరిపడా నీళ్లు తీసుకొని అందులో రెండు చెంచాల ఉప్పు వేసి బాగా కలపాలి. ఇందులో పాదాలు పూర్తిగా మునిగేలా ఉంచి, పది నిమిషాలు నాననివ్వాలి. దురద మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి రెండు గంటలకి ఒకసారి ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

పెట్రోలియం జెల్లీ..

పొడిచర్మం కారణంగా అరికాళ్లలో దురద వచ్చినప్పుడు దానికి పెట్రోలియం జెల్లీ చక్కని పరిష్కారంగా పని చేస్తుంది. ఇది పొడిబారిన చర్మాన్ని తిరిగి మృదువుగా మార్చడమే కాకుండా, అధిక సమయం పాటు తేమ నిలిచి ఉండేలా కాపాడుతుంది. తద్వారా దురద కూడా తగ్గుముఖం పడుతుంది. ఈ ఫలితం పొందడానికి మనం చేయాల్సిందల్లా సమస్య ఉన్న ప్రాంతంలో కాస్త పెట్రోలియం జెల్లీ రాయడమే! అయితే మరింత మెరుగైన ఫలితం పొందాలనుకుంటే పెట్రోలియం జెల్లీ రాసుకున్న తర్వాత పాదాలకు సాక్సులు వేసుకుంటే సరిపోతుంది.

పెప్పర్‌మింట్ ఆయిల్..

పొడిచర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో పెప్పర్‌మింట్ ఆయిల్ కూడా బాగా పని చేస్తుంది. అందుకే కొద్దిగా నీళ్లు తీసుకొని అందులో కాస్త పెప్పర్‌మింట్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్త్లె చేసి కాసేపు అలానే ఉంచాలి. లేదంటే టబ్‌లో కొన్ని గోరువెచ్చని నీళ్లు తీసుకొని అందులో కొన్ని చుక్కల పెప్పర్‌మింట్ ఆయిల్ వేసి పాదాలు రెండూ మునిగి ఉండేలా కాసేపు ఉంచినా మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా మారుస్తూనే పొడిచర్మ సమస్యలకు చెక్ పెడుతుంది.

ఓట్స్‌తో..

ఒక టబ్‌లో కొన్ని గోరువెచ్చని నీళ్లు తీసుకొని అందులో రెండు కప్పుల ఓట్స్ వేసి కాసేపు నాననివ్వాలి. తర్వాత ఈ మిశ్రమంలో పాదాలు మునిగేలా కాసేపు ఉంచి, అనంతరం బయటకు తీసి శుభ్రం చేసుకోవాలి. తర్వాత పాదాలకు నాణ్యమైన మాయిశ్చరైజర్ రాసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం ద్వారా పాదాల కింద వచ్చే దురద తగ్గుముఖం పట్టడమే కాకుండా చర్మం మృదుత్వాన్ని కూడా సంతరించుకుంటుంది.

ఇవే కాదు.. బేకింగ్ సోడా, వైట్ వెనిగర్, హైడ్రోజెన్ పెరాక్సైడ్, పుదీనా.. మొదలైన పదార్థాలను ఉపయోగించి కూడా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందచ్చు.

ఈ జాగ్రత్తలు..

కాళ్లను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం..

పాదాల వద్ద ఎక్కువగా తేమ చేరకుండా జాగ్రత్తపడడం.

అధిక సమయం షూ లేదా సాక్సులు వేసుకోకుండా ఉండడం.

రోజూ పాదాలకు మాయిశ్చరైజర్ తప్పనిసరిగా రాసుకోవడం.. మొదలైన జాగ్రత్తలు పాటించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని