Published : 22/08/2022 18:32 IST

పెళ్లైన వెంటనే హనీమూన్‌కి వెళ్తున్నారా?

హనీమూన్‌.. కొత్తగా పెళ్లైన జంటల్ని మనసా, వాచా, కర్మణా ఒక్కటి చేసే మధురయాత్ర ఇది. నిజానికి పెళ్లి కుదిరినప్పట్నుంచే చాలామంది దీనికోసం ప్రణాళికలు వేసుకుంటారు. ఎక్కడికెళ్లాలో నిర్ణయించుకున్నాక ఆ ప్రదేశం గురించి ఓ చిన్నపాటి పరిశోధనే చేస్తుంటారు. తద్వారా ఈ యాత్రను పూర్తిగా ఆస్వాదిస్తుంటారు. అయితే హనీమూన్‌లో భాగంగా కొన్ని జంటలు తెలిసో, తెలియకో చేసే పలు పొరపాట్లు.. వాళ్ల ఆనందాన్ని దెబ్బతీస్తాయంటున్నారు నిపుణులు. ఫలితంగా అటు వెకేషన్‌కి వెళ్లిన ఫీలింగ్‌ ఉండదు.. ఇటు ఇద్దరూ కలిసి ఏకాంతంగా గడిపినట్లుగానూ అనిపించదు. మరి, అలా జరగకుండా ఉండాలంటే.. హనీమూన్‌లో ఈ పొరపాట్లు దొర్లకుండా చూసుకోవడం మంచిదంటున్నారు.

వెంటనే వద్దు!

చాలా జంటలు తమ పెళ్లి కోసం కొన్ని రోజుల పాటు సెలవులు తీసుకోవడం పరిపాటే! అయితే కొంతమంది పనిలో పనిగా హనీమూన్‌ని కూడా ఎంజాయ్‌ చేసేయచ్చన్న ఉద్దేశంతో ఆ వెకేషన్‌ సెలవుల్నీ ఇందులో కలుపుకొనే పెళ్లికి సెలవులు పెట్టుకుంటుంటారు. మరికొంతమంది.. వ్యక్తిగత పనులు, వృత్తిఉద్యోగాల రీత్యా ఆ తర్వాత సమయం కుదురుతుందో, లేదోనని పెళ్లైన వెంటనే హనీమూన్‌కి వెళ్తుంటారు. అయితే కారణమేదైనా.. ఇలా పెళ్లైన వెంటనే మధురయాత్రకు వెళ్లడం వల్ల యాత్రను పూర్తిగా ఎంజాయ్‌ చేయలేరని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే.. అప్పటిదాకా పెళ్లి హడావిడి, బంధువుల ఆహ్వానం మేరకు వారింటికి లంచ్‌-డిన్నర్స్‌కి వెళ్లడం, ఇతర పనుల రీత్యా కొత్త దంపతులు అలసిపోతారు. అలాంటి సమయంలో వెకేషన్‌ ప్లాన్‌ చేసుకుంటే మరింత నీరసించడంతో పాటు హనీమూన్‌కి వెళ్లామన్న సంతృప్తే దక్కదు. కాబట్టి పెళ్లైన వెంటనే కాకుండా.. ఒకటి లేదా రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత ప్లాన్‌ చేసుకోవడం మంచిది. ఈ సమయం మీరు శారీరకంగా, మానసికంగా పునరుత్తేజితం కావడానికే కాదు.. మధుర యాత్ర కోసం మరింత పకడ్బందీగా సిద్ధమవడానికీ ఉపయోగపడుతుంది.

దూరం కంటే దగ్గర మిన్న!

హనీమూన్‌కి వెళ్లాలన్న ఉత్సాహం, వెళ్లే అవకాశం.. జీవితంలో ఒక్కసారే వస్తుందన్న ఉద్దేశంతో చాలామంది దగ్గర కంటే దూర ప్రాంతాల్ని ఎంచుకోవడానికే ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలో స్వదేశాన్ని పక్కన పెట్టి.. విదేశీ ప్రాంతాల్ని ఎంచుకునే జంటల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇలా ఎంత ఎక్కువ దూరం వెళ్తేనే అంతగా ఎంజాయ్‌ చేయగలమని, బోలెడన్ని మధురానుభూతుల్ని మూటగట్టుకోగలమని అనుకుంటాయి చాలా జంటలు. కానీ ఆ ఆలోచన తప్పంటున్నారు నిపుణులు. ఎందుకంటే దూర ప్రాంతాల్ని, పైగా మనకు తెలియని ప్రాంతాల్ని ఎంచుకోవడం, దీనిపై ఎక్కువ బడ్జెట్‌ పెట్టడం, ఎక్కువ దూరం ప్రయాణించి అలసిపోవడం కంటే.. దగ్గరి ప్రదేశాల్ని ఎంచుకుంటే ఇవన్నీ తప్పుతాయంటున్నారు. పైగా కొత్త జంటలకు మధురానుభూతుల్ని పంచే ప్రదేశాలు, జీవితాంతం నిలిచిపోయే జ్ఞాపకాల్ని అందించే డెస్టినేషన్స్‌ మన దేశంలోనే బోలెడున్నాయని సలహా ఇస్తున్నారు.

రెంటినీ బ్యాలన్స్‌ చేస్తూ..!

ఏ వెకేషన్‌ అయినా వెళ్లిన ప్రదేశాల్ని తనివి తీరా ఆస్వాదించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు కొందరు. ఈ క్రమంలో హోటల్‌/రిసార్ట్‌లో కాసేపైనా సేదదీరకుండా.. బయట తిరగడానికే ఆసక్తి చూపుతుంటారు. ఇక మరికొందరేమో.. అక్కడ చూడాల్సిన ప్రదేశాల్ని ఏదో అలా పైపైన కవర్‌ చేసేస్తూ.. ఎక్కువ సమయం గదిలో విశ్రాంతి తీసుకోవడానికే ఇష్టపడుతుంటారు. హనీమూన్‌కి వెళ్లే జంటలు ఈ రెండు పొరపాట్లూ చేయద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే అటు పూర్తిగా ప్రదేశాలు చూడడానికి పరిమితమైతే.. శారీరకంగా, మానసికంగా అలసిపోతారు.. తద్వారా ఇద్దరూ కలిసి ఏకాంతంగా మాట్లాడుకునే, గడిపే ఓపిక ఉండదు. అలాగే పూర్తిగా గదికే పరిమితమైతే.. బద్ధకం ఆవహిస్తుంది.. బోర్‌ ఫీలింగ్‌ వస్తుంది. కాబట్టి మీరు వెళ్లిన చోట చూడదగిన ప్రదేశాలకు, హోటల్‌ గదిలో మీకంటూ కాస్త ప్రైవసీగా గడపడానికి.. ఈ రెండింటినీ బ్యాలన్స్‌ చేసుకుంటేనే.. హనీమూన్‌ని పూర్తిగా ఎంజాయ్‌ చేయగలరు. తద్వారా ఇద్దరి మధ్య అనుబంధమూ దృఢమవుతుంది.

వీటికి విరామం వద్దు!

పెళ్లి హడావిడిలో మన ఆరోగ్యకరమైన జీవనశైలికి కాస్త బ్రేక్‌ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరైన పోషకాహారం తీసుకునే సమయం లేక, వ్యాయామానికి తగిన సమయం కేటాయించక.. ఇలా వీటి ప్రభావం ఆరోగ్యంపై పడచ్చు. ఇక ఇదే ఊపులో హనీమూన్‌ ప్లాన్‌ చేసుకున్నట్లయితే.. మీరు వెళ్లిన చోట తయారయ్యే ప్రత్యేకమైన రుచుల్ని ఆస్వాదించాలని మనసు లాగుతుంటుంది. దీనికి తోడు సైట్‌ సీయింగ్‌, మీ భాగస్వామితో సమయం గడిపే హడావిడిలో వ్యాయామం చేయడానికి శరీరం బద్ధకిస్తుంటుంది. ఇలా వీటన్నింటి వల్ల మనం రోజూ పాటించే ఆరోగ్యకరమైన జీవనశైలి అదుపు తప్పి లేనిపోని అనారోగ్యాల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి పెళ్లి హడావిడిలో కుదరకపోయినా.. హనీమూన్‌లోనైనా ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీరు వెళ్లిన ప్రదేశానికి సంబంధించిన రుచుల్లోనూ ఆరోగ్యకరమైన వాటికి ప్రాధాన్యమివ్వడం, భార్యాభర్తలిద్దరూ కలిసి రోజూ కాసేపు వ్యాయామం చేయడం.. వీటి వల్ల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ఇద్దరి మధ్య అనుబంధమూ దృఢమవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్