Omicron: చంటి పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ఒమిక్రాన్ వేగంగా విజృంభిస్తోంది. దీంతో మళ్లీ ఆందోళన మొదలవుతోంది.  టీకా తీసుకున్నవారు సైతం వైరస్ బారిన పడుతున్న సంఘటనలు వింటూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో- రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండడం ఎంతో అవసరం.

Published : 23 Jan 2022 14:52 IST

ఒమిక్రాన్ వేగంగా విజృంభిస్తోంది. దీంతో మళ్లీ ఆందోళన మొదలవుతోంది.  టీకా తీసుకున్నవారు సైతం వైరస్ బారిన పడుతున్న సంఘటనలు వింటూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో- రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండడం ఎంతో అవసరం. ప్రత్యేకించి పసి పిల్లల విషయంలో కూడా తల్లులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ క్రమంలో- చంటి పిల్లలను కాపాడుకునేందుకు తల్లులు ఏం చేయాలో తెలుసుకుందాం రండి..

చేతులు శుభ్రం చేసుకోండి!

చిన్నారులకు రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వారు త్వరగా వైరస్‌, బ్యాక్టీరియా లాంటి వ్యాధికారక క్రిముల బారిన పడే ప్రమాదం ఉంది. అయితే కరోనా కట్టడి కోసం పెద్దలు మాస్క్‌ ధరించినట్లు చిన్న పిల్లలు ధరించలేరు. కాబట్టి చంటి పిల్లల ఆరోగ్యం విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. చంటి బిడ్డలు సాధ్యమైనంతవరకు ఎక్కువగా తల్లుల దగ్గరే ఉంటారు. కాబట్టి తమ చిన్నారుల ఆరోగ్యం విషయంలో తల్లులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. చిన్నారికి పాలు పట్టేముందు, పాలు పట్టాక చేతులు శుభ్రం చేసుకోవాలి. డైపర్లు మార్చేటప్పుడు, పెంపుడు జంతువులను తాకిన తర్వాత కూడా కనీసం 20 సెకన్ల పాటు హ్యాండ్‌వాష్‌తో చేతులు కడుక్కోవాలి. మధ్యమధ్యలో చేతులకు శానిటైజర్‌ రాసుకుంటూ ఉండాలి. తల్లితో పాటు ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ ఈ జాగ్రత్తలను పాటించాల్సిందే. ఎవరైనా సరే.. పాపాయిని చేతిలోకి తీసుకొనే ముందు తమ చేతుల్ని శుభ్రం చేసుకోవాలన్న విషయం మరవకూడదు. ఇక పిల్లలు కూడా నిరంతరం ఇంట్లో పాకడం, నేలపైనే పడుకోవడం, బొమ్మలతో ఆడుకోవడం.. వంటివి చేస్తుంటారు. కాబట్టి వారి చేతులను కూడా ఎప్పటికప్పుడు శానిటైజర్‌తో శుభ్రం చేయాలి.

డైపర్లను మారుస్తూ ఉండండి!

కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకోకూడదంటే చిన్నారి వ్యక్తిగత శుభ్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. కనీసం 2-3 గంటలకోసారి చంటి బిడ్డల డైపర్లను మారుస్తూ ఉండాలి. ఇక పాపాయికి స్నానం చేయించాక ఉపయోగించే టవల్‌ను కూడా ఎప్పటికప్పుడు వేడి నీళ్లలో ఉతికి ఎండలో ఆరేయడం ఉత్తమం. తద్వారా ఎలాంటి వ్యాధికారక క్రిములు దరిచేరవు. ఇక ఇంటి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా చిన్నారులు తిరిగే పరిసరాలను క్రిమి సంహారక మందులతో క్లీన్‌ చేస్తే వైరస్‌, బ్యాక్టీరియా లాంటి సూక్ష్మక్రిములు నశిస్తాయి.

దుస్తులను వేరుగా ఉంచండి!

ఇక చంటిపిల్లల దుస్తుల విషయంలో కూడా తల్లులు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల దుస్తులను క్రమం తప్పకుండా మారుస్తూ ఉండండి. ఇక చిన్న పిల్లల దుస్తులను పెద్దల దుస్తులతో కలపకుండా ప్రత్యేకంగా ఉంచడమే మంచిది. ఎందుకంటే ఒకరి దుస్తుల నుంచి మరొకరి దుస్తుల్లోకి వ్యాధికారక సూక్ష్మజీవులు వ్యాపించే ప్రమాదం ఉంది. ఇక పిల్లల దుస్తులను శుభ్రం చేసే విషయంలో ఎలాంటి రసాయనాలు లేని బేబీ లాండ్రీ డిటర్జెంట్స్‌ను వినియోగిస్తే చాలా మంచిది.

పెరిగే గోళ్లతో ప్రమాదమే!

‘గోటి విషం ప్రమాదకరం’ అంటుంటారు. అందుకే అటు పాపాయి గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరిస్తూనే.. ఇటు కుటుంబ సభ్యులు కూడా తమ గోళ్లు పెరగకుండా జాగ్రత్తపడాలి. తద్వారా గోళ్లలో మురికి చేరుతుంది, దాని ద్వారా బ్యాక్టీరియా, క్రిములు పాపాయి శరీరంలోకి ప్రవేశిస్తాయన్న భయం ఉండదు. అదేవిధంగా వారు మాటిమాటికీ వేళ్లను నోట్లో పెట్టకుండా ఓ కంట కనిపెడుతూ ఉండాలి.

ఇవి కూడా!

* మళ్లీ వైరస్‌ వ్యాప్తి తగ్గేంత వరకూ పిల్లల్ని బేబీ వాకర్‌లో కూర్చోబెట్టుకొని అలా వాకింగ్‌ అంటూ బయటికి వెళ్లకపోవడమే మంచిది.

* పాలు తాగే చిన్నారులైతే.. తల్లిపాలు పట్టాలి. ఈ క్రమంలో తల్లి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ఎంతో అవసరం. అలాకాకుండా ఘనాహారం తినే పిల్లలకైతే పిల్లల ఆరోగ్య నిపుణులు సూచించిన పౌష్టికాహారం అందించాలి.

* పిల్లల్లో జలుబు, దగ్గు.. వంటి లక్షణాలుంటే అంతకుముందు మీ పిల్లల కోసం వాడిన మందులు కాకుండా.. ఓసారి మీకు దగ్గర్లో ఉండే పిల్లల వైద్య నిపుణులను సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్