Published : 06/02/2023 20:55 IST

వెన్నని ఇలా కూడా వాడచ్చు!

వివిధ రకాల ఆహారపదార్థాలకు రుచిని అందించడానికి మనం వెన్నను ఉపయోగిస్తాం. అయితే కేవలం ఆహార పదార్థాల్లో వాడడానికే కాదు... దైనందిన జీవితంలో వెన్న వల్ల ఇతరత్రా ఉపయోగాలెన్నో ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

చాలా సందర్భాల్లో తలుపు వేస్తున్నప్పుడు తీస్తున్నప్పుడు కిర్‌ర్..మనే శబ్దం వస్తూ ఉంటుంది. దీన్ని పోగొట్టడానికి కొద్దిగా బటర్‌ని మడత బందులకు రాస్తే.. ఇక శబ్దం రాకుండా ఉంటుంది.

ప్లాస్టిక్ వస్తువులపై అయిన మరకలు వదలగొట్టాలంటే కష్టమే. ఇలాంటి సందర్భాల్లో బటర్‌ని ఉపయోగిస్తే వాటిని చాలా సులభంగా పోగొట్టచ్చు. దీనికోసం మరక ఏర్పడిన చోట కొద్దిగా వెన్న రాసి 20-40 నిమిషాల పాటు అలాగే ఉంచేయాలి. ఆ తర్వాత వస్త్రంతో తుడిచేస్తే మరక వదిలిపోతుంది.

చేతులకు అంటుకున్న జిగురు(గ్లూ)ని వదలగొట్టడం అంత సులభమేమీ కాదు. కొన్ని సందర్భాల్లో అయితే శుభ్రం చేసేటప్పుడు చర్మం కూడా వూడిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు చేతులను శుభ్రం చేసుకొనే ముందు బటర్ రాసుకోవడం ద్వారా గ్లూని సులభంగా వదిలించుకోవచ్చు.

చేపలు శుభ్రం చేసిన తర్వాత వాటిని ఉంచిన పాత్రల నుంచి వచ్చే నీచు వాసన ఓ పట్టాన పోదు. ఇలాంటప్పుడు వాసన వచ్చే పాత్రలను కొద్దిగా వెన్నతో తోమాలి. ఆ తర్వాత సబ్బు ఉపయోగించి గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే పాత్రల నుంచి నీచు వాసన రాకుండా ఉంటుంది.

రోజూ రాత్రి నిద్రపోయే ముందు గోళ్లకు కొద్దిగా బటర్ రాస్తే అవి ఆరోగ్యంగా పెరుగుతాయి.

అందం విషయంలోనూ వెన్న చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇది పొడిబారిన చర్మాన్ని తిరిగి తేమగా మారుస్తుంది. దీనికోసం కొద్దిగా బటర్‌ని చర్మానికి రాసుకొని తేలికపాటి సబ్బుతో రుద్ది శుభ్రం చేసుకోవాలి.

కొన్ని కొన్ని సందర్భాల్లో వేలికి ఉన్న ఉంగరాలు బిగుతుగా మారుతుంటాయి. ఇలాంటప్పుడు ఆయా వేళ్లకు కొద్దిగా వెన్న రాసి తీస్తే అవి సులభంగా వచ్చేస్తాయి.

సగం కోసిన ఉల్లిపాయలు పాడవకుండా ఉండాలంటే దానిపై కొద్దిగా వెన్నని రాయాలి. ఇలా చేస్తే ఉల్లిపాయ త్వరగా ఎండిపోకుండా ఉంటుంది.

చెక్క వస్తువులపై ఏర్పడిన నీటి మరకలు తొలగించడానికి రాత్రి సమయంలో కొద్దిగా వెన్న రాసి మరుసటి రోజు ఉదయం శుభ్రం చేస్తే సరిపోతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని