నయన్ బ్రేక్‌ఫాస్ట్ డ్రింక్ ఇదేనట!
సినీ తారలు తమ శరీర సౌష్ఠవాన్ని కాపాడుకోవడానికి పోషకాహార నిపుణుల సలహాలు, సూచనల మేరకు ఆరోగ్యకరమైన ఆహార నియమాలు పాటించడం పరిపాటే! ఇలా వారు నిర్దేశించుకున్న మెనూలో నుంచి తమకు నచ్చిన వంటకాల్ని అప్పుడప్పుడూ పంచుకుంటుంటారు కొందరు తారలు.
సినీ తారలు తమ శరీర సౌష్ఠవాన్ని కాపాడుకోవడానికి పోషకాహార నిపుణుల సలహాలు, సూచనల మేరకు ఆరోగ్యకరమైన ఆహార నియమాలు పాటించడం పరిపాటే! ఇలా వారు నిర్దేశించుకున్న మెనూలో నుంచి తమకు నచ్చిన వంటకాల్ని అప్పుడప్పుడూ పంచుకుంటుంటారు కొందరు తారలు. వాళ్ల వ్యక్తిగత న్యూట్రిషనిస్టులు కూడా ఈ రహస్యాలను వెల్లడిస్తుంటారు. ప్రముఖ న్యూట్రిషనిస్ట్ మున్‌మున్ గనేరివాల్ కూడా ఇటీవల ఇదే పని చేసింది. తమిళందం నయనతారకు వ్యక్తిగత న్యూట్రిషనిస్ట్‌గా కొనసాగుతోన్న ఆమె.. ఈ ముద్దుగుమ్మ రోజూ అల్పాహారంలో తీసుకునే డ్రింక్ ఏంటో చెప్పుకొచ్చింది. అంతేకాదు.. ఈ పానీయం తనకు పరిచయం చేసిన తొలిసారే దీని రుచికి నయన్ ఫిదా అయిపోయిందంటోంది. మరి, ఇంతకీ ఏంటా డ్రింక్? రండి.. తెలుసుకుందాం..!
ప్రముఖ న్యూట్రిషనిస్ట్ మున్‌మున్ గనేరివాల్ కొందరు సినీతారలకు వ్యక్తిగత డైటీషియన్‌గా పని చేస్తోంది. వారిలో నయనతార ఒకరు. అయితే ఈ క్రమంలోనే నయన్ ఫిట్‌నెస్ సీక్రెట్స్ నుంచి ఒక రహస్యాన్ని ఇటీవలే బయటపెట్టింది మున్‌మున్.
తనకు దీని రుచి నచ్చింది!
తాను రాసిన ‘Yuktahaar: The Belly And Brain Diet’ అనే పుస్తకంలో భాగంగా నయన్‌కు పచ్చి కొబ్బరి స్మూతీ అంటే ఇష్టమని చెప్పుకొచ్చిందీ న్యూట్రిషనిస్ట్. ‘పచ్చి కొబ్బరి స్మూతీ అంటే నయనతారకు చాలా ఇష్టం. దీన్ని తొలిసారి తన మెనూలో చేర్చినప్పుడే దీని రుచికి ఫిదా అయిపోయింది. అప్పట్నుంచి ఈ స్మూతీని ఉదయం అల్పాహారం సమయంలో లేదంటే సాయంత్రం స్నాక్స్ సమయంలో తీసుకోవడం అలవాటు చేసుకుంది..’ అని చెబుతోంది మున్‌మున్. ఇక ఇదే రెసిపీని ఇన్‌స్టాలో పంచుకుంటూ దీన్ని నిమిషాల్లో సిద్ధం చేసుకోవచ్చంటోందామె.
కొబ్బరి స్మూతీ
కావాల్సినవి
* కొబ్బరి నీళ్లు - రెండు కప్పులు
* పచ్చి కొబ్బరి ముక్కలు - కప్పు
* కొబ్బరి పాలు - అరకప్పు
* చక్కెర – టీస్పూన్ (వద్దనుకుంటే వదిలేయచ్చు)
* దాల్చిన చెక్క పొడి - చిటికెడు
* యాలకుల పొడి - చిటికెడు
తయారీ
మిక్సీ జార్‌లో కొబ్బరి నీళ్లు, కొబ్బరి పాలు, పచ్చి కొబ్బరి ముక్కలు, చక్కెర.. ఇవన్నీ వేసి స్మూతీలా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక గాజు గ్లాస్‌లోకి తీసుకొని.. ఆఖరుగా దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి చల్లుకొని సర్వ్ చేసుకుంటే సరి! చల్లగా కావాలనుకునే వారు ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు.
గుండెకు మంచిది!
* కొబ్బరి స్మూతీ జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. తద్వారా అరుగుదల బాగుంటుంది.. ఇతర జీర్ణ సంబంధిత సమస్యలూ తలెత్తవు.
* గుండె ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో ఇది సహకరిస్తుంది.
* కొబ్బరిలో ఉండే మీడియం చెయిన్ ట్రైగ్లిజరైడ్లు (ప్రత్యేకమైన కొవ్వులు) శరీరానికి శక్తిని అందిస్తాయి.
* ఫైబర్ ఎక్కువగా ఉండే కొబ్బరి స్మూతీ.. శరీరంలో చక్కెర స్థాయుల్ని అదుపులో ఉంచడానికి సహకరిస్తుంది. తద్వారా ఆకలిని అదుపులో ఉంచుకోవచ్చు.. ఫలితంగా బరువు పెరగకుండా జాగ్రత్తపడచ్చు.
* కొబ్బరిలో ఎక్కువ మొత్తంలో ఉండే మాంగనీస్ శరీరంలోని ఎంజైమ్‌లను ప్రేరేపించి జీవక్రియల పనితీరును మెరుగుపరుస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.