‘పంచ్‌’లు విసరడానికి బదులు పార్కింగ్‌ టికెట్లు అమ్ముతోంది!

మీరాబాయి చాను, లవ్లీనా, రాణి రాంపాల్‌, పీవీ సింధు... కాసింత ప్రోత్సాహం అందిస్తే క్రీడల్లో ఎంతటి సంచలనాలు సృష్టిస్తారో టోక్యో ఒలింపిక్స్‌ వేదికగా మరోసారి నిరూపించారీ అమ్మాయిలు. ఈ పరిస్థితుల్లో ఆటలో అద్భుత నైపుణ్యం ఉన్నా ప్రోత్సాహం లేకపోవడంతో ప్రపంచ వేదికలపై మెరవాల్సిన ఓ యువ క్రీడా కుసుమం రోడ్డున పడింది. పొట్టకూటి కోసం పార్కింగ్‌ టికెట్లు విక్రయిస్తోంది. ఇంతకీ ఎవరామె? ఎందుకీ దీన పరిస్థితి దాపురించిందో తెలుసుకుందాం రండి..

Published : 10 Aug 2021 17:43 IST

(Image for Representation)

మీరాబాయి చాను, లవ్లీనా, రాణి రాంపాల్‌, పీవీ సింధు... కాసింత ప్రోత్సాహం అందిస్తే క్రీడల్లో ఎంతటి సంచలనాలు సృష్టిస్తారో టోక్యో ఒలింపిక్స్‌ వేదికగా మరోసారి నిరూపించారీ అమ్మాయిలు. ఈ పరిస్థితుల్లో ఆటలో అద్భుత నైపుణ్యం ఉన్నా ప్రోత్సాహం లేకపోవడంతో ప్రపంచ వేదికలపై మెరవాల్సిన ఓ యువ క్రీడా కుసుమం రోడ్డున పడింది. పొట్టకూటి కోసం పార్కింగ్‌ టికెట్లు విక్రయిస్తోంది. ఇంతకీ ఎవరామె? ఎందుకీ దీన పరిస్థితి దాపురించిందో తెలుసుకుందాం రండి..

తండ్రి జబ్బు పడడంతో...

రితు... చండీగఢ్‌కు చెందిన ఈ యువ బాక్సర్‌ మూడేళ్ల క్రితం వరకు బాక్సింగ్‌ రింగ్‌లోనే ఎక్కువగా కనిపించేది. అంతకుముందు జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని పలు పతకాలు కూడా సాధించింది. ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా ఎదగాలని ఎన్నో కలలు కూడా కంది. అయితే అదే సమయంలో రితు తండ్రి రామ్‌ అవతార్‌ జబ్బుతో మంచాన పడ్డాడు. దీంతో పాటు ఆమె ఆశయం కూడా మూలన పడింది. అప్పటిదాకా పతకాలు సాధిస్తే ఆమెను ప్రశంసించిన ప్రభుత్వాలు, సాయం కోసం చేతులు చాపితే మాత్రం పట్టించుకోలేదు. ఎక్కడ డబ్బులు అడుగుతుందోనని సొంత మనుషులు కూడా దూరమయ్యారు.

పదేళ్ల వయసు నుంచే!

పదేళ్ల వయసులోనే బాక్సింగ్‌పై ఆసక్తి పెంచుకుంది రితు. ఆ తర్వాత స్కూల్‌ పీఈటీ సహకారంతో మరింత రాటుదేలింది. ఈ క్రమంలోనే 2016లో చండీగఢ్‌ యూటీ అడ్మినిస్ట్రేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్‌ స్కూల్‌ కాంపిటీషన్‌లో బంగారు పతకం గెల్చుకుంది. ఆ వెనువెంటనే ఓపెన్‌ ఇంటర్‌ స్కూల్‌ టోర్నమెంట్‌లో వెండి పతకం సాధించింది. ఇక అదే ఏడాది తెలంగాణలో జరిగిన నేషనల్‌ స్కూల్‌ గేమ్స్లో కాంస్య పతకాన్ని కూడా ముద్దాడింది. ఇదే టోర్నీలో వాలీబాల్‌, కుస్తీ పోటీల్లోనూ రితు పాల్గొనడం విశేషం.

అందుకే బాక్సింగ్‌ను వదిలేశాను!

‘నాకు చిన్నప్పటి నుంచి బాక్సింగ్‌, వాలీబాల్‌, కుస్తీ పోటీలంటే ఎంతో ఇష్టం. అయితే మా స్కూల్‌ పీఈటీ సలహాతో బాక్సింగ్ పైనే పూర్తి దృష్టి సారించాను. నేను బాక్సింగ్‌ రింగ్‌లోకి ప్రవేశించినప్పుడు కుటుంబమంతా నాకు తోడుగా నిలిచింది. వారి సహకారంతోనే స్కూల్‌ నేషనల్స్‌ స్థాయి వరకు వెళ్లగలిగాను. అయితే 2017లో నాన్న జబ్బు పడ్డాడు. ఆయన కష్టపడి రిక్షా తొక్కితే కానీ మాకు మూడు పూటలా తిండి దొరికేది కాదు. అలాంటిది ఆయన పూర్తిగా మంచానికే పరిమితం కావడంతో నా చదువుతో పాటు బాక్సింగ్‌ను పక్కన పెట్టేయాల్సి వచ్చింది. స్పోర్ట్స్‌ కోటాలో ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని ప్రయత్నించాను. ఆర్మీ, బిహార్‌ పోలీసు...చివరకు హోంగార్డు పోస్టు కోసం కూడా దరఖాస్తు చేశాను. అయినా ఫలితం లేదు.’

మళ్లీ రింగ్‌లోకి దిగాలని ఉంది!

‘బాక్సింగ్‌లో నేను రాణిస్తున్నప్పుడు కుటుంబమంతా నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించింది. ఇప్పుడు నా కుటుంబ పరిస్థితి ఏం బాగోలేదు. నేను ఎన్నో పతకాలు సాధించినా ఎవరూ ఎలాంటి ప్రోత్సాహకాలు, స్కాలర్‌షిప్‌లు ఇవ్వలేదు. అనారోగ్యంతో ఉన్న నాన్నను బతికించుకోవడానికే.. ఇలా ఏడాది నుంచి పార్కింగ్‌ అటెండెంట్‌గా పని చేస్తున్నాను. రోజంతా కష్టపడితే 350 రూపాయలు వస్తున్నాయి. నా ముగ్గురు సోదరులు కూడా దినసరి కార్మికులుగా పని చేస్తున్నారు. ఇలా మేమంతా కష్టపడితేనే కానీ మా కుటుంబం కడుపు నిండదు. ఇప్పటికీ నాకు బాక్సింగ్‌ రింగ్‌లో దిగాలని, దేశం తరఫున పతకాలు సాధించాలని ఉంది. అందుకు ప్రభుత్వమే నాకు సహాయ సహకారాలు అందించాలి’ అని రితు ప్రార్థిస్తోంది.

బాక్సింగ్‌ రింగ్‌లో పంచ్‌లు కురిపించాల్సిన రితు రోడ్డుపై పార్కింగ్‌ టికెట్లు అమ్ముకోవాల్సి రావడం పలువురినీ కదిలిస్తోంది. సోషల్‌ మీడియాలో ఆమె ఫొటోలు వైరల్‌గా మారాయి.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్