మంచంపై కూర్చొని పనిచేస్తున్నారా?

సరైన సదుపాయాల్లేకో లేదంటే సౌకర్యంగా ఉంటుందనో మంచంపై కూర్చొని/పడుకొని పనిచేయడం మనలో చాలామందికి అలవాటు. అయితే ఇది ఎప్పుడో ఒకసారైతే పర్లేదు.. కానీ రోజూ ఇలాగే పనిచేస్తుంటే మాత్రం ఆరోగ్యపరంగా, మానసికంగా పలు సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు

Published : 17 Oct 2021 13:33 IST

సరైన సదుపాయాల్లేకో లేదంటే సౌకర్యంగా ఉంటుందనో మంచంపై కూర్చొని/పడుకొని పనిచేయడం మనలో చాలామందికి అలవాటు. అయితే ఇది ఎప్పుడో ఒకసారైతే పర్లేదు.. కానీ రోజూ ఇలాగే పనిచేస్తుంటే మాత్రం ఆరోగ్యపరంగా, మానసికంగా పలు సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఇలాంటి పనితీరు ఉత్పాదకతనూ దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

నిద్రాభంగం తప్పదు!

హాయిగా బెడ్‌పై కాళ్లు చాపుకొని, గోడకు ఒరిగి కూర్చొని, కప్పు కాఫీ/టీ తాగుతూ లేదంటే ఏవైనా స్నాక్స్‌ తింటూ పనిచేయడం ఎంతో సౌకర్యంగా అనిపిస్తుంటుంది. కానీ దీనివల్ల నిద్రలేమి సమస్యల్ని ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అదెలాగంటే.. సాధారణంగా మనం బెడ్‌ని నిద్రపోవడానికి, కాసేపు అలా రిలాక్సవడానికి ఉపయోగిస్తుంటాం. అదే.. దీనిపై కూర్చొని/పడుకొని పనిచేసుకోవడం, టీవీ చూడడం, పుస్తకాలు చదవడం.. వంటి పనులు చేస్తున్నప్పుడు మేల్కొనే (Wakefulness) ఉంటాం. ఇదే అలవాటుగా మారితే మాత్రం కొన్ని రోజులయ్యాక మంచంపై పడుకున్నా నిద్రపట్టక నిద్రలేమి సమస్యలు వేధించే అవకాశాలున్నాయని సైకోథెరపిస్టులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇలాంటి పనుల కోసం మంచాన్ని వినియోగించడం మానుకోమంటున్నారు.

ఉత్పాదకత తగ్గుతుంది!

కొన్నిసార్లు సౌకర్యం కూడా మనలోని యాక్టివిటీని దెబ్బతీస్తుంది. మనల్ని సోమరులుగా మార్చేస్తుంది. మంచంపై కూర్చొని పనిచేస్తున్నప్పుడు కూడా ఇలాంటి ఫీలింగ్‌ పెరుగుతుందంటున్నారు నిపుణులు. గంటల తరబడి కూర్చోలేక అప్పుడప్పుడూ బోర్లా పడుకొని పనిచేయడం, పరుపు సౌకర్యంగా ఉండడం వల్ల రాన్రానూ శరీరం సోమరిగా మారిపోతుంది. దీనికి తోడు నిద్రలేమి ప్రభావం శరీరం, మనసుపైనా పడుతుంది. తద్వారా శక్తిస్థాయులు/చురుకుదనం తగ్గి, ఏకాగ్రత లోపించి పనిపై పూర్తి దృష్టి పెట్టలేం. ఫలితంగా సమయానికి పని పూర్తి కాకపోవడం, ఆశించిన అవుట్‌పుట్‌ను సంస్థకు అందించకపోవడం.. ఇలా కెరీర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. దాని వల్ల నష్టం మనకే!

అనుబంధాలూ అడుగంటుతాయి!

ఆరోగ్యపరంగానైనా, అనుబంధాల పరంగానైనా చూసుకుంటే.. పడకగదిలోకి ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లను అనుమతించకపోవడమే మంచిదన్నది నిపుణుల మాట! అయితే రోజంతా మంచంపైనే కూర్చొని పనిచేయడం వల్ల అదే మీ పని ప్రదేశంగా మారిపోతుంది. ఫలితంగా మీ ల్యాప్‌టాప్‌, మొబైల్‌, ఆఫీస్‌కి సంబంధించిన ఫైల్స్‌, ఇతర పత్రాలన్నీ ఆ గదిలోనే అమర్చుకుంటారు. ఇక పని సమయం ముగిసినా ఏదో ఒక పని ఉందని ల్యాపీ ఉపయోగించడం, మొబైల్‌ చూస్తూ కూర్చోవడం వల్ల అలసట పెరిగిపోయి.. ఆలుమగల మధ్య రొమాన్స్‌/సాంగత్యం క్రమంగా తగ్గుతాయి. తద్వారా దంపతుల మధ్య దూరం క్రమంగా పెరిగిపోతుంది. తెలిసో, తెలియకో చేసే ఇలాంటి పొరపాటే చాలామంది జంటల్ని విడాకుల దాకా లాగుతోందని కొందరు నిపుణులు అంటున్నారు. అందుకే ఎక్కడ చేసే పని అక్కడే చేయాలన్నట్లుగా.. ప్రణయాన్ని పెంచుకోవాల్సిన పడకగదిని పని ప్రదేశంగా అస్సలు మార్చకూడదంటున్నారు వారు.

అలా శుభ్రత లోపిస్తుంది!

పడకగదిని నిద్రపోవడానికి మాత్రమే ఉపయోగించుకుంటే రాత్రి మాత్రమే ఆ గదిలోకొస్తాం. అదే రోజంతా బెడ్‌పైనే కూర్చొని పనిచేయాలంటే మాత్రం పదే పదే మంచం దిగడం, వేరే గదిలోకి వెళ్లడం, కిచెన్‌లోకెళ్లడం లేదంటే అలా లాన్‌లో నడవడం.. మళ్లీ ఆ తర్వాత అవే మట్టి కాళ్లతో తిరిగి మంచంపై కూర్చోవడం.. ఇలా పదే పదే చేశారంటే.. టైల్స్‌పై ఉన్న మురికి కాళ్ల ద్వారా బెడ్‌షీట్స్‌, పిల్లో కవర్స్‌పైకి చేరుతుంది. వీటినే తరచూ ఉపయోగిస్తుంటే చర్మ ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం. కాబట్టి శారీరక శుభ్రత పరంగా చూసుకున్నా వర్క్‌ ఫ్రమ్‌ బెడ్‌ అంత మంచిది కాదన్నది నిపుణుల అభిప్రాయం.

ఇవి కూడా!

* బెడ్‌పై సౌకర్యంగా ఉందని ఎలా పడితే అలా కూర్చుంటే కొన్నాళ్లకు వెన్ను నొప్పి రావడం, శరీరాకృతి దెబ్బతినడం.. వంటి సమస్యలు తప్పవు!
* మంచంపై కూర్చొని పనిచేయడం వల్ల సోమరితనం పెరిగిపోతుంది. ఫలితంగా మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడి.. ఫలితంగా ఆందోళనలు, ఒత్తిళ్లు, యాంగ్జైటీ, మూడ్‌ స్వింగ్స్‌.. వంటివి అధికమవుతాయి.
చూశారుగా.. మంచంపై కూర్చొని పనిచేస్తే ఎన్ని అనర్థాలో! మరి, ఇలా జరగకుండా ఉండాలంటే ప్రత్యేకమైన పని ప్రదేశాన్ని ఏర్పాటుచేసుకోవడం, ఉత్సాహం కోసం చక్కటి ఆహార నియమాలు-వ్యాయామాలు పాటించడం.. వంటి చిన్నపాటి చిట్కాలు మేలు చేస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్