Published : 25/11/2022 21:01 IST

చిన్నారులకు ఇవి పెట్టేటప్పుడు జాగ్రత్త..!

తాజా పండ్లు, కూరగాయలతో చక్కటి ఆరోగ్యం మన సొంతమవుతుందని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాటి నుంచి మనకు అందే పోషకాలు.. అనారోగ్యాన్ని మన దరి చేరనీయకుండా కాపాడతాయి. అయితే చిన్నారులకు వాటిని పెట్టే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలంటున్నారు పోషకాహార నిపుణులు. ముఖ్యంగా కొన్ని పళ్లు, కూరగాయలను కలిపి ఒకేసారి సలాడ్‌గా పిల్లలకు అందించకూడదని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అవి విషతుల్యంగా మారి చిన్నారులకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందట..! అయితే వేటిని వేటితో కలిపి చిన్నారులకు అందించకూడదో ఓసారి తెలుసుకుందాం...

వీటిని కలపకూడదు..

కమలాఫలం, క్యారట్:

ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల చిన్నారుల్లో గుండెలో మంట, వికారంగా అనిపించడం, మూత్రవ్యవస్థకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. కొన్ని సందర్భాల్లో వీటి ముప్పు పెరిగే అవకాశం కూడా ఉంది.

బొప్పాయి, నిమ్మ:

వీటిని కలిపి తినడం వల్ల హెమోగ్లోబిన్ విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంటుంది. ఫలితంగా చిన్నారులు ఎనీమియాకు గురి కావచ్చు. ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ రెండింటినీ కలిపి చిన్నారులకు పెట్టకపోవడం ఉత్తమం.

జామ, అరటి:

చిన్నారులకు కలిపి పెట్టకూడని పండ్లలో జామ, అరటి కూడా ఉన్నాయి. వీటిని ఒకే సమయంలో తినడం వల్ల చిన్నారుల్లో జీర్ణకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. తలనొప్పి, కడుపునొప్పి, వికారంగా కూడా అనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఎసిడోసిస్ (రక్తం, ఇతర శరీర కణజాలాల్లో ఆమ్ల స్థాయులు పెరగడం) బారిన పడే అవకాశాలూ లేకపోలేదు.


వీటిని పాలతో కలిపి ఇవ్వొద్దు..

చాలామంది తల్లులు తమ చిన్నారులకు పాలతో పాటు పండ్లను కూడా తినమని ఇస్తుంటారు. దానివల్ల వారి ఆరోగ్యం మెరుగుపడుతుందనే ఉద్దేశంతో ఇలా చేస్తుంటారు. అయితే పాలతో కలిపి కొన్ని పండ్లను చిన్నారులకు ఆహారంగా ఇవ్వకూడదు. అవేంటంటే..

కమలాఫలం, పాలు:

చిన్నారులకు ఈ రెండింటినీ ఒకేసారి ఆహారంగా ఇస్తే.. వారిలో జీర్ణసంబంధమైన సమస్యలు తలెత్తుతాయి. కమలాఫలమే కాదు.. దాన్నుంచి తీసిన రసాన్ని కూడా పాలు తాగిన వెంటనే లేదా అంతకు ముందు ఇవ్వకూడదు.

పైనాపిల్, పాలు:

పైనాపిల్‌లో ఉండే బ్రోమిలైన్ అనే పదార్థం పాలతో కలిసినప్పుడు ఆ మిశ్రమం విషపూరితంగా మారుతుంది. దీని కారణంగా తలనొప్పి, కడుపునొప్పి వస్తాయి. అలాగే జీర్ణకోశ సంబంధిత సమస్య ఉత్పన్నమవుతుంది. వాంతులు కూడా అవుతాయి. కొన్ని సందర్భాల్లో ఇది ఇన్ఫెక్షన్లకు లేదా డయేరియా వంటి సమస్యలకు దారి తీయవచ్చు.


కూరగాయలతో కలపకూడదు..

కొంతమంది సలాడ్లను కూరగాయలు, పండ్లు కలిపి తయారుచేస్తుంటారు. ఇలాంటివి పెద్దలు తింటే ఫర్వాలేదు కానీ చిన్నారులకు పెట్టడం వల్ల వారిలో జీర్ణసంబంధమైన సమస్యలు ఎదురయ్యే అవకాశముందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే పండ్లలో ఉండే చక్కెరల కారణంగా కూరగాయలు సరిగ్గా జీర్ణమవ్వవు. ఫలితంగా జీర్ణవ్యవస్థకు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆహారం సరిగ్గా అరగని కారణంగా చిన్నారుల్లో కడుపునొప్పి కూడా వస్తుంది.


వీటిని తినొచ్చు..

⚛ ఒకే రకమైన స్వభావం ఉండే పండ్లను కలిపి ఆహారంగా అందించడం ద్వారా చిన్నారుల్లో జీర్ణసంబంధ సమస్యలు, ఇతర అనారోగ్యాలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు.

⚛ పీచ్, యాపిల్, తర్బూజా, పుచ్చ, ఫిగ్, ఖర్జూరం వంటి స్వీట్ ఫ్రూట్ రకానికి చెందిన పండ్లను కలిపి తినొచ్చు.

⚛ సిట్రస్ జాతికి చెందిన పండ్లు అంటే నారింజ, కమలాఫలం, బత్తాయి, నిమ్మ, కివీ, ద్రాక్ష, పైనాపిల్, చెర్రీ, క్రాన్‌బెర్రీ, ప్లమ్ వంటివి ఆమ్లగుణాలున్న పండ్ల జాబితాలోకి వస్తాయి. వీటిని కూడా కలిపి చిన్నారులకు ఆహారంగా అందించవచ్చు.

⚛ మామిడి, రాస్బెర్రీ, స్ట్రాబెర్రీ, గ్రీన్ యాపిల్ వంటివి సెమీ యాసిడ్ రకానికి చెందిన పండ్లు. వీటిని సైతం పిల్లలకు మిశ్రమంగా చేసి అందించవచ్చు.

⚛ ప్రొటీన్లు, ఖనిజలవణాలు, నూనెలు.. వంటి గుణాలు కలగలిసిన పదార్థాలు తటస్థ రకానికి చెందినవి. ఉదాహరణకు.. కొబ్బరి, అవకాడో, బాదం, వాల్‌నట్ వంటివి ఈ జాబితాలోకి వస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని