Richest Women: దేశంలోనే శ్రీమంతురాళ్లు.. వీళ్ల సంపద ఎంతో తెలుసా?!
వ్యాపార రంగంలో మహిళలు దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో స్వశక్తితో పైకెదిగే వాళ్లు కొందరైతే.. వంశపారంపర్యంగా స్వీకరించిన వ్యాపారాల్ని తమ వ్యూహాలతో లాభాల దిశగా పరుగులు పెట్టిస్తున్నారు మరికొందరు. ఏటికేడు లక్షల కోట్ల ఆర్జనతో శ్రీమంతురాళ్లుగా ఎదుగుతున్నారు. అలాంటి మహిళా పారిశ్రామిక వేత్తల సంపదను....
(Photo: Instagram)
వ్యాపార రంగంలో మహిళలు దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో స్వశక్తితో పైకెదిగే వాళ్లు కొందరైతే.. వంశపారంపర్యంగా స్వీకరించిన వ్యాపారాల్ని తమ వ్యూహాలతో లాభాల దిశగా పరుగులు పెట్టిస్తున్నారు మరికొందరు. ఏటికేడు లక్షల కోట్ల ఆర్జనతో శ్రీమంతురాళ్లుగా ఎదుగుతున్నారు. అలాంటి మహిళా పారిశ్రామిక వేత్తల సంపదను పరిగణనలోకి తీసుకొని ‘దేశంలో వంద మంది అత్యధిక సంపద కలిగిన మహిళల జాబితా’ను రూపొందించాయి కోటక్ వెల్త్-హురున్ ఇండియా సంస్థలు. ఈ జాబితాలో ఈ ఏడాది 25 మంది మహిళలు కొత్తగా చోటు దక్కించుకున్నారు. వారెవరు? వాళ్ల సంపదెంతో? తెలుసుకుందాం రండి..
తమ వ్యాపార వ్యూహాలతో సంస్థల్ని లాభాల బాట పట్టిస్తూ.. లక్షల కోట్ల సంపదను ఆర్జిస్తోన్న మహిళల జాబితాను ఏటా రూపొందిస్తుంటుంది హురున్ ఇండియా. కోటక్ వెల్త్‌తో కలిసి ఈ ఏడాది విడుదల చేసిన ‘దేశంలోనే వంద మంది శ్రీమంతురాళ్ల’ జాబితాలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఛైర్‌పర్సన్ రోష్నీ నాడార్ రూ. 84,300 కోట్ల సంపదతో తొలి స్థానం దక్కించుకున్నారు. నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణీ నాయర్ (రూ. 57,520 కోట్లు), బయోకాన్ అధినేత్రి కిరణ్ మజుందార్ షా (రూ. 29,030 కోట్లు), దివీస్ ల్యాబ్స్ డైరెక్టర్ నీలిమా మోటపర్తి (రూ. 28,180 కోట్లు), జోహో సహవ్యవస్థాపకురాలు రాధా వెంబు (రూ. 26,260 కోట్లు).. సంపదతో వరుసగా ఐదు స్థానాల్లో నిలిచారు. ఇక ఈ ఏడాది ఈ జాబితాలో 12 మంది తెలుగు మహిళలుండగా, కొత్తగా 25 మంది మహిళలు స్థానం సంపాదించారు.
నేహా నర్ఖడే, కాన్‌ఫ్లుయెంట్ సహ వ్యవస్థాపకురాలు
స్వయంశక్తితో మిలియనీర్‌గా ఎదిగిన మహిళగా పేరు తెచ్చుకుంది పుణేకు చెందిన నేహా నర్ఖడే. జార్జియాలో టెక్నాలజీ విభాగంలో మాస్టర్స్ చేసిన ఆమె.. ఒరాకిల్, లింక్డిన్.. వంటి ప్రముఖ కంపెనీల్లో పని చేసింది. ఈ క్రమంలోనే మరో ఇద్దరు సహోద్యోగులతో కలిసి ‘Apache Kafka’ అనే సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌ని అభివృద్ధి చేసింది నేహ. ఆపై 2014లో ‘కాన్‌ఫ్లుయెంట్’ అనే సాఫ్ట్‌వేర్ సంస్థను నెలకొల్పింది. వ్యాపార సంస్థలు.. తమ ఉత్పత్తులు, సేవలు, సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే వారధిలా ఇది పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థ బోర్డు సభ్యురాలిగా కొనసాగుతోన్న ఆమె.. తన బృందంతో కలిసి లక్షల సంపదను ఆర్జించే వ్యూహాలు రచిస్తోంది.
‘నేను పెరిగి పెద్దయ్యే క్రమంలో నాన్న నాకు బోలెడన్ని పుస్తకాలు తెచ్చిచ్చేవారు. అవన్నీ ఈ పురుషాధిక్య ప్రపంచంలో రాణించి మేటిగా నిలిచిన ఇందిరా గాంధీ, ఇంద్రా నూయీ, కిరణ్ బేడీ.. వంటి వాళ్లవే. వాళ్లను స్ఫూర్తిగా తీసుకొనే ఐటీ రంగంలోకి వచ్చాను. మహిళలు తలచుకుంటే అసాధ్యమనేది ఏదీ ఉండదు.. నా జీవితం నుంచి నేను నేర్చుకున్న పాఠమిదే!’ అంటోంది నేహ. తాజా జాబితాలో రూ. 13,380 కోట్ల సంపదతో ఎనిమిదో స్థానంలో నిలిచిన ఆమె.. మంచి రచయిత్రి, వక్త కూడా!
సుచరిత పి.రెడ్డి, అపోలో సింధూరి హోటల్స్ ఎండీ
వైద్య, సామాజిక సేవా రంగాల్లోనే కాదు.. ఆతిథ్య రంగంలోనూ దూసుకుపోతోంది అపోలో గ్రూప్. ఈ సంస్థకు చెందిన ‘అపోలో సింధూరి హోటల్స్’కు ఎండీగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు అపోలో గ్రూప్ వ్యవస్థాపకులు ప్రతాప్ సి.రెడ్డి సతీమణి, వ్యాపారవేత్త సుచరిత పి.రెడ్డి. వివిధ కార్పొరేట్ సంస్థలు, ఆస్పత్రులు, పరిశ్రమలకు క్యాటరింగ్ సేవల్ని అందిస్తోందీ సంస్థ. అంతేకాదు.. చెన్నై, బెంగళూరు.. వంటి మహా నగరాల్లో హోటల్స్‌నీ నిర్వర్తిస్తోంది. ఇలా వినియోగదారులకు సంతృప్తికర సేవల్ని అందిస్తూనే.. ఆర్జనలోనూ ఇతర సంస్థలకు పోటీనిస్తోందీ కంపెనీ. ఈ నేపథ్యంలోనే తాజా జాబితాలో రూ.3700 కోట్ల సంపదతో 18వ స్థానం దక్కించుకున్నారు సుచరిత.
సుచరితతో పాటు అపోలో హాస్పిటల్స్ కార్యకలాపాల్లో భాగమైన ఆమె కూతుళ్లు సునీతా రెడ్డి (రూ. 4760 కోట్లు), శోభనా కామినేని (రూ.2740 కోట్లు), సంగీతా రెడ్డి (రూ. 2690 కోట్లు), ప్రీతా రెడ్డి (రూ. 2230 కోట్లు).. ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
రుచి కల్రా, ఆక్సిజో ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో
కుటుంబ వ్యాపారాన్ని చేపట్టి.. దాన్ని అభివృద్ధి చేయడమే కాదు.. కొత్త అంకురాలకు తెరలేపి వాటిలో విజయం సాధించిన యువ వ్యాపారవేత్తలూ మన దేశంలో ఎందరో ఉన్నారు. దిల్లీకి చెందిన రుచి కల్రా అదే కోవకు చెందుతుంది. 2016లో తన భర్త ఆశిష్‌తో కలిసి ‘ఆఫ్ బిజినెస్’ అనే అంకుర సంస్థను స్థాపించిందామె. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కావాల్సిన ముడి సరుకుల్ని ఈ సంస్థ అందిస్తుంటుంది. ఇక ఆపై 2017లో వీరిద్దరూ కలిసి ‘ఆక్సిజో ఫైనాన్షియల్ సర్వీసెస్’ను ప్రారంభించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణాలివ్వడమే దీని ముఖ్యోద్దేశం. ఇందుకోసం వీరు డేటా క్రంచ్ అనే సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థలో దేశవ్యాప్తంగా 2500 మందికి పైగా క్లయింట్స్ ఉన్నారు. మొదటి ప్రయత్నంలోనే సుమారు 200 మిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని సేకరించి.. సంస్థ విలువను వంద కోట్ల డాలర్ల మార్క్‌ని దాటించిన ఆక్సిజో.. మొన్నామధ్య ‘యూనికార్న్’ హోదానూ దక్కించుకుంది. మరోవైపు ఇదే సమయంలో ‘ఆఫ్ బిజినెస్’ కూడా ఈ హోదాను అందుకుంది. తద్వారా విడివిడిగా తమ సంస్థలకు యూనికార్న్ స్టేటస్ దక్కించుకున్న తొలి భారతీయ జంటగా వీరిద్దరూ ఘనత సాధించారు. ఇక ప్రస్తుతం రూ. 2600 కోట్ల సంపదతో తాజాగా విడుదల చేసిన కొటక్ వెల్త్-హురున్ ఇండియాలోనూ స్థానం సంపాదించింది కల్రా.
సుప్రియా బాడ్వే, బాడ్వే ఇంజినీరింగ్ ప్రై.లి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
శాస్త్రవేత్త కావాలని కలలు కన్న సుప్రియ.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఎల్‌ఐసీలో ఉద్యోగంలో చేరారు. ఆపై 1994లో శ్రీకాంత్ బాడ్వేను వివాహమాడిన ఆమె.. నాలుగేళ్ల పాటు కుటుంబ బాధ్యతలు, పిల్లల ఆలనా పాలనకే సమయం కేటాయించారు. ఆపై 1998లో ఔరంగాబాద్‌లోని బాడ్వే యూనిట్‌లో అకౌంట్స్ విభాగంలో చేరారు. 2002లో బాడ్వే ఇంజినీరింగ్ ప్రై.లి.లో డైరెక్టర్‌గా విధుల్లో చేరారామె. మరోవైపు ఔరంగాబాద్‌లోని పాలిమర్ యూనిట్ బాధ్యతల్నీ చూసుకునేవారు. వాహనాలకు సంబంధించిన విడి భాగాలను తయారుచేస్తోందీ సంస్థ. ఈ 20 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 35 యూనిట్లను ఏర్పాటుచేయడంలో కీలక పాత్ర పోషించారామె. ఇదే సమయంలో కంపెనీ లాభాలను ఆర్జించడంలో తనదైన వ్యాపార దక్షతను ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోన్న సుప్రియ రూ. 1940 కోట్ల సంపదతో తాజా జాబితాలో నిలిచారు.
అతిపిన్న శ్రీమంతురాలు!
కోటక్ వెల్త్-హురున్ ఇండియా శ్రీమంతురాళ్ల జాబితాలో స్థానం సంపాదించిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది ‘జెట్ సెట్ గో’ సహ వ్యవస్థాపకురాలు, సీఈవో కనికా టేక్రివాల్. విమానయాన రంగంలోకి అడుగుపెట్టాలని చిన్న వయసులోనే సంకల్పించుకున్న ఆమెకు ఒకానొక దశలో క్యాన్సర్ మహమ్మారి అడ్డుపడింది. అయినా మొండిధైర్యంతో దాన్ని జయించి.. కేవలం ఐదు వేల రూపాయలతో ఈ సంస్థను ప్రారంభించామె. విమానాలు, హెలికాప్టర్లని అద్దెకిచ్చే సంస్థ ఇది. 2014లో సేవల్ని ప్రారంభించిన ఈ సంస్థ ఆదాయం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం రూ.420 కోట్ల సంపదతో శ్రీమంతురాళ్ల జాబితాలో నిలిచిందీ 33 ఏళ్ల యువ వ్యాపారవేత్త.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.