Published : 05/06/2022 10:55 IST

కోపంతో ఉన్నారా? ఇలా మాట్లాడద్దు!

దాంపత్య బంధంలో కోపతాపాలు, అలకలు సహజం. అయితే చాలా సందర్భాల్లో ఇవి కొంత సమయం వరకే పరిమితమవుతాయి. అనుబంధాన్ని పునర్నిర్మించుకోవడానికి ఇదే సరైన సమయం అంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. ఈ క్రమంలో భాగస్వామి కోపంతో ఉన్నప్పుడు వాళ్ల దగ్గర కొన్ని విషయాలను అస్సలు ప్రస్తావించకూడదంటున్నారు. ఒకవేళ ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం వారి కోపం మరింతగా పెరిగి అనుబంధానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు. మరి, ఇంతకీ భాగస్వామి కోపంతో ఉన్నప్పుడు వారి దగ్గర చెప్పకూడదని ఆ విషయాలేంటో తెలుసుకుందాం రండి..

నీ వల్ల కాదు!

గొడవ జరిగినప్పుడు దంపతులిద్దరూ ఒకరిపై ఒకరు పీకల్లోతు కోపంతో ఉంటారు. ఈ సమయంలోనే ఎదుటివారిలో ఉండే ప్రతికూలతలన్నీ గుర్తుకొస్తుంటాయి. ఒక రకమైన అసహనానికి లోనవుతుంటాం. ‘నీ వల్ల ఏదీ కాదు!’, ‘నువ్వెప్పుడూ నన్ను సంతోషంగా ఉంచలేదు..’, ‘నీకు స్వార్థం ఎక్కువ!’.. మన ప్రమేయం లేకుండానే ఇలాంటి మాటలు దొర్లుతుంటాయి. అయితే ఇలాంటి మాటలు అవతలి వారి కోపాన్ని మరింత పెంచే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. తద్వారా గొడవ పెద్దదవడం తప్ప మరే ప్రయోజనం ఉండదు. దీనివల్ల ఇద్దరి మధ్య ఒక్క రోజులో ముగిసిపోయే కోపతాపాలు.. రోజుల పాటు కొనసాగినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే కోపంతో ఉన్న భాగస్వామి దగ్గర ఎంత సంయమనం పాటిస్తే అంత మంచిది. ఈ క్రమంలో తప్పైనా, ఒప్పైనా.. అవతలి వారి కోపం తగ్గే దాకా ఎవరో ఒకరు కామ్‌గా ఉండడం మంచిది. ఇక కూల్‌ అయ్యాక అన్ని విషయాలు కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారమవుతాయి.

అదే నా పొరపాటు!

‘మాట జారితే తిరిగి తీసుకోలేం’ అంటుంటారు పెద్దలు. అయితే కోపంలో ఉన్నప్పుడు ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ క్రమంలో చాలామంది.. ‘అమ్మానాన్న తెచ్చిన సంబంధం కాదని.. నిన్ను ఏరి కోరి పెళ్లి చేసుకున్నానే.. అదే నేను చేసిన తప్పు..’, ‘నిన్ను చేసుకునే కంటే.. అసలు పెళ్లే చేసుకోకుండా ఉంటే జీవితం ప్రశాంతంగా ఉండేదేమో!’.. ఇలాంటి వైరాగ్యపు మాటలు మాట్లాడుతుంటారు. దీనివల్ల కూడా అవతలి వారి కోపం పెరగడంతో పాటు మీపై నెగెటివ్‌ భావన కలిగినా కలగచ్చు. తద్వారా గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నట్లవుతుంది. కాబట్టి ఎంత కోపంతో ఉన్నా సరే.. ఓపికతో వ్యవహరించడం, మాట జారకుండా జాగ్రత్తపడడం మంచిది.

పిలుపు మారిందే?!

ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ముద్దుపేర్లతో పిలుచుకోవడం కామనైపోయింది. అయితే కోపంలో ఉన్నప్పుడు చాలామంది విషయంలో ఈ పిలుపులు మారిపోతుంటాయి. అప్పటిదాకా ‘డార్లింగ్‌’, ‘బంగారం’ అని భాగస్వామిని ముద్దు చేసిన వాళ్లు.. కోపంగా ‘ఏయ్‌’ అనడం, నేరుగా పేరు పెట్టి పిలవడం.. వంటివి చేస్తుంటారు. దీనివల్ల అవతలి వారికి మరింత కోపం రావడమే కాదు.. ఇద్దరి మధ్య దూరం కూడా క్రమంగా పెరుగుతుంది. అందుకే ఈ దూరాన్ని దగ్గర చేసుకోవాలంటే ముద్దు పేర్లే కొనసాగించమంటున్నారు నిపుణులు. కాస్త కోపంతోనైనా ముద్దు పేర్లతో పిలిచేటప్పుడు ఏదో ఓ మూల ఉన్న ప్రేమ, ఆప్యాయత ఇద్దరినీ తిరిగి ఒక్కటి చేసే అవకాశాలుంటాయట!

వాళ్ల ప్రస్తావనెందుకు?!

భార్యాభర్తల మధ్య జరిగే గొడవల్లో ఎక్కువ శాతం మూడో వ్యక్తి ప్రస్తావన వల్లే జరుగుతుంటాయని చెబుతున్నారు నిపుణులు. ఉదాహరణకు.. ఆలుమగలు తమ గొడవల మధ్యలో అత్తింటి వారి ప్రస్తావన తీసుకురావడం, ప్రతి విషయంలోనూ వాళ్లనే సమర్థించడం.. వల్ల భాగస్వామి కోపం కట్టలు తెంచుకునే ప్రమాదం ఉంటుంది. ఇది మీ మధ్య భేదాభిప్రాయాల్ని మరింతగా పెంచచ్చు. కాబట్టి మీ మధ్య గొడవలుంటే మీరే పరిష్కరించుకోవాలి. అంతేకానీ.. అన్నింటికీ కారణం మూడో వ్యక్తే అని నిందిస్తే.. నష్టపోయేది మీ అనుబంధమే అని గుర్తుపెట్టుకోండి.

కావాలని రెచ్చగొడుతున్నారా?

అసలే గొడవై ఇద్దరి మధ్య దూరం పెరిగినప్పుడు.. దాన్ని పూడ్చుకోవడానికి ప్రయత్నించాలే కానీ.. కొంతమంది అవతలి వారిని మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటారు. చేతలు, మాటలతో వాళ్ల సహనాన్ని పరీక్షిస్తుంటారు.. అంటే.. వాళ్లకు నచ్చని పనులు చేయడం, నచ్చని వ్యక్తులతో మాట్లాడడం.. వంటివన్నమాట! నిజానికి ఇది గొడవకు పరిష్కారం చూపడమేమోగానీ.. ఇద్దరి మధ్య దూరం పెరిగేలా చేస్తుందన్నది మాత్రం వాస్తవం. కాబట్టి కోపంలో ఉన్న భాగస్వామిని శాంతపరిచేందుకు ప్రయత్నించండి. ఈ క్రమంలో మీరు ఓ మెట్టు దిగినా తప్పు లేదు.. మొత్తానికి ఇద్దరి మధ్య గొడవ తీరితే చాలు!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని