#WikkiNayan : ఏడేళ్ల ప్రేమ సాక్షిగా.. ఏడడుగులు వేశారు!
‘ఎన్నెన్నో జన్మల బంధం నీది-నాది..’ అన్నట్లుగా తమ ఏడేళ్ల ప్రేమకు పెళ్లితో పీటముడి వేశారు ‘ది మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీ కపుల్’ నయనతార-విఘ్నేష్ శివన్. తమ ప్రేమాయణం దగ్గర్నుంచి వివాహం దాకా.. ఎంతో గోప్యంగా వ్యవహరించిన ఈ జంట.. ఎట్టకేలకు ఒక్కటైంది.. అభిమానుల్ని ఆనందంలో......
(Photos: Instagram)
‘ఎన్నెన్నో జన్మల బంధం నీది-నాది..’ అన్నట్లుగా తమ ఏడేళ్ల ప్రేమకు పెళ్లితో పీటముడి వేశారు ‘ది మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీ కపుల్’ నయనతార-విఘ్నేష్ శివన్. తమ ప్రేమాయణం దగ్గర్నుంచి వివాహం దాకా.. ఎంతో గోప్యంగా వ్యవహరించిన ఈ జంట.. ఎట్టకేలకు ఒక్కటైంది.. అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తింది. తన లైఫ్‌లైన్ నయన్‌ను తనదాన్ని చేసుకున్నానంటూ పట్టరానంత ఆనందంతో తమ పెళ్లి ఫొటోను పోస్ట్ చేశాడీ తమిళ దర్శకుడు. ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’లా మెరిసిపోతోన్న ఈ జంటను చూడ్డానికి రెండు కళ్లూ చాలట్లేదంటున్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో ఈ క్యూట్ కపుల్ ప్రేమకథ, పెళ్లి ముచ్చట్లేంటో తెలుసుకుందాం రండి..
ఒక్కటయ్యాం!
దాదాపు ఏడేళ్ల నుంచి తమ ప్రేమాయణాన్ని కొనసాగిస్తోన్న నయన్-విఘ్నేష్‌లు ఈ విషయాన్ని ఎంతో గోప్యంగా ఉంచారు. ఈ మధ్యే తమకు నిశ్చితార్థం జరిగిందని అధికారికంగా బయటపెట్టిన ఈ జంట.. తాజాగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. మహాబలిపురంలోని ఓ ప్రముఖ హోటల్ వీరి వివాహానికి వేదికైంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఏడడుగులు వేసిందీ జంట. పెళ్లిలో భాగంగా నయన్ ఎరుపు రంగు దుస్తుల్లో మెరిసిపోగా, విఘ్నేష్ క్రీమ్ కలర్ పట్టువస్త్రాలు ధరించాడు. మాంగళ్యధారణ అనంతరం నయన్‌ను ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేసిన విఘ్నేష్.. ‘దేవుడి ఆశీస్సులు, కుటుంబ సభ్యులు-స్నేహితులు-మీ అందరి ఆశీర్వాదాలతో నయన్, నేను ఒక్కటయ్యాం..!’ అంటూ మురిసిపోయాడు. ఇక ఇదే ఫొటోను నయన్ కూడా పంచుకుంది.
చూపులు కలిసిన శుభవేళ!
2015లో విఘ్నేష్ దర్వకత్వం వహించిన ‘నానుమ్ రౌడీ దాన్’ అనే సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా సెట్స్ నుంచే వీళ్ల ప్రేమ మొదలైందని చెప్పచ్చు. సినిమా చిత్రీకరణ సమయంలో ఒకరినొకరు ఇష్టపడిన ఈ ముద్దుల జంట.. అప్పట్నుంచి గాఢమైన ప్రేమలో మునిగిపోయారు. ఇద్దరి పుట్టినరోజులు, న్యూ ఇయర్, వేలంటైన్స్ డే.. వంటి ప్రత్యేక సందర్భాలను విదేశాల్లో సెలబ్రేట్ చేసుకుంటూ.. అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో తమ ఫ్యాన్స్‌తో పంచుకునేవారు. అయితే అది కూడా చాలా అరుదుగానే! ఇవి చూసి అభిమానులంతా వీళ్లది ప్రేమేనని అర్థం చేసుకున్నారు.. అయితే తామిద్దరికీ నిశ్చితార్థం అయిందని ఇటీవలే ఓ టీవీ షోలో భాగంగా బయటపెట్టింది నయన్. ‘ఇదిగో ఇదే నా నిశ్చితార్థపు ఉంగరం. మా వ్యక్తిగత విషయాల గురించి బయటికి చెప్పడం నాకు, విఘ్నేష్‌కు పెద్దగా నచ్చదు. వేడుకల్నీ నిరాడంబరంగా జరుపుకోవడానికే ఇష్టపడతాం. అందుకే ఎంగేజ్‌మెంట్ కూడా మా దగ్గరి కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్‌గా చేసుకున్నాం..’ అందీ అందాల తార.
తనెక్కడుంటే అక్కడే స్వర్గం!
నయన్ మాత్రమే కాదు.. ఓ సోషల్ మీడియా చాట్‌లో భాగంగా విఘ్నేష్ కూడా తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టాడు. సందర్భం వచ్చినప్పుడల్లా తన లేడీ లవ్‌తో కలిసి దిగిన ఫొటోల్ని పంచుకుంటూ సంబరపడిపోయే ఈ డైరెక్టర్.. ఈసారి మాత్రం నయన్‌లో తనకు నచ్చిన బోలెడన్ని అంశాల్ని షేర్ చేసుకున్నాడు.
‘నయన్ గురించి అడిగిన ప్రతిసారీ ఎంతో గర్వంగా ఫీలవుతుంటా. తనతో గడిపిన ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తుంటా. ఆమెతో కలిసి ఏ ప్రదేశానికి వెళ్లడాన్ని ఇష్టపడతారని చాలామంది నన్ను అడుగుతుంటారు. అందుకు నా సమాధానం ఒక్కటే.. తనెక్కడుంటే అదే నా ఫేవరెట్ ప్లేస్! ఇక నయన్‌కు చీరలు బాగా నప్పుతాయి. అందుకే తను చీర కట్టుకుంటేనే ఎంతో క్యూట్‌గా ఉంటుంది. తను వంట బాగా చేస్తుంది. ముఖ్యంగా నాకోసం చేసే నెయ్యి అన్నం, చికెన్ కర్రీ అంటే లొట్టలేసుకొని మరీ తింటా..! తనలో నచ్చే క్వాలిటీ గురించి చెప్పాలంటే.. అది ఆమె ఆత్మవిశ్వాసమే!’ అంటూ తన ఇష్టసఖి గురించి మనసులోని మాటల్ని బయటపెట్టాడీ రొమాంటిక్ డైరెక్టర్.
అలా ఫిదా అయిపోయా!
నయన్‌లో ఉన్న ఆత్మవిశ్వాసమే తనని కట్టిపడేసిందని విఘ్నేష్ అంటే.. తన మంచి మనసు, సపోర్టింగ్ నేచర్ నా మనసును తనకు అంకితం చేసేలా చేశాయంటోందీ లేడీ స్టార్.
‘నా జీవితంలో నేను కలిసిన మంచి మనుషుల్లో విఘ్నేష్ ఒకరు. తను నా జీవితంలోకొచ్చినప్పట్నుంచి నాకు బాగా కలిసొచ్చింది. నా కెరీర్ గురించి మరింత శ్రద్ధ పెట్టడంలో ఆయన చూపిన చొరవ మరవలేను. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆయనతో పరిచయమయ్యాకే నేను నా కెరీర్‌లో బిజీగా మారిపోయా. నేను చేసే ప్రతి పనిలోనూ ఉత్తమంగా రాణించాలని కోరుకునే మంచి వ్యక్తి తను. విఘ్నేష్ నన్నెంత సపోర్ట్ చేస్తారో.. తన ఇంటికీ అంతే ప్రాధాన్యమిస్తారు. ఆయనలో నాకు నచ్చిన అంశం ఇదే! ఆయనతో పరిచయమైన ఈ ఏడేళ్లుగా చూస్తున్నా.. భోంచేసే ముందు రోజూ ఇంటికి ఫోన్ చేసి వాళ్లు తిన్నాకే తినడం ఆయనకు అలవాటు! తనలో ఉన్న ఈ కేరింగ్ నేచరే నన్ను ఫిదా చేసేసింది..’ అంటూ తన బాయ్‌ఫ్రెండ్‌పై తన మనసు లోతుల్లో దాగున్న ప్రేమను ఓ సందర్భంలో బయటపెట్టిందీ లేడీ డాన్.
హ్యాపీ మ్యారీడ్ లైఫ్ విక్కీనయన్!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.