నేనూ అలాగే అమెరికా వచ్చా..!
నచ్చిన కెరీర్‌ని ఎంచుకోవడమే కాదు.. అందులో ఎదిగినప్పుడే దానికి పూర్తి సార్థకత! ఇదే విషయం నిరూపిస్తున్నారు ఇండో-అమెరికన్ నీలి బెండపూడి. టీచర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె.. తన మూడు దశాబ్దాల కెరీర్‌లో వైస్‌ఛాన్స్‌లర్‌గా, డైరెక్టర్‌గా....
(Photos: Facebook)
నచ్చిన కెరీర్‌ని ఎంచుకోవడమే కాదు.. అందులో ఎదిగినప్పుడే దానికి పూర్తి సార్థకత! ఇదే విషయం నిరూపిస్తున్నారు ఇండో-అమెరికన్ నీలి బెండపూడి. టీచర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె.. తన మూడు దశాబ్దాల కెరీర్‌లో వైస్‌ఛాన్స్‌లర్‌గా, డైరెక్టర్‌గా, డీన్‌గా ఎన్నెన్నో అత్యున్నత పదవుల్ని అలంకరించారు. ప్రఖ్యాత పెన్సిల్వేనియా యూనివర్సిటీకి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. అమెరికాలో ఉన్నత విద్య అభివృద్ధికి చేస్తున్న కృషికి గుర్తింపుగా ‘అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్’ ఆమెను ప్రతిష్ఠాత్మక ‘ఇమ్మిగ్రెంట్ అఛీవ్‌మెంట్ అవార్డు’కు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా నీలి గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు..
మూడు దశాబ్దాల ప్రస్థానంలో..!
⚛ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో పుట్టారు నీలి బెండపూడి. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసిన ఆమె.. పైచదువుల కోసం 1986లో అమెరికా వెళ్లారు. క్యాన్సస్ యూనివర్సిటీ నుంచి మార్కెటింగ్‌లో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు.
⚛ ఎంతో మక్కువతో టీచింగ్‌నే వృత్తిగా ఎంచుకున్న ఆమె.. తన 30 ఏళ్ల కెరీర్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు. క్యాన్సస్, ఒహాయో స్టేట్ యూనివర్సిటీ, Texas A&M.. వంటి విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. ‘క్యాన్సస్ యూనివర్సిటీ’కి వైస్ ఛాన్స్‌లర్‌గా, ‘యూనివర్సిటీ ఆఫ్ క్యాన్సస్ స్కూల్ ఆఫ్ బిజినెస్’కి డీన్‌గా, ‘ఒహాయో స్టేట్ యూనివర్సిటీ’లో ‘Initiative for Managing Services’కి ఫౌండింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.
⚛ మార్కెటింగ్, కన్జ్యూమర్ బిహేవియర్.. వంటి అంశాల్లో మంచి పట్టున్న నీలి.. ఎంతోమంది విద్యార్థులకు మార్కెటింగ్ సబ్జెక్ట్ బోధించారు.
⚛ తన వృత్తి నైపుణ్యాలకు గుర్తింపుగా ‘అవుట్‌స్టాండింగ్ మార్కెటింగ్ టీచర్ అవార్డు’ అందుకున్నారు నీలి. దీంతో పాటు జాతీయ స్థాయిలో పలు అవార్డులు-రివార్డులు ఆమె సొంతమయ్యాయి.
⚛ వివిధ ప్రపంచ ప్రఖ్యాత సంస్థలకు కన్సల్టెంట్‌గానూ వ్యవహరించారు నీలి.
⚛ Louisville యూనివర్సిటీకి 18వ అధ్యక్షురాలిగా నాలుగేళ్లపాటు పని చేశారు నీలి. ఈ సందర్భంగా యూనివర్సిటీలో పలు గుణాత్మక మార్పులు తీసుకొచ్చారు.
⚛ అమెరికాలోని ప్రతిష్ఠాత్మకమైన పెన్సిల్వేనియా యూనివర్సిటీకి గతేడాది అధ్యక్షురాలిగా ఎంపికయ్యారామె. తద్వారా ఆ పదవికి ఎంపికైన తొలి మహిళగా, తొలి నల్ల జాతీయురాలిగా, తొలి తెలుగు వనితగా చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం ఆమె ఈ పదవిలోనే కొనసాగుతున్నారు.
⚛ భారత్, అమెరికాలోని ఉన్నత విద్యా సంస్థల మధ్య పరిశోధన, విద్యా భాగస్వామ్యాల విస్తరణకు కృషి చేసే అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ యూనివర్శిటీస్ (AAU) టాస్క్‌ఫోర్స్‌లో ఐదుగురు కో-ఛైర్‌లలో ఒకరిగా ఆమె ఇటీవలే నియమితులయ్యారు.
⚛ డాక్టర్ వెంకట్ బెండపూడిని వివాహం చేసుకున్నారు నీలి. ఆయన పలు ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీగా సేవలందించారు. ఈ జంటకు శిరీష అనే కూతురుంది.
⚛ అమెరికాలో స్థిరపడినా తెలుగు మూలాల్ని మాత్రం మర్చిపోలేదీ గ్రేట్ టీచర్. కుటుంబ సమేతంగా తాను జరుపుకొనే ప్రతి పండగ వేడుకల్ని, తన తల్లిదండ్రులతో కలిసి గడిపిన క్షణాల్ని ఫొటోల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారామె.
నేను కూడా అలాగే వచ్చా..!
అవార్డుకు ఎంపికైన సందర్భంగా మాట్లాడుతూ- ‘ఈ సంవత్సరం ఇమ్మిగ్రెంట్ అఛీవ్‌మెంట్ అవార్డుకు నా పేరును ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. అమెరికాలో వలసవాదుల ప్రభావం, ప్రాముఖ్యాన్ని తెలియజేసి గతంలో ఈ పురస్కారం పొందిన వారి సరసన నిలవడం గర్వంగా ఉంది. అమెరికా వలసవాదుల దేశం. ఇక్కడ ఉండే మంచి కెరీర్ అవకాశాలను ఉపయోగించుకోవడానికి అందరిలాగే నేను కూడా వచ్చాను. నాలాగే ఉన్నత విద్య అభ్యసించి బంగారు భవితకు బాటలు వేసుకోవడానికి ఇక్కడికి చాలామంది విద్యార్థులు వస్తుంటారు. అలాంటి విద్యార్థులందరికీ ఉన్నత విద్య లక్ష్యాలను అందించడానికి కట్టుబడి ఉన్నాను. అమెరికా కలలకు వలసవాదం మూలస్తంభం. వాటిని సాకారం చేయడానికి ‘అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్’ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వలసవాదులకు అందిస్తోన్న సహాయానికి కృతజ్ఞతలు’- అని తెలియజేశారు నీలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.