Published : 21/12/2021 21:08 IST

371 గదుల ఆ హోటల్‌ను పూర్తిగా మహిళా ఇంజినీర్లే నిర్మిస్తారట!

(Photo: IHCL)

మొన్న వాహనాలు.. నిన్న తయారీ.. నేడు నిర్మాణం.. పురుషాధిపత్యం వేళ్లూనుకుపోయిన ఈ రంగాల్లో పితృస్వామ్య వ్యవస్థకు దారులు క్రమంగా మూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే పురుషులతో సమాన అవకాశాలివ్వడానికి ఆయా సంస్థలు మహిళల్ని తమ ఉద్యోగులుగా నియమించుకుంటున్నాయి. మరికొన్ని సంస్థలైతే ఏకంగా పూర్తిస్థాయి మహిళా బృందాల్నే ఎంచుకుంటున్నాయి. ఈ జాబితాలోకి తాజాగా చేరిపోయింది ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (IHCL). ముంబయిలో ఈ కంపెనీ నిర్మించబోయే ఓ విలాసవంతమైన హోటల్ నిర్మాణాన్ని పూర్తి స్థాయి మహిళా ఇంజినీర్ల  బృందమే పూర్తిచేయనుందని ప్రకటించింది. నిర్మాణ రంగంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించడమే ఈ నిర్ణయం వెనకున్న ముఖ్యోద్దేశమట! మరి, పూర్తిగా మహిళలే నిర్మించబోయే ఈ హోటల్‌ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (IHCL), టాటా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్తో కలిసి ముంబయి శాంటాక్రూజ్‌లో కొత్త ‘జింజర్‌ హోటల్‌’ని నిర్మించేందుకు సంకల్పించింది. అయితే ఇందుకోసం పూర్తిగా మహిళా ఇంజినీర్లతో కూడిన బృందాన్ని నియమించుకున్నట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి.

మహిళా సమానత్వం కోసమే..!

19 వేలకు పైగా చదరపు మీటర్ల విస్తీర్ణంతో కూడిన ఈ హోటల్‌లో మొత్తం 371 గదుల్ని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించనున్నారు. పూర్తిగా మహిళా ఇంజినీర్లతో కూడిన బృందం కేవలం 19 నెలల్లోనే దీని నిర్మాణం పూర్తిచేయనున్నట్లు టాటా ప్రాజెక్ట్స్‌ ఎండీ తెలిపారు. ‘జింజర్‌ హోటల్ నిర్మాణమంతా మహిళల చేతుల మీదుగానే జరగనుంది. పని ప్రదేశంలో పురుషులతో సమానంగా మహిళల్ని ప్రోత్సహిస్తూ.. వారికి విభిన్న అవకాశాలు కల్పించడమే దీని వెనకున్న ముఖ్యోద్దేశం. వీళ్ల విజయం మరెంతోమంది మహిళలకు స్ఫూర్తినిస్తుంది. నిర్మాణ రంగంలో మహిళల ప్రాతినిథ్యం పెంచడానికి మార్గం సుగమమవుతుంది..’ అంటూ చెప్పుకొచ్చారాయన.

ప్రత్యేక వసతులు!

అయితే IHCL ఇలా మహిళా సాధికారతకు తెరతీయడం ఇది తొలిసారేమీ కాదు. ఈ ఏడాది మార్చిలో ఆతిథ్య రంగంలోనూ మహిళలకు అధిక అవకాశాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా పూర్తిగా మహిళల నిర్వహణలో ఉన్న విలాసవంతమైన భవనాలను త్వరలోనే చెన్నైలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇందులో జనరల్‌ మేనేజర్‌ దగ్గర్నుంచి అన్ని శాఖల్లో మహిళలే విధులు నిర్వర్తిస్తారట! అంతేకాదు.. తమ మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక సదుపాయాలు సైతం కల్పిస్తోందీ సంస్థ. అవసరమైతే ప్రసవానంతర సెలవుల్ని పొడిగించుకోవడం, కార్యాలయ ఆవరణలో క్రెచ్‌ సదుపాయాలు, ఐవీఎఫ్‌ వంటి చికిత్సలకు మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌.. వంటివి అందులో కొన్ని!

ఇవి కూడా!

* గతంలో ‘గెరా మిస్టీ వాటర్స్‌’ సంస్థ కూడా పుణేలో పూర్తి స్థాయి మహిళా ఇంజినీర్లతో కూడిన బృందంతో హౌసింగ్ ప్రాజెక్ట్‌ని పూర్తి చేసింది. #WomenBuild పేరుతో ఈ ప్రాజెక్ట్‌ని పూర్తిచేసిన ఈ సంస్థ మహిళల్ని రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ప్రోత్సహించడమే దీని ముఖ్యోద్దేశమంటోంది.

* కేరళ ప్రభుత్వం ‘కుటుంబ శ్రీ’ పేరుతో మహిళా సాధికారత కార్యక్రమం నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే! ఇందులో భాగంగానే ‘నిర్మాణశ్రీ కన్స్‌స్ట్రక్షన్స్‌’ పేరుతో నిర్మాణ రంగంలోనూ మహిళలకు అవకాశాలు కల్పిస్తోంది.

* 2015లో ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో 10 పెద్ద గిడ్డంగుల నిర్మాణమూ పూర్తి స్థాయి మహిళా బృందం చేతుల మీదుగానే జరగడం విశేషం. అప్పట్లో ఈ తరహా నిర్మాణం మహిళలే పూర్తిగా చేపట్టడం దేశంలోనే ప్రథమంగా చెబుతారు.

ఇలా చెప్పుకుంటూపోతే- నిర్మాణ రంగంలో కేవలం సాధారణ కూలీలుగానే కాకుండా మహిళలు వివిధ స్థాయుల్లో కీలక పాత్ర పోషించడం ఏళ్ల క్రితమే మొదలైందని అర్థమవుతుంది. అయినా ఇంకా కొన్ని అసమానతలు, వివక్ష.. స్త్రీలకు ఈ రంగంలో అవకాశాలు దక్కకుండా చేస్తున్నాయంటున్నారు నిపుణులు. అయితే అన్ని రంగాల్లో లాగే నిర్మాణ రంగంలోనూ మహిళల పట్ల ఉన్న ఆలోచనల్లో ఇప్పుడిప్పుడే మార్పులొస్తున్నాయి. కాబట్టి ఇకపై ఈ రంగంలో ఉన్నత స్థాయిలో రాణించాలనుకుంటోన్న మహిళలు తగిన నైపుణ్యాలు నేర్చుకొని అన్ని అస్త్రాల్ని సిద్ధం చేసుకోవాలని చెబుతున్నారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి