కొత్త ఉద్యోగం.. కంగారు పడుతున్నావంటున్నారు!

హాయ్‌ మేడం. నాది బీటెక్‌ పూర్తైంది. నిర్మాణ రంగంలో ఇటీవలే ఉద్యోగంలో చేరా. నేనేం చేసినా పైఅధికారి కంగారుపడుతూ చేస్తున్నావ్‌ అంటున్నారు. అది కాస్త నిరుత్సాహంగా అనిపిస్తోంది. గతంలో పని విషయంలో కొన్ని పొరపాట్లూ చేశా...

Published : 09 Sep 2022 18:23 IST

హాయ్‌ మేడం. నాది బీటెక్‌ పూర్తైంది. నిర్మాణ రంగంలో ఇటీవలే ఉద్యోగంలో చేరా. నేనేం చేసినా పైఅధికారి కంగారుపడుతూ చేస్తున్నావ్‌ అంటున్నారు. అది కాస్త నిరుత్సాహంగా అనిపిస్తోంది. గతంలో పని విషయంలో కొన్ని పొరపాట్లూ చేశా. ఈ సమస్యకి పరిష్కారముందా? - ఓ సోదరి

జ. ఉద్యోగంలో చేరిన కొత్తలో భయం, ఆందోళన సహజమే. ఇది కొన్నిసార్లు మీ కెరియర్‌కీ ఆటంకం కలిగించగలదు. ఏమవుతుందో, ఏమో?.. సరిగానే చేస్తున్నానో, లేదో? అన్న కంగారుతో మరిన్ని తప్పులు చేస్తుంటారు. 55% ఉద్యోగులు ఆందోళనతో ఎన్నోసార్లు గడువులోగా పని పూర్తి చేయలేకపోయారని ఓ సర్వేలో వెల్లడైంది. ఈ స్థితి అందరికీ సాధారణమే. కాబట్టి.. నివారణ చర్యల గురించి ఆలోచించండి. ప్రశాంతంగా ఉండండి. కంగారనిపిస్తే డెస్క్‌ ఎక్సర్‌సైజ్‌లు, ధ్యానం వంటివి చేయండి. ఒత్తిడిని తగ్గించే ఎన్నో యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటినీ ప్రయత్నించొచ్చు.

ఇక మీ భవిష్యత్‌ గురించి.. అన్నిసార్లూ తప్పులే ఆటంకాలవవు. మీరు చూసే విధానమూ కారణమవుతుంది. ఉదాహరణకు- ప్రతిదాన్నీ అతిగా ఆలోచించడం లాంటివి. నేను చేయగలనన్న ఆత్మవిశ్వాసం పెంచుకోండి. పనిలో మీ పూర్తి సామర్థ్యాన్ని అందించడానికి ప్రయత్నించండి. అవసరమైతే చిన్న చిన్న విరామాలూ తీసుకోండి. పని ప్రదేశంలో కంగారు, తప్పులు మామూలే. దాన్ని అంగీకరించి, పరిష్కారాలు కనుక్కునే వారే అరుదు. మీరు నిజాయతీగా తప్పును అంగీకరించి, మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది మీరు బాధ్యతాయుతమైన వ్యక్తి అని చెప్పడానికి నిదర్శనం. మీకు మీరు కాస్త సమయం ఇవ్వండి. అనుభవంతో మీ మీద మీకే నమ్మకం ఏర్పడుతుంది. అప్పటివరకూ మిమ్మల్ని మీరు నిందించుకోక.. మీవంతు ప్రయత్నం చేయండి.. మంచి ఉద్యోగిగా ఎదగడం మీకు మీరే గమనిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని