Published : 21/12/2022 12:35 IST

టీనేజ్‌లో మొటిమల సమస్య.. పరిష్కారమిలా..!

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అందం విషయంలో పలు సమస్యలు తలెత్తడం సహజం. ముఖంపై వచ్చే మొటిమలు కూడా ఇలాంటివే! ముఖ్యంగా యుక్త వయసులో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. దీన్నుంచి బయటపడడానికి పార్లర్లను ఆశ్రయించడం, వివిధ రకాల క్రీములు వాడడం.. వంటివి చేస్తుంటారు చాలామంది. అయితే ఈ వయసులో మొటిమలు సహజమని, అనవసర భయాందోళనలతో బయట ఉత్పత్తుల్ని వాడితే సమస్య మితిమీరే ప్రమాదమూ లేకపోలేదంటున్నారు సౌందర్య నిపుణులు. కాబట్టి సహజ చిట్కాలతోనే వీటి నుంచి విముక్తి పొందచ్చంటున్నారు. మరి, ఇంతకీ టీనేజ్‌ దశలో మొటిమలు ఎందుకొస్తాయి? వాటికి విరుగుడేంటి? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

యుక్త వయసులోకి అడుగుపెట్టిన అమ్మాయిల్లో శారీరక మార్పులే కాదు.. అందం విషయంలోనూ పలు మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా ఈ వయసులో ముఖంపై వచ్చే మొటిమలు వారిని మరింత ఇబ్బంది పెడుతుంటాయి. ఇక ఈ సమస్యను దూరం చేసుకోవాలన్న ఆతృతతో వారు చేయని ప్రయత్నమంటూ ఉండదు. అయితే నిజానికి 8-18 ఏళ్ల వయసులో మొటిమలు రావడం సహజమని నిపుణులు చెబుతున్నారు. పైగా వీటి ద్వారా మచ్చలు, వాటి తాలూకు ఆనవాళ్లేమీ ఏర్పడవని, అందుకే అనవసర భయాందోళనలు మాని.. చర్మ సౌందర్యం విషయంలో ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలని చెబుతున్నారు.

జిడ్డుదనమే కారణమా?

వయసుతో పాటే పలు శారీరక మార్పులూ చోటుచేసుకోవడం సహజం. శరీరంలో హార్మోన్ల స్థాయుల్లో మార్పులు రావడం వల్లే ఇలా జరుగుతుంటుంది. అయితే టీనేజ్‌ దశలో తలెత్తే మొటిమల సమస్యకూ శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులే కారణమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ దశలో ఆండ్రోజన్‌ అనే లైంగిక హార్మోన్‌ అధికంగా ఉత్పత్తవుతుంది. ఇది చర్మం కింద ఉండే సీబం (సెబేషియస్‌ గ్రంథి విడుదల చేసే నూనె/మైనం లాంటి పదార్థం)ను ప్రేరేపించి.. నూనె ఎక్కువగా విడుదలయ్యేలా చేస్తుంది. తద్వారా చర్మంపై జిడ్డుదనం పెరుగుతుంది. దీనికి మృతకణాలు, వాతావరణంలోని బ్యాక్టీరియా తోడవడంతో మొటిమలొస్తాయి. అలాగని వీటిని గిల్లకుండా.. కొన్ని చిట్కాలు పాటిస్తే.. ముఖంపై ఎలాంటి మచ్చలు, మొటిమల తాలూకు ఆనవాళ్లు లేకుండా తిరిగి సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.


ఈ చిట్కాలతో మేలు!

టీనేజ్‌ వయసులో సీబం ఉత్పత్తి ఎక్కువగా ఉండడం వల్ల ముఖంపై జిడ్డుదనం పెరిగిపోతుంది. అయితే ఇప్పటికే జిడ్డు చర్మతత్వం ఉన్న వారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఈ క్రమంలో రోజుకు రెండు మూడుసార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇందుకోసం కలబంద గుజ్జు లేదంటే కలబందతో తయారుచేసిన ఫేస్‌వాష్‌లను ఉపయోగించచ్చు. దీన్ని మునివేళ్లతో ముఖంపై కాసేపు మర్దన చేసుకొని, ఆపై గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల మొటిమల సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది.

ఎండ వల్ల కూడా కొన్నిసార్లు మొటిమలు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి బయటికి వెళ్లే ముందు సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవడం మంచిదంటున్నారు.

గ్రీన్‌ టీలో ఉండే ఒక రకమైన రసాయనిక సమ్మేళనంలో చర్మానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబియల్‌ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ముఖంపై ఏర్పడిన మొటిమల్ని తొలగిస్తాయి. ఇందుకోసం గ్రీన్‌ టీలో కొద్దిగా తేనె కలిపి.. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. అరగంట తర్వాత కడిగేసుకోవాలి. లేదంటే గ్రీన్‌ టీ పొడిని ఫేస్‌మాస్క్‌ల్లోనూ ఉపయోగించచ్చు.

మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను దూరం చేసే గుణాలు యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌లో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ మిశ్రమాన్ని ఒక కాటన్బాల్‌తో ముఖానికి అప్లై చేసుకోవాలి. పావుగంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే సమస్య తగ్గుముఖం పడుతుంది.

టీనేజ్‌ వయసులో మొటిమల్ని తగ్గించుకోవడానికి.. వారానికోసారి ముఖాన్ని స్క్రబ్‌ చేసుకోవడం కూడా ముఖ్యమే అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో బ్రౌన్‌ షుగర్‌, కాఫీ పొడి, ఓట్‌మీల్‌, సముద్రపు ఉప్పు.. వంటి సహజసిద్ధమైన పదార్థాలతో తయారుచేసుకున్న స్క్రబ్స్‌ మేలు చేస్తాయి.

యుక్త వయసులో ఉన్న వారు ఎక్కువగా మొబైల్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌తో గడపడం మనం చూస్తుంటాం. అయితే దీనివల్ల ఒత్తిడి పెరిగి మొటిమల సమస్య అధికమవుతుందంటున్నారు నిపుణులు. అందుకే రోజుకు అరగంట చొప్పున స్క్రీన్‌ టైమ్‌ను తగ్గించుకోవడం వల్ల ఫలితం ఉంటుందంటున్నారు.

టీనేజ్‌ దశలో మొటిమల సమస్యను తగ్గించుకోవాలంటే తీసుకునే ఆహారంలోనూ పలు మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఈ క్రమంలో విటమిన్‌ ‘ఎ’ ఎక్కువగా ఉండే పండ్లు, కాయగూరలకు ప్రాధాన్యమివ్వాలి. ఆకుకూరలు, క్యారట్‌, గుడ్లు, బొప్పాయి, చేపలు.. వంటివి తీసుకోవాలి. అలాగే చిప్స్‌, బిస్కట్స్‌, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి.

వ్యాయామం కూడా ఒత్తిడిని దూరం చేసి ప్రశాంతంగా ఉండేందుకు ప్రేరేపిస్తుంది. తద్వారా మొటిమల సమస్య నుంచి విముక్తి పొందచ్చు. ఈ క్రమంలో రోజూ గంట పాటు మెట్లెక్కడం, నడక, జాగింగ్‌, యోగా, ధ్యానం.. వంటి వాటికి ప్రాధాన్యమివ్వాలి.

కొంతమంది జుట్టు, కుదుళ్లు పదే పదే జిడ్డుగా మారుతుంటాయి. ఇది కూడా ముఖంపై మొటిమలకు కారణమవుతుంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్లు వారానికి రెండుసార్లు గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయడం వల్ల మేలు జరుగుతుంది.

మేకప్‌ ఉత్పత్తుల వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలకు దారితీస్తుంటాయి. కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

కేవలం ముఖంపైనే కాదు.. ఛాతీ, వీపు పైన కూడా కొంతమందికి మొటిమలొస్తుంటాయి. ఇలాంటి వారు బిగుతుగా ఉండే దుస్తులు వేసుకోవడం వల్ల వాటిపై రాపిడి జరిగి.. సమస్య విస్తరిస్తుంది. కాబట్టి వదులుగా, చర్మానికి గాలి తగిలేలా దుస్తులు ధరించడం మంచిది.


మొటిమలు రాకూడదంటే..!

టీనేజ్‌ వయసులో మొటిమల సమస్య సహజమే అయినా.. ముందు నుంచీ కొన్ని చిట్కాలు పాటిస్తే.. సాధ్యమైనంత వరకు ఇవి రాకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు నిపుణులు.

చెమట పట్టినప్పుడు ముఖం కడుక్కోవడం లేదంటే స్నానం చేయడం.

రసాయనాలతో కూడిన సౌందర్య ఉత్పత్తులు, సాధనాలకు దూరంగా ఉండడం.

బెడ్‌షీట్స్‌, దిండు కవర్లను తరచూ మార్చడం, ఉతకడం మంచిది.

చేతులతో ముఖాన్ని పదే పదే తాకడం మానుకోవాలి. ఎందుకంటే దీనివల్ల కూడా బ్యాక్టీరియా ముఖం పైకి చేరే అవకాశం ఎక్కువ.

ఒత్తిడిని దూరం చేసుకోవడానికి రాత్రుళ్లు సుమారు ఏడెనిమిది గంటల సుఖనిద్ర అవసరం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని