పదేళ్లుగా సరైన స్నానం లేదు..

ఓ అరగంట ఎండలో బయటకెళ్లొచ్చామంటే.. ఎప్పుడెప్పుడు ఇంటికెళ్లి స్నానం చేస్తామా... అనిపిస్తుంది. చెమట, మురికి పోతేనే... శరీరానికీ, మనసుకూ సాంత్వన కలుగుతుంది.

Updated : 22 Jun 2024 06:39 IST

ఓ అరగంట ఎండలో బయటకెళ్లొచ్చామంటే.. ఎప్పుడెప్పుడు ఇంటికెళ్లి స్నానం చేస్తామా... అనిపిస్తుంది. చెమట, మురికి పోతేనే... శరీరానికీ, మనసుకూ సాంత్వన కలుగుతుంది. ఈ హాయి మాత్రం ఆ అమ్మాయికి లేదు. నీటి అలర్జీ వల్ల ఈమె పదేళ్లుగా సరైన స్నానమే లేకుండా ఉంటోంది.

అమెరికాలోని దక్షిణ కరోలినాకు చెందిన లారెన్‌ మాంటెఫస్కో చిన్నప్పుడు అందరిలాంటి అమ్మాయే. నీళ్లతో ఆడుకునేది. మనసుకు నచ్చినంతసేపు స్నానం చేసేది. ఆమెకు 12 ఏళ్లున్నప్పుడు ఎప్పటిలాగే స్నానం చేసొస్తే... కాసేపటికి ఒళ్లంతా దురదలు మొదలయ్యాయి. ఏదో మామూలు అలర్జీ అనుకున్నారు ఇంట్లోవాళ్లంతా. ఆ తర్వాత దద్దుర్లు, మంటతో బాధపడేది. వైద్యులను సంప్రదిస్తే దీన్ని ‘ఆక్వాజెనిక్‌ ఉర్టికేరియా’ అన్నారు. అరుదుగా కనిపించే ఈ రకమైన అలర్జీలో శరీరంపై నీరు పడినప్పుడు చర్మంపై రియాక్షన్‌ మొదలవుతుంది. ‘మొదటిసారిగా ఈ సమస్యనెదుర్కొన్నప్పుడు సాధారణ అలర్జీ అనుకున్నాం. తీరా రోజురోజుకీ ఈ సమస్య పెరిగింది. వైద్యులను సంప్రదిస్తే అసలు విషయం తెలిసింది. దీనివల్ల తీవ్రమైన బాధ అనుభవించేదాన్ని. లక్షలమందిలో ఒకరికి వచ్చే అరుదైన సమస్య ఇది. దీనికంటూ సరైన చికిత్స లేదు. దాంతో నాకు నేనే దీన్ని తగ్గించుకొనే మార్గాల కోసం వెతకడం మొదలుపెట్టా. రోజూ స్నానం చేయాలనే విధానానికి దూరమయ్యా. అప్పుడప్పుడూ చేసినా... వీలైనంత త్వరగా స్నానాన్ని ముగిస్తున్నా. ఎక్కువసేపు నీటి ప్రభావం చర్మంపై పడకుండా జాగ్రత్తపడితే అలర్జీ తక్కువగా ఉంటుంది.  కొన్నిసార్లు మృదువైన వస్త్రాన్ని తడిపి ఒంటిని శుభ్రపరుచుకొని వెంటనే తడి ఆరిపోయేలా చేస్తుంటా. కొంతలో కొంత ఉపశమనం అనిపిస్తుంది. తలకు డ్రై షాంపు ఉపయోగించడంతో తక్కువ సమయంలో శుభ్రపడుతుంది. చెమట పట్టకుండా వీలైనంత చల్లని ప్రదేశాలను ఎంచుకోవడంతో ఈ అలర్జీకి దాదాపు దూరంగా ఉంటున్నా’నని చెబుతోంది లారెన్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్