Swara Bhasker : ఆ నమ్మకమే మా ఇద్దరినీ కలిపింది!

ప్రేమకు పునాది స్నేహం అంటుంటారు. అలా తమ స్నేహాన్ని ప్రేమగా మార్చుకొని, పెళ్లితో శాశ్వతంగా ఒక్కటైన జంటలు ఎన్నో! తమ బంధమూ ఇందుకు మినహాయింపు కాదని చెబుతోంది బాలీవుడ్‌ అందాల తార స్వరా భాస్కర్‌. ఇటీవలే తన ప్రియుడు ఫహాద్‌ జిరార్‌ అహ్మద్‌తో.....

Updated : 17 Apr 2023 12:24 IST

ప్రేమకు పునాది స్నేహం అంటుంటారు. అలా తమ స్నేహాన్ని ప్రేమగా మార్చుకొని, పెళ్లితో శాశ్వతంగా ఒక్కటైన జంటలు ఎన్నో! తమ బంధమూ ఇందుకు మినహాయింపు కాదని చెబుతోంది బాలీవుడ్‌ అందాల తార స్వరా భాస్కర్‌. ఇటీవలే తన ప్రియుడు ఫహాద్‌ జిరార్‌ అహ్మద్‌తో ఏడడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ.. తొలుత రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకొని, ఆపై సంప్రదాయబద్ధంగా తన పెళ్లి వేడుకలు జరుపుకొంది. అయితే అంతా సవ్యంగానే జరిగినా.. మతాంతర వివాహం చేసుకోవడం, పాకిస్తానీ డిజైనర్‌ రూపొందించిన డ్రస్‌ను రిసెప్షన్‌ కోసం ఎంచుకోవడంతో స్వరాను కొంతమంది విమర్శించారు. దీనిపై ఇటీవలే ఓ సందర్భంలో స్పందించిందీ చక్కనమ్మ. ఈ క్రమంలో తమ ప్రేమకథ, అనుబంధం గురించి పలు విషయాలు పంచుకుంది.

‘వీరే ది వెడ్డింగ్‌’, ‘తనూ వెడ్స్‌ మనూ’, ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో’.. వంటి సినిమాల్లో నటించి మెప్పించింది స్వరా. పలు సామాజిక అంశాలపైనా స్పందిస్తూ నిర్మొహమాటంగా తన మనసులోని మాటల్ని పంచుకుంటుంటుందీ బ్యూటీ. ఇక ఫహాద్‌ సామాజిక కార్యకర్త, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు. అయితే వీరిద్దరిలో ఉన్న ఈ సామాజిక కోణమే ఇద్దరినీ ఒక్కటి చేసిందేమో అంటున్నారు ఫ్యాన్స్‌.

నన్ను నన్నుగా ఇష్టపడ్డాడు!

ప్రేమకు స్నేహం పునాది అయినట్లు.. తమ ప్రేమా స్నేహంతోనే మొదలైందంటోంది స్వరా. ‘మా అనుబంధంలో నాకు బాగా నచ్చిన అంశం స్నేహం. స్నేహితులుగా కలిశాం.. నమ్మకంతో ఒక్కటయ్యాం. నా సెలబ్రిటీ స్టేటస్‌తో సంబంధం లేకుండా ఫహాద్‌ నన్ను నన్నుగా ఇష్టపడ్డాడు. గతేడాది సెప్టెంబర్‌లో నాకు చిన్న సర్జరీ జరిగింది. అప్పుడు నేను రెండు వారాల పాటు మంచానికే పరిమితమయ్యాను. అప్పటికే ఇద్దరం మంచి స్నేహితులమయ్యాం. దాంతో నా సర్జరీ గురించి తనతో పంచుకున్నా. తనను చూసినా, తనతో మాట్లాడినా ఒక రకమైన ఆత్మీయ భావన కలిగేది. అందుకే నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చాలా విషయాలు తనతో పంచుకున్నా. తను కూడా నా ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ వహించాడు. అది నన్ను తనకు మరింత దగ్గర చేసింది. అయితే మన సమాజంలో ప్రేమ వివాహమంటే ఒక రకమైన ఒత్తిడి ఉంటుంది. కులం, మతం, ఆస్తిపాస్తులు.. వంటి అంశాల్లో పలు జంటలు విమర్శలు ఎదుర్కొంటుంటారు. కానీ ఇద్దరి మనసుల్లో నిజమైన ప్రేముంటే.. ఇలాంటి అడ్డంకుల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు..’ అంటూ చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

ఒకరికొకరు తోడుగా..!

ప్రేమంటే సుఖంలోనే కాదు.. కష్టాల్లోనూ తోడుండేది. భార్యాభర్తలిద్దరూ ఆ నమ్మకమే తమ అనుబంధంలో ఏర్పరచుకోవాలంటోంది స్వరా. ‘ప్రేమంటే ఇద్దరు వ్యక్తులు దగ్గరవడమే కాదు.. ఒకరికి నచ్చినట్లుగా మరొకరు నడచుకోవాలి.. అంకితభావంతో ముందుకు సాగాలి. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఒకరి చేయి మరొకరు వదలకుండా, ప్రతికూల పరిస్థితుల్లోనూ ఒకరికొకరు తోడుగా ఉండేలా తమ అనుబంధాన్ని శాశ్వతం చేసుకోవాలి. రోజూ ప్రేమను ఇచ్చిపుచ్చుకోవాలి..’ అంటూ తమ అనుబంధంలోని ప్రేమ పాఠాల్ని చెప్పకనే చెబుతోందీ ముద్దుగుమ్మ.

తనలో నాకు నచ్చింది అదే!

ఫహాద్‌కు తన పట్ల ఉన్న శ్రద్ధ తనను కట్టిపడేసిందని స్వరా అంటుంటే.. తన ఇష్టసఖిలో తనకు నచ్చిన అంశాల గురించి ఫహాద్‌ ఇలా చెప్పుకొచ్చాడు. ‘మా ఇద్దరి నేపథ్యాలు వేరు.. పెరిగిన వాతావరణం, జీవితానుభవాలు భిన్నం.. అయినా ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం మా అనుబంధాన్ని శాశ్వతం చేసింది. స్వరా అద్భుతమైన వ్యక్తి. ఎవరినీ జడ్జ్‌ చేయదు.. నొప్పించదు. తనలో నాకు నచ్చేది ఇదే! ఈ సున్నితత్వమే నా వ్యక్తిగత విషయాలు తనతో పంచుకునేందుకు ప్రేరేపించింది. ప్రతి విషయంలోనూ తను నాకు సపోర్టివ్‌గా ఉంటుంది. నా ఇష్టాన్ని కాదనదు..’ అంటూ తన అర్ధాంగిని ఆకాశానికెత్తేశాడు ఫహాద్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్