Published : 26/12/2021 12:01 IST

కాబోయే జీవిత భాగస్వామిలో ఇవి గమనించారా?

పెళ్లంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడమన్నారు పెద్దలు. కానీ అంతకంటే ముందు చేసుకోబోయే వాడు ఎలాంటి వాడో తెలుసుకోమంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. ఎందుకంటే తరాల మాట ఎలా ఉన్నా.. జీవితాంతం కలిసి బతకాల్సింది మాత్రం భాగస్వామితోనే కదా! అయితే ఈ క్రమంలో చేసుకోబోయే భర్తలో కొన్ని ఇబ్బందికరమైన లక్షణాలుంటే మాత్రం నిర్మొహమాటంగా ‘నో’ చెప్పడంలో తప్పు లేదంటున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం రండి..

ఈ కాలంలో ప్రేమ పెళ్లిళ్లైనా, పెద్దలు కుదిర్చిన వివాహమైనా.. ఒకరి గురించి మరొకరు తెలుసుకునే అవకాశం పెళ్లికి ముందే దొరుకుతుంది. అయితే ఈ క్రమంలో అమ్మాయిలు తమకు కాబోయే వాడి ప్రవర్తన, అతడిలో కొన్ని అలవాట్లను పసిగట్టగలిగితే.. పెళ్లయ్యాక ఇబ్బంది పడే అవకాశం ఉండదంటున్నారు నిపుణులు.

మాట తప్పుతున్నారా?

ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తంటే ఎవరికైనా గౌరవమే! ముఖ్యంగా అమ్మాయిలు తమకు తగిన వరుడిని వెతుక్కునే క్రమంలో అతనిలో ఇలాంటి లక్షణం తప్పకుండా ఉండాలనుకుంటారు. అయితే ఇది మీరు చేసుకోబోయే భర్తలో ఉందో, లేదో ముందే తెలుసుకోవడం మంచిది. అలాగని సమయానికి వస్తానని రాకపోవడం, చేస్తానన్న పని చేయకపోవడం.. వంటి చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో పెట్టి చూడడం తగదు. ఇలా ఒకట్రెండు సందర్భాల్లో గమనిస్తే మీకిచ్చిన మాటలకు అతను ఎంత విలువిస్తున్నాడో అర్థమవుతుంది. అలాకాకుండా ప్రతి విషయంలోనూ మాట తప్పడం, మీకు చేసిన వాగ్దానాన్ని మర్చిపోయి/నిర్లక్ష్యం చేసి.. దాన్ని కవర్‌ చేసుకోవడానికి కల్లబొల్లి కబుర్లు చెప్పడం.. వంటివి చేశారంటే అలాంటి వ్యక్తిని అనుమానించడంలో తప్పు లేదంటున్నారు నిపుణులు.

అదుపాజ్ఞల్లో పెట్టుకుంటుంటే..!

‘ఎక్కడున్నావ్‌? ఏం చేస్తున్నావ్‌? వస్తానని రాలేదే? నువ్వు ఇలాగే ఉండాలి.. అలాంటి దుస్తులే వేసుకోవాలి..’ అంటూ తమకు కాబోయే భార్యను అదుపాజ్ఞల్లో పెట్టుకోవాలని చూస్తుంటారు కొంతమంది పురుషులు. నిజానికి కట్టుకోబోయే వాడే అయినా, కాబోయే భార్యే అయినా.. ఒకరికొకరు పరిమితులు విధించుకోవడం తగదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇష్టాయిష్టాలనేవి వ్యక్తిగతం. ఎదుటివారికి ఇబ్బంది కలగనంత వరకు ఎవరి ఇష్టాలకు వాళ్లను వదిలేయడమే మంచిది. అలాకాకుండా ప్రతి విషయం నా చెప్పుచేతల్లోనే జరగాలంటే మాత్రం అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకొని జీవితాంతం బాధపడడం కంటే ముందే సరైన నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. లేదంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు.

మిమ్మల్ని లెక్క చేయకపోతే..!

చాలామంది పురుషులు పెళ్లికి ముందు తమకు కాబోయే భాగస్వామిపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తుంటారు. వివాహమయ్యాక కూడా కొన్ని నెలల వరకు అది అలాగే కొనసాగుతుంది. ఆ తర్వాతే వాళ్ల అసలు స్వరూపం బయటపడుతుంది. మిమ్మల్ని కాదని సొంతంగా, లేదంటే ఇతరుల సహాయంతో నిర్ణయాలు తీసుకోవడం.. ఇతర కుటుంబ సభ్యుల ముందు మీరంటే లెక్కలేనట్లుగా ప్రవర్తించడం.. ఇలా భర్త తనకిచ్చే ప్రాధాన్యం తగ్గితే ఏ భార్యైనా సహించలేదు. ఈ క్రమంలో- మీకు, మీ అభిప్రాయాలకు ఎంతవరకు విలువ ఇస్తున్నారో పెళ్లికి ముందే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఇంతకు ముందు చెప్పుకొన్నట్లు- సాధారణంగా పెళ్లికి ముందు అందరూ బానే ఉండే నేపథ్యంలో- కాబోయే వారి ప్రవర్తన, వ్యక్తిత్వం మొదలైన అంశాల గురించి వారి స్నేహితుల ద్వారా పరోక్షంగా అయినా తెలుసుకునే ప్రయత్నం చేయాలి.

వాళ్లను గౌరవించట్లేదా?

పెళ్లంటే ఇద్దరు కాదు.. రెండు కుటుంబాలు కలవడం. ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవడం, మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడమే కాదు.. తమ అత్తింటి వారితోనూ గౌరవంగా మెలగాల్సి ఉంటుంది. అయితే కొంతమంది మగవాళ్లు.. ‘ఎలాగూ పెళ్లయ్యాక నా భార్య నా ఇంటికి వస్తుంది.. ఇక ఆమె కుటుంబ సభ్యులతో నాకేం పని..’ అన్న ధోరణిలో ఉంటారు. ఇదే ఆలోచనతో అసలు వాళ్లను పట్టించుకోకపోవడం, మాటల్లో-చేతల్లో వాళ్లను లెక్కచేయకపోవడం.. వంటివి చేస్తుంటారు. మీరు చేసుకోబోయే వాడు కూడా ఇలాంటి వాడా కాదా అన్న విషయం.. పెళ్లికి ముందు మీరిద్దరూ కలుసుకున్నప్పుడు తెలుసుకోవచ్చు. ఈ క్రమంలో మాటల మధ్యలో మీ కుటుంబ సభ్యుల ప్రస్తావన తీసుకురావడం, పెళ్లి తర్వాత కూడా వాళ్ల బాగోగులు చూసుకుంటానని చెప్పడం వంటివి చేసి చూడండి.. ఈ క్రమంలో వాళ్లు ప్రతిస్పందించే విధానంతో మీ కుటుంబానికి మీరు చేసుకోబోయే వ్యక్తి ఎంత గౌరవం ఇస్తున్నాడన్నది స్పష్టమవుతుంది. దాన్ని బట్టి మీరు సరైన నిర్ణయం తీసుకోవచ్చు.

వీటితో పాటు తెలిసి కూడా చేసిన పొరపాట్లే మళ్లీ మళ్లీ చేయడం, ప్రతి విషయంలోనూ అబద్ధాలాడడం, పరిణతి లేని మాటలు మాట్లాడడం, మీకు సంబంధించిన ఏ విషయమైనా సిల్లీగా/జోక్‌గా తీసుకోవడం, మీ అభిప్రాయాలు-నమ్మకాలకు గౌరవం ఇవ్వకపోవడం, మీరు పెట్‌ లవర్‌ అయి.. అతనికి పెట్స్‌ అంటే నచ్చకపోవడం.. ఇలాంటి విషయాలన్నీ కాబోయే భర్తలో తప్పకుండా గమనించాలంటున్నారు నిపుణులు. తద్వారా సరైన నిర్ణయం తీసుకొని ముందడుగు వేస్తే వైవాహిక జీవితంలో కలతల్లేకుండా జాగ్రత్తపడచ్చు.

అయితే ఈ కారణాలన్నీ చెప్పుకోవడానికి చాలా సిల్లీగా అనిపించచ్చు.. అలాగని తేలిగ్గా తీసుకొని తప్పటడుగు వేస్తే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి మీ భాగస్వామిలో ఏ లక్షణం/అలవాటు నచ్చకపోయినా.. ఒకరికొకరు మాట్లాడుకొని మార్చుకుంటే నిండు నూరేళ్ల అనుబంధాన్ని ఆనందంగా గడిపేయచ్చు!

అలాగే - ఇక్కడ చెప్పిన విషయాలన్నీ అమ్మాయిలకు, అబ్బాయిలకు ఇద్దరికీ వర్తిస్తాయి.. ఎవరైనా సరే- పెళ్లికి ముందు కాబోయే జీవిత భాగస్వామిలో ఈ లక్షణాలను ముందుగానే గమనించుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు.

మరి, పెళ్లికి ముందు మీరు మీ భాగస్వామిలో గుర్తించిన అలవాట్లేంటి? Contactus@vasundhara.net ద్వారా మాతో పంచుకోండి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని