చక్కెరతో.. ఎన్నో రకాలుగా..!

నిత్య జీవితంలో చక్కెర పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే కేవలం ఆహార పదార్ధాల్లోనే కాకుండా ఇతరత్రా వివిధ సందర్భాలలో చక్కెరను ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు. ఎలా అంటారా? మీరే చదవండి..

Published : 19 Jun 2024 12:19 IST

నిత్య జీవితంలో చక్కెర పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే కేవలం ఆహార పదార్ధాల్లోనే కాకుండా ఇతరత్రా వివిధ సందర్భాలలో చక్కెరను ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు. ఎలా అంటారా? మీరే చదవండి..

దుర్వాసనను పోగొట్టడానికి..

మిక్సీ జార్లు, కాఫీ గ్రైండర్స్, ఇతర డబ్బాలు.. వంటివన్నీ ఎక్కువ రోజులు వాడకుండా మూతపెట్టి అలాగే ఉంచడం వల్ల కొన్ని రోజులకు వాటి నుంచి అదో రకమైన వాసన వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఆ వాసనను తొలగించడానికి చక్కెర బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం కాఫీ గ్రైండర్స్, మిక్సీ జార్ల.. వంటి వాటిలో పావు కప్పు చక్కెర వేసి కాసేపు గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత కడిగేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల అందులోని వాసనను చక్కెర గ్రహిస్తుంది. ఇక ఇతర డబ్బాల విషయంలో అయితే ఒక టీస్పూన్ చక్కెరను వాటిలో వేసి మూత పెట్టాలి. తిరిగి ఆ బాక్సులను ఉపయోగించుకునే ముందు శుభ్రంగా కడిగితే వాటి నుంచి ఎలాంటి వాసన రాకుండా ఉంటుంది.

మరకలు మాయం..!

చేతులకు గ్రీజు అంటుకున్నప్పుడు ఒక్కోసారి ఎంత కడిగినా వదలదు. అలాంటప్పుడు లిక్విడ్ హ్యాండ్‌వాష్‌లో కాస్త చక్కెర వేసి ఆ మిశ్రమంతో చేతుల్ని శుభ్రం చేసుకుంటే గ్రీజు మరకలు పోతాయి. ఇక మనం గార్డెన్‌లో పని చేస్తున్నప్పుడు దుస్తులకు మట్టి అంటుకోవడం సహజం. దీన్ని సులభంగా వదిలించుకోవాలంటే గోరువెచ్చటి నీటిలో కాస్త చక్కెర వేసి పేస్ట్ లాగా కలుపుకోవాలి. దీన్ని మరక ఉన్న చోట పూసి గంట పాటు పక్కన పెట్టాలి. ఆ తర్వాత శుభ్రం చేస్తే సరిపోతుంది.

వెండి వస్తువులు మెరవాలంటే..

ఉప్పు గాలి, నీరు కారణంగా వెండి వస్తువులు కొన్ని రోజులకు మెరుపును కోల్పోతాయి. మరి, అలాంటి వాటిని తిరిగి మెరిపించడానికి చక్కెర ఉపయోగపడుతుంది. ఇందుకోసం.. ఒక పాత్రలో మూడు టేబుల్ స్పూన్ల చక్కెర తీసుకొని అందులో టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసి చక్కెర కరిగేంత వరకు బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వెండి వస్తువులు కడగడానికి ఉపయోగిస్తే సరి.. అవి తళతళా మెరిసిపోవడం ఖాయం.

తుప్పు వదలగొట్టండిలా..!

సామాన్లకు పట్టిన తుప్పును వదలగొట్టే శక్తి చక్కెరకు ఉంది. ఒక నిమ్మకాయ రసాన్ని తీసుకొని అందులో మూడు టేబుల్‌స్పూన్ల చక్కెర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తుప్పు పట్టిన వస్తువులపై వేసి కడిగితే అవి సులభంగా శుభ్రపడతాయి.

ఫ్లోర్‌పై మరకలు పడ్డాయా?

టైల్స్‌పై ఏదైనా మరక పడితే అంత సులభంగా వదలదు. అలాంటప్పుడు ఆ మరకను చక్కెరతో శుభ్రపరిస్తే సరి. ఇందుకోసం ఒక గిన్నెలో నాలుగు టేబుల్‌స్పూన్ల వెనిగర్, కొద్దిగా చక్కెర తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమంలో దూదిని ముంచి, మరక ఉన్న చోట రుద్దాలి. అంతే.. మరక ఇట్టే వదిలిపోతుంది.

మరిన్ని..

ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత చేతులకు అంటుకున్న వాసన పోవాలంటే.. టేబుల్‌స్పూన్ చక్కెరకు టీస్పూన్ లిక్విడ్ హ్యాండ్‌వాష్ కలిపి ఆ మిశ్రమంతో చేతుల్ని రుద్దుకోవాలి. ఫలితంగా చేతుల నుంచి వాసన రాకుండా జాగ్రత్తపడచ్చు.

మూడు టేబుల్ స్పూన్ల చక్కెరకు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కలిపి కొన్ని నీళ్లు పోసి చిక్కగా చేసుకోవాలి. ఈ మిశ్రమంతో పాత్రలను శుభ్రం చేస్తే అవి మరింతగా శుభ్రపడతాయి. ఎందుకంటే ఇది సహజసిద్ధమైన డిటర్జెంట్‌లా పనిచేసి.. వాటిని మెరిపిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్