Ram Charan-Upasana: ‘మెగా లిటిల్‌ ప్రిన్సెస్‌’ కోసం.. ఎన్నెన్నో సర్‌ప్రైజ్‌లు!

పాపాయి బోసినవ్వులు, బుడిబుడి నడకలతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. ఇవి చూసి తల్లిదండ్రుల మనసు ఆనందంతో నిండిపోతుంది. తాజాగా తొలిసారి తల్లిదండ్రులైన సెలబ్రిటీ కపుల్‌ రామ్‌చరణ్‌-ఉపాసన....

Published : 20 Jun 2023 17:32 IST

(Photos: Instagram)

పాపాయి బోసినవ్వులు, బుడిబుడి నడకలతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. ఇవి చూసి తల్లిదండ్రుల మనసు ఆనందంతో నిండిపోతుంది. తాజాగా తొలిసారి తల్లిదండ్రులైన సెలబ్రిటీ కపుల్‌ రామ్‌చరణ్‌-ఉపాసన దంపతులు ప్రస్తుతం ఈ ఆనందంలోనే మునిగితేలుతున్నారు. పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన ఈ జంట.. తమ ఇంట మహాలక్ష్మి పుట్టిందంటూ మురిసిపోతున్నారు. మరోవైపు ఫ్యాన్స్‌ ‘మెగా లిటిల్‌ ప్రిన్సెస్‌’కు స్వాగతం చెబుతూ.. ఈ లవ్లీ కపుల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తమ ఇంట్లోనే పాపాయి పుట్టిందేమో అన్నంతగా సంబరాలు చేసుకుంటున్నారు.

టాలీవుడ్‌లో ముచ్చటైన జంటగా పేరు తెచ్చుకుంది రామ్‌చరణ్‌-ఉపాసన జంట. వీరి పదకొండేళ్ల వైవాహిక బంధానికి గుర్తుగా తాజాగా ఆడపిల్లకు జన్మనిచ్చారీ లవ్లీ కపుల్‌. దీంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్నంటాయి. మొదటిసారి నానమ్మ-తాతయ్యలుగా మారిన చిరంజీవి దంపతులు తమ మనవరాలిని చూసి సంతోషంతో ఉప్పొంగిపోయారు. ఈ ఆనందంలోనే మనవరాలిని ఉద్దేశిస్తూ తాజాగా ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు చిరు.

లిటిల్‌ ప్రిన్సెస్‌ కోసం.. స్పెషల్‌ ట్యూన్!

‘మెగా లిటిల్‌ ప్రిన్సెస్‌కు స్వాగతం.. నీ రాకతో కోట్ల మంది మెగా అభిమానులకు ఆనందాన్ని పంచావు. రామ్‌ చరణ్‌, ఉపాసనలను తల్లిదండ్రులను చేశావు.. మమ్మల్ని నానమ్మ-తాతయ్యల్ని చేశావు. ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది చిట్టి తల్లీ!’ అంటూ తన ఆనందాన్ని అక్షరీకరించాడీ మెగా హీరో. పలువురు సెలబ్రిటీలూ కొత్తగా పేరెంట్స్‌ క్లబ్‌లోకి అడుగుపెట్టిన ఈ మెగా కపుల్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ గాయకుడు, నాటు నాటు పాట సింగర్‌ కాలభైరవ.. ఈ మెగా ప్రిన్సెస్‌ కోసం ప్రత్యేకంగా ఓ ట్యూన్‌ను రూపొందించి.. బహుమతిగా అందించాడు. దీనిపై స్పందించిన చెర్రీ-ఉపాసన.. ‘నీలోని ప్రశాంతతను, పాజిటివిటీని, ఆధ్యాత్మిక చింతనను మేల్కొలుపుతూ.. మా చిన్నారి కోసం ఓ అర్థవంతమైన ట్యూన్‌ను రూపొందించి అందించినందుకు నీకు ప్రత్యేక ధన్యవాదాలు! ప్రపంచంలో ఉన్న పిల్లలందరిలో ఆనందాన్ని, ఉత్సాహాన్ని, పాజిటివిటీని నింపుతుందీ ట్యూన్‌..’ అంటూ ఈ సింగర్‌కు అభినందనలు తెలియజేశారీ మెగా కపుల్‌. మరోవైపు ప్రజ్వల ఫౌండేషన్‌ ఈ మెగా బుజ్జాయి కోసం ఓ హ్యాండ్‌మేడ్‌ ఉయ్యాలను తయారుచేసి చెర్రీ దంపతులకు కానుకగా అందజేసింది.

తొమ్మిది నెలల్లో.. ఎంతో నేర్చుకున్నా!

గతేడాది డిసెంబర్‌లో తన ప్రెగ్నెన్సీ గురించి బయటపెట్టింది ఉపాసన. అప్పట్నుంచి సందర్భం వచ్చినప్పుడల్లా కాబోయే అమ్మగా తన అనుభవాలను పంచుకుంటోంది.. మరోవైపు తన మెటర్నిటీ ఫ్యాషన్స్‌తోనూ ఎంతోమంది న్యూమామ్స్‌కి స్ఫూర్తిగా నిలిచిందామె. అయితే తాను గర్భిణిగా ఉన్న ఈ తొమ్మిది నెలల్లో జీవితానికి ఉపయోగపడే ఎన్నో విషయాలు నేర్చుకున్నానంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది ఉప్సీ.

‘ఈ తొమ్మిది నెలలు ఎంతో ఆనందంగా గడిచిపోయాయి. మా ఇద్దరి జీవితాల్లో ఎన్నో మంచి విషయాలు చోటుచేసుకున్నాయి. గర్భం ధరించాక చెర్రీతో కలిసి గోల్డెన్‌ గ్లోబ్స్‌, ఆస్కార్‌ చిత్రోత్సవాల్లో పాల్గొన్నా. ఈ రెండు వేదికల పైనా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి అవార్డులు దక్కాయి. ఇలా ఇద్దరం కలిసి మరింత ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరికింది. మరోవైపు వివిధ ప్రాంతాలకు వెకేషన్లకూ వెళ్లాం. ఇక నా బేబీకి స్పెషల్‌ థ్యాంక్స్‌ చెప్పాలి. ఎందుకంటే తను కడుపులో ఉన్నా నేనెంతో సౌకర్యవంతంగా నా పనులన్నీ చేసుకునేందుకు సహకరించింది. తద్వారా కెరీర్ పైనా దృష్టి పెట్టగలిగాను. చేసే పనుల్లో ప్రాధాన్యతల్ని ఎలా నిర్ణయించుకోవాలో కూడా ఈ దశలో మరింత లోతుగా తెలుసుకోగలిగా. ఇదే స్ఫూర్తిని, ఉత్సాహాన్ని ఇకముందూ కొనసాగిస్తా..!’ అంటూ తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి పంచుకుందీ మెగా కోడలు.

చెర్రీ.. మిస్టర్‌ కూల్!

గర్భంతో ఉన్న మహిళలు తమ భర్త నుంచి మరింత ఎక్కువగా ప్రేమాభిమానాలను కోరుకుంటారు. ఈ విషయానికొస్తే తన భర్త చెర్రీకి నూటికి నూరు మార్కులు వేస్తానంటోంది ఉపాసన.

‘చెర్రీలో నాకు ముందు నుంచీ నచ్చింది.. తన అణకువ, కూల్‌నెస్. ఒత్తిడి కలిగించే పరిస్థితుల్లో అయినా.. చెప్పలేనంత ఆనందమైనా.. ఏదైనా సరే.. ప్రతి క్షణాన్నీ కూల్‌గా స్వీకరించడం తనకే చెల్లుతుంది. నా ప్రెగ్నెన్సీ విషయం తొలిసారి తనతో పంచుకున్నప్పుడూ తను అంతే కూల్‌గా వ్యవహరించాడు. నేనేమో.. ఎప్పుడెప్పుడు ఈ విషయం అందరితో పంచుకుందామా అంటూ ఆరాటపడుతుంటే.. తనేమో కూల్‌గానే తనలోని ఆనందాన్ని వ్యక్తం చేసేవాడు. ఇక ఈ తొమ్మిది నెలల ప్రయాణంలోనూ తను మానసికంగా, ఎమోషనల్‌గా నాకు ఎంతో సపోర్ట్‌ ఇచ్చాడు. మా చిన్నారి ఆలనా పాలనలో తండ్రిగా తను పూర్తి బాధ్యత వహిస్తాడని, బెస్ట్‌ డాడ్‌ అనిపించుకుంటాడన్న నమ్మకం ఉంది..’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.

గర్భంతోనూ పని చేసుకోవచ్చు!

గర్భిణిగా ఉన్నప్పుడూ చురుగ్గా తన కెరీర్‌ బాధ్యతల్ని నిర్వర్తించింది ఉపాసన. దీనిపై ఓ సందర్భంలో స్పందిస్తూ.. ‘ప్రెగ్నెన్సీ అనారోగ్యం కాదు. ఈ సమయంలోనూ మహిళలు పనిచేయడానికి సమర్థులు. మన చుట్టూ ఎంతోమంది నెలలు నిండుతున్నా విధులకు హాజరవడం చూస్తుంటాం. మా అమ్మ, ఆంటీలు కూడా నిండు గర్భంతోనూ తమ కెరీర్‌ బాధ్యతల్ని నిర్వర్తించారు. నేనూ వాళ్లను అనుసరించా. అయితే అందరి శరీర తత్వాలు, ఆరోగ్య పరిస్థితులు ఒకేలా ఉంటాయని చెప్పలేను. కానీ.. ఈ దశలోనూ సాధారణ మహిళల్లాగే అన్ని పనుల్నీ చేసుకోగల సమర్థత మనకుంది.. ఇలా చేస్తేనే శరీరం, మనసు ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటాయి కూడా!’ అంటూ ఎంతోమందిలో స్ఫూర్తి నింపింది ఉపాసన.

మా బిడ్డ ఆ ఆనందాన్ని మిస్‌ కాకుండా..!

ప్రస్తుతం చెర్రీ-ఉప్సీ తమ అత్తమామలతో కాకుండా.. విడిగా ఉంటున్నారు. కానీ బిడ్డ పుట్టాక అత్తమామలతో కలిసి ఉండాలని ముందే నిర్ణయించుకున్నట్లు ఇటీవలే ఓ సందర్భంలో పంచుకుంది ఉపాసన. ‘సాధారణంగా ఎవరైనా దంపతులు పిల్లలు పుట్టిన తర్వాత వేరు కాపురం పెడుతుంటారు. కానీ, మేము దీనికి పూర్తి భిన్నం. ప్రస్తుతం చరణ్‌, నేనూ.. అత్తమామలతో కాకుండా విడిగా ఉంటున్నాం. బేబీ పుట్టాక మేము మా అత్తమామలతోనే కలిసి ఉండాలని ముందే నిర్ణయించుకున్నాం. ఎందుకంటే, మా ఇద్దరి ఎదుగుదలలో మా గ్రాండ్‌ పేరెంట్స్‌ కీలకపాత్ర పోషించారు. వాళ్ల నుంచి మేము ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నాం. గ్రాండ్‌ పేరెంట్స్‌తో ఉంటే కలిగే ఆనందాన్ని మేము మా బిడ్డకు దూరం చేయాలనుకోవడం లేదు..’ అంటోంది ఉపాసన.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని