Published : 13/12/2022 19:59 IST

మృదువైన చర్మానికి ఓట్స్..!

పోషకాహారంగా పేరొందిన ఓట్స్.. సౌందర్య పోషణలోనూ ఎంతగానో ఉపకరిస్తాయి. అలసిన చర్మానికి విశ్రాంతినివ్వడంలోనూ, మంచి ఫేస్‌వాష్‌గానూ.. ఇలా బ్యూటీ పరంగా చాలా రకాలుగా ఓట్స్ ఉపయోగపడతాయి.

దుమ్ము, ధూళి మటుమాయం..

ఓట్‌మీల్ మంచి ఫేస్‌వాష్‌గానూ పనిచేస్తుంది. గోరువెచ్చటి నీటిలో కొంచెం ఓట్స్ కలిపి పేస్ట్‌లాగా చేయాలి. దీనిలో ఒక టీస్పూన్ తేనె వేసి.. ఈ మిశ్రమంతో ముఖంపై గుండ్రంగా రుద్దాలి. దీంతో ముఖంపై ఉండే దుమ్ము, ధూళి కణాలు తొలగిపోయి నీట్‌గా తయారవుతుంది. అలాగే ఇందులో వేసిన తేనెలోని యాంటీబ్యాక్టీరియల్ గుణాల వల్ల చర్మం కాంతివంతమవుతుంది.

చర్మానికి విశ్రాంతి..

మనం రోజూ ఎన్నో పనులతో అలసిపోతుంటాం.. ఇలాంటి సమయంలో గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేస్తే ఎంతో హాయిగా ఉంటుంది. కేవలం గోరువెచ్చటి నీళ్లతో మాత్రమే స్నానం చేయకుండా.. అందులో ఒక కప్పు ఓట్స్, కొన్ని చుక్కల లావెండర్ నూనె, చిటికెడు ఎండు లావెండర్.. ఈ మూడింటినీ వేయాలి. ఈ మిశ్రమంతో స్నానం చేస్తే శరీరానికి హాయిగా ఉండడమే కాదు.. ఇందులో ఉండే ఓట్‌మీల్ చర్మాన్ని శుభ్రం చేయడంతో పాటు తేమ నిలిచి ఉండేలా చేస్తుంది. అలాగే లావెండర్ చర్మాన్ని సువాసనభరితం చేస్తుంది.

అలర్జీ తగ్గడానికి..

కొంతమందికి చర్మం పొడిబారిపోయి దురద పెడుతూ ఉంటుంది. దీనికి కారణం చర్మంలో తేమ శాతం తగ్గిపోవడం, పీహెచ్ స్థాయులు పెరగడం. కాబట్టి స్నానం చేసే నీటిలో ఓట్స్ కలుపుకోవడం వల్ల చర్మం తేమగా తయారవడంతోపాటు, పీహెచ్ సాధారణ స్థాయికి చేరుకుంటుంది. దీనివల్ల చర్మంపై ఏర్పడిన దురదలు, ఎలర్జీలు తగ్గే అవకాశం ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని