Published : 24/03/2023 20:46 IST

అందుకే మధ్యాహ్నం పూట కునుకు.. మంచిదట!

సంపూర్ణ ఆరోగ్యానికి రాత్రుళ్లు ఎనిమిది గంటలు నిద్రపోతే చాలనుకుంటారు చాలామంది. కానీ రాత్రి సుఖనిద్రకు తోడు మధ్యాహ్నం భోజనం తర్వాత కాసేపు కునుకు కూడా ముఖ్యమే అంటున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌. అయితే చాలామంది వృత్తిఉద్యోగాలు, వ్యక్తిగత పనుల రీత్యా మధ్యాహ్నం నిద్రను త్యాగం చేస్తుంటారు. కానీ ఎక్కడున్నా, ఏం చేస్తున్నా.. ఓ అరగంట విరామమిచ్చి కునుకు తీయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయంటున్నారామె. ఇంతకీ, ఏంటవి? మధ్యాహ్నం ఎప్పుడు, ఎంతసేపు నిద్రపోతే మంచిది? ఈ క్రమంలో గుర్తుంచుకోవాల్సిన విషయాలేంటి? తదితర అంశాలపై తాజాగా రుజుత పెట్టిన పోస్ట్‌ ఏంటో తెలుసుకుందాం రండి..

మధ్యాహ్నం నిద్ర పోతే రాత్రి సరిగ్గా నిద్రపట్టదనుకునే వారు ఎంతోమంది! ఇక మరికొందరు ఆఫీస్‌లో ఉండడం, ఇంట్లో పనులతో తీరిక లేకుండా గడపడంతో.. కునుకు తీసేందుకు వారికి సమయమే దొరకదు. నిజానికి మధ్యవయసులో ఉన్న వారికి మధ్యాహ్నం నిద్ర ఎంతో మేలని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల సోమరితనం తగ్గి.. చేసే పనులపై మరింత శ్రద్ధ పెట్టగలుగుతాం. ఇలా కాసేపు కునుకు తీయడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు ఉత్సాహం, పనిలో నాణ్యత ప్రదర్శించగలుగుతామంటున్నారు రుజుత.

ఎందుకు మంచిది?

మధ్యాహ్నం భోజనం చేశాక కాసేపు నిద్రపోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతున్నవారు, ఇప్పటికే గుండె సమస్యలకు సంబంధించిన చికిత్సలు తీసుకుంటున్న వారికి మరింత మేలు!

శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల పీసీఓఎస్‌, థైరాయిడ్‌, మధుమేహం, స్థూలకాయం.. వంటి దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతుంటాయి. ఇలాంటి వారు మధ్యాహ్నం కాసేపు కునుకు తీయడం వల్ల హార్మోన్లు సమతులమై.. తద్వారా ఆయా సమస్యలు అదుపులో ఉంటాయి.

ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల కడుపుబ్బరం, మలబద్ధకం, గ్యాస్ట్రిక్‌ సమస్యలు.. వంటివి సహజం. అయితే వీటికి చెక్‌ పెట్టి జీర్ణశక్తిని పెంచడంలో మధ్యాహ్నం నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది.

విశ్రాంతి లేకుండా పని చేయడం, మధ్యాహ్నం నిద్రను త్యాగం చేయడం వల్ల మనకు తెలియకుండానే ఒత్తిడికి గురవుతాం. దీని ప్రభావం అందంపై పడుతుంది. మొటిమలు, చుండ్రుకు కారణమవుతుంది. కాబట్టి భోజనం తర్వాత కాసేపు కునుకు తీయడం వల్ల ఒత్తిడి దరిచేరకుండా సౌందర్యాన్నీ కాపాడుకోవచ్చు.

మధ్యాహ్నం నిద్ర వల్ల రాత్రి నిద్రకు ఎలాంటి అంతరాయం కలగదు. పైగా ఇది రాత్రి నిద్రను ప్రేరేపిస్తుంది. నిద్రలేమితో ఇబ్బంది పడుతున్న వారు, పదే పదే ప్రయాణాల్లో అలసిపోయిన వారు, పండగలు-ఫంక్షన్లతో తీరిక లేకుండా గడిపే వారికి ఈ కునుకు మరింత సాంత్వన చేకూర్చుతుంది.

కొంతమంది వ్యాయామాలతో అలసిపోతుంటారు.. మరికొందరు ఆరోగ్య సమస్యలతో నీరసిస్తుంటారు. ఇలాంటి వారు మధ్యాహ్నం కాసేపు కునుకు తీయడం వల్ల శరీరం పునరుత్తేజితమవుతుంది.. అలాగే ఆయా సమస్యల నుంచీ త్వరగా బయటపడగలుగుతారు.

మధ్యాహ్నం నిద్ర వల్ల ఓవైపు శారీరక సమస్యలు తగ్గడం, మరోవైపు మానసిక ప్రశాంతత చేకూరడంతో శరీరంలో అదనపు కొవ్వులు కూడా కరుగుతాయి.

ఆఫీస్‌లో ఉన్నా ఇతర పనుల్లో నిమగ్నమైనా సరే.. మధ్యాహ్నం భోజనం తర్వాత కాసేపు నిద్రపోవడం వల్ల పనిలో ఉత్పాదకత పెరుగుతుందని పలు అధ్యయనాల్లో రుజువైంది.


ఎప్పుడు? ఎంతసేపు?

చేసే పనిలో సత్ఫలితాలు రావాలంటే.. దాన్ని సరైన పద్ధతిలో చేయడమూ ముఖ్యమే. మధ్యాహ్నం నిద్రకూ ఇది వర్తిస్తుంది. ఈ క్రమంలో ఏ సమయంలో, ఎంతసేపు, ఏ పొజిషన్‌లో నిద్రపోవాలో కూడా ముఖ్యమే! ఈ పద్ధతినే ‘వామకుక్షి’ అంటారు. ఇందులో భాగంగా..

మధ్యాహ్నం భోజనం పూర్తయ్యాక 1-3 గంటల్లోపు ఎప్పుడైనా నిద్రకు ఉపక్రమించచ్చు.

అయితే అది కూడా పెద్దలకు 10-30 నిమిషాలు, చిన్నపిల్లలకు/వృద్ధులకు/అనారోగ్యాలతో బాధపడుతోన్న వారికి 90 నిమిషాల నిద్ర సరిపోతుంది.

ఇంట్లో ఉన్న వారు మంచంపై కునుకు తీయచ్చు.. ఈ క్రమంలో ఎడమవైపుకి తిరిగి కడుపులోని పిండం మాదిరిగా ముడుచుకొని పడుకోవాలి. ఇక ఆఫీస్‌లో ఉన్న వారు ఆఫీసు నిబంధనలు అనుమతించినట్లయితే భోజన విరామ సమయంలో తమ ముందున్న డెస్క్‌పై తలవాల్చి నిద్రించచ్చు..

ఇక ఈ సౌకర్యం కూడా లేనివారు.. సౌకర్యవంతంగా ఉన్న కుర్చీలో కూర్చొని కునుకు తీయచ్చు.

‘అసలు మాకు నిద్రపోవడం కుదరనే కుదరదు..’ అంటారా? అందుకూ ఓ ప్రత్యామ్నాయ మార్గముంది. ఓ కిటికీ దగ్గర నిల్చొని అల్లంత దూరాన ఉన్న ఆకాశాన్ని చూడండి.. మనసుకు విశ్రాంతి దొరుకుతుంది.. శరీరంలో కొత్త ఉత్సాహం జనిస్తుంది.


ఇలా చేయద్దు!

ఇలా మధ్యాహ్నం నిద్ర విషయంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలే కాదు.. చేయకూడని పనులూ కొన్నున్నాయి. అవేంటంటే..!

రోజంతా తీరిక లేకుండా గడిపి కొంతమంది సాయంత్రం పూట కునుకు తీస్తుంటారు. ఇది మంచిది కాదు. ముఖ్యంగా సాయంత్రం 4-7 గంటల మధ్యలో అస్సలు నిద్రపోకూడదు.

భోజనం చేశాక కొంతమందికి టీ, కాఫీ తాగడం, చాక్లెట్స్‌ తినడం అలవాటుంటుంది. వీటివల్ల నిద్రా భంగం అవడంతో పాటు శారీరకంగా, మానసికంగా ప్రతికూల ప్రభావం పడుతుంది.

మొబైల్‌, టీవీ చూస్తూ నిద్రపోవడం కొంతమందికి అలవాటు. కానీ దీనివల్ల నిద్రాభంగం కలగడంతో పాటు ఒత్తిడీ పెరుగుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని