మీ పిల్లల కోసం.. ఈ తీర్మానాలు!

కొత్త సంవత్సరం వస్తోందనగానే.. ఈ ఏడాది కారు కొనాలని, ఇల్లు కొనాలని, వేరే ఉద్యోగానికి మారాలని, ఏదైనా చెడు అలవాటు మానేయాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని.. ఇలా ఎన్నో తీర్మానాలు చేసుకోవడం మామూలే. ఈ క్రమంలో పేరెంట్స్ తమ కోసమే కాదు.. పిల్లల కోసం కూడా కొన్ని తీర్మానాలు....

Published : 29 Dec 2022 19:24 IST

కొత్త సంవత్సరం వస్తోందనగానే.. ఈ ఏడాది కారు కొనాలని, ఇల్లు కొనాలని, వేరే ఉద్యోగానికి మారాలని, ఏదైనా చెడు అలవాటు మానేయాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని.. ఇలా ఎన్నో తీర్మానాలు చేసుకోవడం మామూలే. ఈ క్రమంలో పేరెంట్స్ తమ కోసమే కాదు.. పిల్లల కోసం కూడా కొన్ని తీర్మానాలు తీసుకుని, వాటిని వారి చేత అమలు చేయించాలంటున్నారు నిపుణులు.

ఆరోగ్యం కోసం..

మీ కొత్తేడాది తీర్మానాల జాబితాలో ఆరోగ్యాన్ని చేర్చుకునే ఉంటారు కదూ..! మరి మీరు ఎంతగానో ప్రేమించే మీ చిన్నారుల ఆరోగ్యం కోసం కూడా ఈ ఏడాది కొన్ని తీర్మానాలు చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా వారికి అర్థమయ్యేలా కొన్ని విషయాలను చెప్పాలి.

ప్రతి రోజూ ఆహారంలో పండ్లను తీసుకోవడం అలవాటు చేయాలి.

బయట దొరికే చిరు తిండ్లను తినకుండా కంట్రోల్‌ చేయాలి.

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేయడం వారికి ఇప్పటి నుంచే అలవాటు చేయాలి.

ఫోను, టీవీ చూసే సమయాన్ని తగ్గించాలి. ఒక నిర్ణీత సమయంలో మాత్రమే వివిధ గ్యాడ్జెట్స్‌ను వాడేలా ప్రోత్సహించాలి.

కొత్తవి నేర్పించాలి..

ఈ ఏడాది చిన్నారుల కోసం పెద్దలు తీసుకోవాల్సిన తీర్మానాల్లో ఇదీ ఒకటి. మనిషి నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. ఇది పెద్దలకే కాకుండా చిన్నారులకు కూడా వర్తిస్తుంది. మరీ ముఖ్యంగా చిన్నతనంలో వారు ఏదైనా కొత్తది నేర్చుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. కాబట్టి వారికి ఏదో ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్పించండి. మీకు నేర్పించే సమయం లేకుంటే ఆన్‌లైన్‌లో అయినా ట్రై చేయండి.

నైతిక విలువలు..

కేవలం స్కూల్‌, హోం వర్క్, హాబీలు అనే కాకుండా మీ చిన్నారులకు నైతిక విలువలను కూడా నేర్పించండి. దానికి ఈ కొత్త సంవత్సరాన్నే నాందిగా భావించండి. అంతేకాదు.. వారిలో కాస్త సేవా గుణాన్ని కూడా ఇప్పటి నుంచే అలవాటు చేయండి. ఏదైనా ఇతరులతో పంచుకునే గుణాన్ని అలవాటు చేయండి. భవిష్యత్తులో ఇది వారికి ఎంతో ఉపయోగపడుతుందని గుర్తించండి. అలాగే వారికి ఇప్పటి నుంచే కొన్ని విలువల గురించి అర్థమయ్యేలా విడమరిచి చెప్పండి.

మంచి అలవాట్లు..

ఇదేవిధంగా కొత్తేడాదిలో మీ చిన్నారులకు కొన్ని మంచి అలవాట్లను నేర్పించడాన్ని కూడా ఒక తీర్మానంగా తీసుకోండి.  ఉదాహరణకు- ఎక్కడ చూసినా కాలుష్యం పెరుగుతోన్న క్రమంలో మీ చిన్నారులకు మొక్కల పెంపకాన్ని అలవాటు చేయండి. ఒక మొక్కను నాటి దాని బాధ్యతను వారికే అప్పగించండి. ప్రతి రోజూ నీళ్లు పోయడం అలవాటు చేయండి. ఆ మొక్క ఎదిగే తీరు చూసే చిన్నారి సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. ఇది వారి ఆలోచనలలోనూ మంచి మార్పునకు దారి తీస్తుంది. కాబట్టి ఇలాంటి ఏదో ఒక మంచి అలవాటును కొత్త సంవత్సరంలో వారికి పరిచయం చేయండి.

ఇది మీ కోసమే!

బిజీబిజీ పరుగుల జీవితంలో పక్కవారిని పట్టించుకునే తీరిక కూడా లేకుండా పోతోంది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేసే కుటుంబాల్లో ఇది మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ఇక కాస్త సమయం దొరికిందంటే చాలు... ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో గడిపేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త ఏడాది నుంచైనా మీ చిన్నారితో సాధ్యమైనంత ఎక్కువ సమయం కేటాయించాలనే తీర్మానాన్ని తీసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్