Updated : 14/02/2023 19:22 IST

Pregnancy: ఈ పోషకాలు అందుతున్నాయా?

బిజీ లైఫ్‌స్టైల్‌ వల్ల చాలామంది మహిళలు రక్తహీనత, థైరాయిడ్‌, మధుమేహం.. వంటి దీర్ఘకాలిక అనారోగ్యాల్ని ఎదుర్కొంటున్నారు. ఇక గర్భం ధరించాక ఈ సమస్యలు వారికి, వారి కడుపులోని బిడ్డకు పెను శాపాలుగా మారుతున్నాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ముందు నుంచి పోషకాహారం తీసుకోవడంతో పాటు ప్రెగ్నెన్సీ సమయంలోనూ చక్కటి ఆహారపుటలవాట్లు అలవర్చుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

‘ఫైబర్‌’తో ఆ సమస్యకు చెక్!

గర్భం ధరించిన మహిళల్లో చాలామంది ఎదుర్కొనే సమస్య మలబద్ధకం. అయితే పీచు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్యను అధిగమించచ్చని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఇందుకోసం పప్పులు, బీన్స్‌, బఠానీ, బెర్రీ పండ్లు, నట్స్‌, డ్రైఫ్రూట్స్‌.. వంటివి రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే కొంతమంది సలాడ్స్‌లో భాగంగా పీచు ఎక్కువగా ఉండే క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌.. వంటివి పచ్చిగానే తీసుకుంటుంటారు. ఇలా వీటిని పచ్చిగానే తీసుకోవడం వల్ల వీటిలో ఉండే కొన్ని రకాల సమ్మేళనాలు విచ్ఛిన్నం చెందక కడుపులో గ్యాస్ట్రిక్‌ సమస్యకు కారణమవుతాయి. అందువల్ల వీటిని ఉడికించి తీసుకోవాలి.. ఫలితంగా అవి త్వరగా జీర్ణమయ్యే అవకాశం ఉంటుంది.

క్యాల్షియం కోసం..!

పుట్టబోయే బిడ్డ ఎముకల్ని దృఢంగా తయారుచేసేందుకు క్యాల్షియం సహకరిస్తుంది. గర్భం ధరించిన మహిళలు, పాలిచ్చే తల్లులు.. తల్లీబిడ్డలిద్దరి శారీరక అవసరాలను దృష్టిలో ఉంచుకొని క్యాల్షియం తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇందుకోసం పాలు, పాల పదార్థాలు, ఆకుకూరలు, గుడ్లు, సపోటా, చేపలు.. వంటివి తల్లులు తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలి. అయితే ఒకవేళ తల్లి వీగన్‌ అయితే.. పాలకు బదులుగా సోయా పాలు, డ్రైఫ్రూట్స్‌, బ్రకలీ, ఆకుకూరలు.. వంటివి తప్పనిసరిగా డైట్‌లో చేర్చుకోవాలి.

‘ఐరన్‌’ లోపం లేకుండా..!

కాబోయే తల్లుల్లో ఐరన్‌ లోపం వల్ల రక్తహీనత తలెత్తడం మనం చాలా సందర్భాల్లో వినే ఉంటాం. తద్వారా నెలలు నిండకుండానే బిడ్డ పుట్టడం, అది కూడా తక్కువ బరువుతో పుట్టడం, ఒక్కోసారి తల్లుల్లో ఉండే ఈ రక్తహీనత బిడ్డకు ప్రాణాంతకం కావడం.. వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ముందు నుంచే ఐరన్‌ లోపం లేకుండా చూసుకోమని నిపుణులు సలహా ఇస్తుంటారు. ఈ క్రమంలోనే ఆప్రికాట్స్‌, కోడిగుడ్లలోని పచ్చసొన, చేపలు, డ్రైఫ్రూట్స్‌, ఆకుకూరలు, ఆకుపచ్చటి కాయగూరలు, ఓట్స్‌, చిరుధాన్యాలు, గోధుమలు.. వంటివి తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి. అయితే మాంసం ద్వారా లభించే ఐరన్‌ కంటే కాయగూరలు, పండ్ల ద్వారా వచ్చే ఐరన్‌ను శరీరం త్వరగా గ్రహిస్తుంది. కాబట్టి మాంసం, గుడ్లు.. వంటివి తీసుకున్నప్పటికీ వాటిని కాయగూరలతో కలిపి తీసుకుంటే శరీరానికి ఐరన్‌ను త్వరగా గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది. ఒకవేళ మీకు మరీ రక్తహీనత ఎక్కువగా ఉంది.. సప్లిమెంట్స్‌, ఇంజెక్షన్స్‌ వాడాలనుకుంటే మాత్రం వైద్యుల సలహా మేరకే వాడాలన్న విషయం గుర్తుపెట్టుకోండి.

ఇవి కూడా!

⚛ పుట్టబోయే బిడ్డ నాడీ వ్యవస్థ అభివృద్ధిలో అయొడిన్ పాత్ర కీలకం. గర్భిణిగా ఉన్న సమయంలో తల్లులు రోజుకు తగినంత అయొడిన్‌ను తీసుకోవడం వల్ల బిడ్డలు చిన్నతనం నుంచే అద్భుతమైన తెలివితేటల్ని కలిగి ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం జున్ను, పెరుగు, బంగాళాదుంపలు.. వంటి అయొడిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే చేపలు వంటి సముద్రపు ఆహారం తీసుకున్నా వారానికి పావు కిలో కంటే మించకుండా చూసుకోవడం మంచిదన్నది నిపుణుల సలహా!

⚛ కడుపులో పెరుగుతోన్న బిడ్డ మెదడు, వెన్నెముకలో ఎలాంటి లోపాలు లేకుండా ఉండాలంటే తల్లులు ముందు నుంచే ఫోలికామ్లం అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. ఇందుకోసం ఆకుకూరలు, బ్రకలీ, తర్బూజా, నట్స్‌, బీన్స్‌.. వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే వీటితో పాటు వైద్యుల సలహా మేరకు ఫోలికామ్లం సప్లిమెంట్స్‌ని కూడా వాడాల్సి ఉంటుంది.

⚛ గర్భం ధరించిన మహిళలు రోజూ 80-85 మిల్లీగ్రాముల విటమిన్‌ ‘సి’ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో టొమాటో, ద్రాక్ష, నిమ్మజాతి పండ్లు, క్యాప్సికం, కివీ.. వంటివి ఆహారంలో చేర్చుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని